Sunday, April 28, 2024

మరీ వెనుకబడిన ఇండియా

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధోరణిలో భాగంగానే, భారత దేశం విషయంలో కూడా మానవాభివృద్ధి సూచికల విలువ 2019లో 0.645 నుండి 2021లో 0.633కి తగ్గింది. 191 దేశాల్లో భారత దేశానికి 132వ ర్యాంకు దక్కింది. 1990లో 144 దేశాల్లో 114వ ర్యాంకు సాధించిన భారతదేశం క్రమంగా కిందికి దిగజారింది. 2019లో పురుషుల ఆయుర్దాయం 69.5 ఏళ్లు, స్త్రీల ఆయుర్దాయం 72 ఏళ్లు కాగా, 2020లో ఇది పురుషులకు 67.5 ఏళ్లకు – అంటే రెండేళ్లు తగ్గింది. అలాగే స్త్రీలకు 69.8 ఏళ్లకు (2.2 ఏళ్ళు) తగ్గింది” అని మానవాభివృద్ధి నివేదిక పేర్కొంది. మొత్తం జనాభా సగటు ఆయుర్దాయం 69.7 నుండి 67.2 సంవత్సరాలకు తగ్గింది.

భారత దేశంలో పాఠశాల విద్య 11.9 సంవత్సరాలు కొనసాగించవచ్చని అంచనా. పాఠశాల విద్యను అభ్యసించిన సగటు కాలం 6.7 సంవత్సరాలు. తలసరి జాతీయ ఆదాయం 6,590 డాలర్లతో మధ్యస్థ మానవ అభివృద్ధి విభాగంలో ఉంది. ఇది దేశంలో ఉన్న అసమానతలకు అద్దం పడుతుంది. 40% మంది జనాభా చేతిలో మొత్తం ఆదాయంలో 20% ఉండగా, ఒక్క శాతం ధనికుల చేతిలో 22% ఆదాయం ఉంది. కొవిడ్ 19 ఎక్కువగా 39- 69 ఏళ్ల మధ్య వయస్సులోని పురుషుల ప్రాణాలను బలి తీసుకొంది. కుటుంబాలకు ఆలంబనగా ఉండే పురుషుల మరణాలు ఎక్కువ కావడంతో ప్రజల ఆర్ధిక స్థితిగతులు బాగా దెబ్బతిన్నాయి. మానసిక శ్రమ చేసే వారిలో కంటే శారీరక శ్రమ చేసే వారిలో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అదే కాలంలో మన పక్కనున్న చైనా 103వ ర్యాంకు నుంచి 84వ ర్యాంకుకు ఎగబాకింది. మధ్యస్థ విభాగంలోనే ఉన్న మొరాకో, భూటాన్, బంగ్లాదేశ్ మొదలైన దేశాలు మన కంటే ఎక్కువ మానవాభివృద్ధిని కనపరచాయి. ఇది మన వెనుకబడిన జీవన నాణ్యతను సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా బంగ్లాదేశ్ ఆదాయం పరంగా ర్యాంకింగ్‌లో తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ అధిక స్థాయి హెచ్‌డిఐ ర్యాంకింగ్‌ను దక్కించుకొంది. ఇది దాని భౌతిక పరిమితులకు మించి తన ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించడంలో సఫలీకృతమైందని స్పష్టం చేస్తున్నది.

జెండర్ డెవలప్‌మెంట్ సూచికల విలువకు సంబంధించి భారతదేశం 132వ స్థానాన్ని నిలుపుకున్నప్పటికీ ప్రపంచ దేశాల సగటు విలువ 0.984 పాయింట్లు ఉండగా భారతదేశం 0. 849 పాయింట్లు మాత్రమే నమోదు చేసింది. సంబంధిత కాలంలో స్త్రీల పాఠశాల విద్య సగటు సంవత్సరాలు 12.6 నుండి 11.9 సంవత్సరాలకు తగ్గాయి. కొవిడ్ -19 మహమ్మారి ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాన్నే కాకుండా ఆర్థిక వ్యవస్థలను కూడా నాశనం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ పురుషుల మధ్య అసమానతలను తీవ్రతరం చేసింది. ఈ అసమానతల పెరుగుదల 6.7 శాతం ఉంది. బంగ్లాదేశ్, భూటాన్ వంటి దక్షిణాసియాలోని చిన్న ఆర్థిక వ్యవస్థలు ఈ ధోరణిని నిలువరించి అభివృద్ధిని నమోదు చేసుకొన్నాయి.

గత మూడు దశాబ్దాల పోకడలు చూస్తే భారతదేశం తన హెచ్‌డిఐ స్కోర్‌ను వార్షిక సగటు రేటు 1.42% తో పెంచిందని సూచిస్తున్నాయి. ఇది మొత్తం అభివృద్ధి చెందుతున్న దేశాలు సాధించిన ఒక శాతం సగటు వార్షిక వృద్ధితో పోలిస్తే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ భారతదేశం ఇప్పటికీ అనేక ఇతర ఆసియా దేశాలైన చైనా (1.47%), బంగ్లాదేశ్ (1.64% ), కంబోడియా (1.66%), మయన్మార్ (1.86%) కంటే వెనుకబడి ఉందనే విషయం అర్ధం చేసుకోవాలి.
2022 మే మాసంలో ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ బిబెక్ దేబ్రాయ్ ‘భారతదేశంలో అసమానత స్థితి నివేదిక’ ను విడుదల చేశారు. ఆరోగ్యం, విద్య, గృహ సంబంధిత లక్షణాలు, లేబర్ మార్కెట్ రంగాలలో నెలకొన్న అసమానతలు దేశ జనాభాలో మరింత దుర్బలత్వాన్ని పెంచుతున్నాయని,వారిని బహుముఖమైన పేదరికంలోకి నెడుతున్నాయని ఆ నివేదిక పేర్కొంది.

ప్రపంచ అసమానత నివేదిక 2022 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన అసమానతలు నెలకొన్న దేశంగా భారత దేశాన్ని గుర్తించారు. ‘భారత దేశం చాలా పేద దేశం, అసమానతలు అధికంగా ఉన్న దేశం. అదే సందర్భంలో చాలా అత్యంత సంపన్న వర్గం గల దేశంగా’ ఈ నివేదికలో పేర్కొన్నారు. మొత్తం జాతీయ ఆదాయంలో 57 శాతం ఆదాయం దేశ జనాభాలో అత్యంత ధనికులుగా ఉన్న 10 శాతం మంది చేతిలో ఉందని, 22 శాతం ఆదాయం కేవలం ఒక్క శాతం అగ్రశ్రేణి ధనికుల దగ్గర ఉందని ఈ నివేదిక తెలిపింది. దేశ జనాభాలో ఒక చిన్న విభాగం 5- నక్షత్రాల సౌకర్యాలను, అధికారాలను అనుభవిస్తున్నప్పటికీ, దిగువనున్న 50 శాతం మందికి స్థిరమైన జీవితం ఇప్పటికీ సాధించలేని సవాలుగానే ఉంది.
ఉపాధి, ఉద్యోగావకాశాల లేమి, అస్థిరమైన అసంఘటిత రంగం, పెరుగుతున్న పేదరికం, ద్రవ్యోల్బణం, ప్రభుత్వరంగ ఆస్తుల ప్రైవేటీకరణ మొదలైన అనేక కారణాల వల్ల సామాన్యుడికి స్థిరత్వం చిక్కడం లేదు.

దిగువన ఉన్న 50 శాతం మంది కంటే పైనున్న 10 శాతం మంది 20 రెట్లు ఎక్కువ ఆదాయం పొందుతున్నారని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 93 శాతం మంది భారతీయులు ఆ సంస్థ నిర్దేశించిన ప్రమాణాలను మించిన స్థాయిల్లో వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఫలితంగా భారతదేశంలో ఆయుర్దాయం దాదాపు 2.2 సంవత్సరాలు తగ్గిపోయిందని వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను పాటిస్తే ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిదేళ్లకు, బీహార్‌లో ఏడేళ్లకు పైగా, పశ్చిమ బెంగాల్లో దాదాపు ఆరేళ్లు ప్రజల సగటు ఆయుర్దాయం పెరుగుతుంది. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సగటున ఐదేళ్లు, గుజరాత్‌లో మూడేళ్లు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులలో రెండేళ్లు సగటున మనిషి ఆయుర్దాయం పెరుగుతుంది.

ప్రపంచంలోకెల్లా అత్యంత కాలుష్యంతో నిండిన దేశం మనదే. వాతావరణంలో చాలా సూక్ష్మమైన 2.5 మిల్లీగ్రాముల బరువు గల్గిన కాలుష్యకారకాలు మనిషి పీల్చుకొనే గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి, రక్తంలోకి చొరబడి ప్రాణాలు తీస్తున్నాయి. 2019లో భారతదేశంలో 11 లక్షలమంది మరణాలకు కారణం ఈ సూక్ష్మకణాలే కారణమని వాషింగ్టన్‌లోని హెల్త్ ఎఫెకట్స్ ఇన్‌స్టిట్యూట్ ఒక అధ్యనంలో పేర్కొంది. మన దేశం లో కాలుష్యానికి ప్రధాన కారణాలు: వాహన కాలుష్యం, పారిశ్రామిక ఉద్గారాలు, థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, నిర్మాణ రంగం నుంచి వెలువడే దుమ్ము, ధూళి, వ్యర్థాలను కాల్చడం, లక్షలాది మంది పేదలు వంట కోసం కట్టెలు, పిడకలు వాడటం. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో మొదటి పది, మన దేశ రాజధానితో సహా ఉత్తర భారతంలోనే ఉన్నాయి.

వాయు కాలుష్యం కారణంగా ప్రపంచ జనాభా సగటు ఆయుర్దాయం 2.2 సంవత్సరాలు తగ్గిందని ఈ సంస్థ నివేదిక పేర్కొంది. కాలుష్యం వలన ముప్పు -మద్యపానం, సురక్షితమైన తాగునీరు లేని సమస్య కంటే మూడు రెట్లు ఎక్కువగా , హెచ్‌ఐవి /ఎయిడ్స్ కంటే ఆరు రెట్లు, ఘర్షణలు, ఉగ్రవాదం కంటే 89 రెట్లు ఎక్కువగా ఉంది. ‘ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయినప్పటికీ కొవిడ్ మహమ్మారి తగులుకొన్న మొదటి సంవత్సరంలో ప్రపంచ కాలుష్యంలో మాత్రం ఎలాంటి తగ్గుదల లేకుం డా స్థిరంగానే ఉంది. దీనిని బట్టి ఈ మొండి సమస్య పరిష్కారానికి చాలాబలమైన విధానాలు అవసరమని నివేదిక పేర్కొంది.

గత దశాబ్ద కాలంగా ఒత్తిడి, దుఃఖం, కోపం, ఆందోళన వంటివి పెరుగుతున్నాయని, ఇప్పుడు అవి రికార్డు స్థాయికి చేరుకున్నాయని; అనిశ్చితి, అసమానత, అభద్రత, అపనమ్మకం, అవిశ్వాసం మన సమాజాలను క్షీణింప చేస్తున్నాయని, ఇవన్నీ కలగలసి రాజకీయ అస్థిరతకు దారి తీస్తున్నాయని, ప్రజల జీవితాన్ని అనిశ్చితికి గురి చేస్తున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది. మనుషుల్లో కలుపుగోలుతనం, పరస్పర నమ్మకం లేకపోవడంతో సామాజికంగా ఒకరితో మరొకరు సంభాషించుకొనే సామర్ధ్యాన్ని కోల్పోయారు. ఈ ధోరణి సమస్యల పరిష్కారానికి సామూహిక కృషి జరగకుండా అణచివేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం కంటే తక్కువ మంది ప్రజలు మాత్రమే ఇతరులను విశ్వసించవచ్చని అనుకొంటున్నారని నివేదిక పేర్కొంది. అంటే 70% ప్రజలకు ఎవరి మీద నమ్మకం లేకుండా పోయిందనే అర్ధం చేసుకోవాలి. సంపన్న వర్గాల్లోని అధికులు అభద్రత భావంతో ప్రజాస్వామ్యానికి మద్దతు పలకడంలేదు. రాజకీయ హింసను సమర్ధిస్తున్నారని కూడా స్పష్టం చేసింది.

ప్రపంచం కొవిడ్-19 పూర్వ స్థితిలోకి ప్రయా ణం చేయటం లేదు. దీనికి విరుద్ధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు లింగ వివక్షను పెంచే, బలహీన వర్గాలను మరింత పతనావస్థకు చేర్చే విభిన్నమైన, పదునైన ప్రతికూల సామాజిక, రాజకీయ, ఆర్థిక విధానాలను అలవరచుకొంటున్నాయని ఆవేదన కనపర్చింది. మనిషి మస్తిష్కంలోని ‘నేను, నాది, నా ఇష్టం’ అనే భావజాలం ఈ భూమ్మీది సర్వ జీవుల జీవనాన్ని ఎలా మార్చేస్తున్నాయో అర్ధమవుతోంది.

బిలియన్లు డాలర్లు వెచ్చించి సాధించే అమరత్వం ఏ ధర్మరాజును వరిస్తుందో తెలియదు కానీ సామాన్యులంతా కైలాస మార్గంలో మిగిలిన పాండు పుత్రులు, ద్రౌపది లానే అసువులు బాయవలసిందే. ప్రజలే స్వయంగా మానవాభివృద్ధి సూచీల అమలుకు దిగితే, పౌరులుగా, వ్యక్తులుగా భిన్నాభిప్రాయాన్ని గౌరవించడం, భిన్న సంస్కృతుల పట్ల సహనాన్ని అలవరచుకోవడం, శాంతిని ధ్యానించడంనేర్చుకొంటే, దురాశను, దుర్నీతిని వదులుకొని, సమానతను స్వాగతిస్తూ, మానవ హక్కులను హరించకుండా బతుకు ప్రయాణంలో ముందుకు సాగితే ప్రతి మనిషి ఖచ్చితంగా నూరేళ్ళ మజిలీకి చేరుకొంటాడు. అభివృద్ధి పథంలో విజయ పతాకాన్ని ఎగురేస్తాడు.

పరుచూరు జమున
9704111390

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News