Saturday, April 27, 2024

మార్లోన్ శామ్యూల్స్‌పై వేటు.. ఆరేళ్లు నిషేధం విధించిన ఐసిసి

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ మార్లోన్ శామ్యూల్స్‌పై ఐసిసి నిషేధం విధించింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు యాంటీ కరప్షన్ కోడ్‌ను ఉల్లంఘించాడంటూ శామ్యూల్స్‌పై 2021లో మొత్తం నాలుగు అభియోగాలు నమోదయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ఐసీసీ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ ఏడాది ఆగస్టులో అతన్ని దోషిగా తేల్చారు. ఈ నేపథ్యంలోనే అన్నిరకాల క్రికెట్ వ్యవహారాల నుంచి శామ్యూల్స్‌ను ఆరేళ్ల పాటు నిషేధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ నిషేధం నవంబర్ 11 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

ఐసీసీ హెచ్‌ఆర్ అండ్ ఇంటిగ్రిటీ యూనిట్‌కు చెందిన అలెక్స్ మార్షల్.. గురువారం ఓ ప్రకటనలో ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. ’రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన శామ్యూల్స్.. అనేకసార్లు యాంటీ కరప్షెన్ కోడ్‌ను ఉల్లంఘించాడు. ఈ నిబంధనల గురించి అతనికి బాగా తెలుసు. అయినా రూల్స్ అతిక్రమించాడు. దాంతోనే ఐసీసీ నిబంధనల ప్రకారం అతనిపై నిషేధం విధిస్తున్నాం.’అని మార్షల్ తెలిపాడు.

18 ఏళ్ల కెరీర్‌లో శామ్యూల్స్ వెస్టిండీస్ తరుఫున దాదాపు 300లకు పైగా మ్యాచ్‌లు ఆడి 17 సెంచరీలు నమోదుచేశాడు. వన్డేల్లో వెస్టిండీస్‌కు సారథ్యం కూడా వహించాడు. 2012, 2016లలో వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఈ రెండు టోర్నీల ఫైనల్ మ్యాచ్‌ల్లో అతనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ తరఫున 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20 మ్యాచ్‌లు ఆడిన శామ్యూల్స్.. 11,134 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 152 వికెట్లు పడగొట్టాడు. మూడేళ్ల క్రితమే అతను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News