Tuesday, May 14, 2024

ఆత్మవిశ్వాసంతో భారత్

- Advertisement -
- Advertisement -

ఆత్మవిశ్వాసంతో భారత్
గెలుపు కోసం ఇంగ్లండ్, నేడు మూడో టి20

అహ్మదాబాద్: భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య మంగళవారం మూడో ట్వంటీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై పట్టుబిగించాలని ఇటు టీమిండియా అటు ఇంగ్లండ్ తహతహలాడుతున్నాయి. ఆదివారం జరిగిన రెండో టి20లో ఘన విజయం సాధించిన విరాట్ కోహ్లి సేన ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది. కిందటి మ్యాచ్‌లో ఓడినా ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయలేంది. తొలి టి20లో భారత్‌ను చిత్తుగా ఓడించిన విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. రెండు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయమనే చెప్పాలి.
రోహిత్‌కు చాన్స్?
తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కెఎల్ రాహుల్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ నిరాశ పరిచాడు. తొలి టి20లో శిఖర్ ధావన్ కూడా విఫలమయ్యాడు. ఇలాంటి స్థితిలో రోహిత్‌ను దించడమే మంచిదనే నిర్ణయానికి జట్టు యాజమాన్యం వచ్చినట్టు సమాచారం. అయితే దీనిపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక అరంగేట్రం మ్యాచ్‌లోనే విధ్వంసక ఇన్నింగ్స్‌తో అదరగొట్టి ఏకంగా మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన ఇషాన్ కిషన్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లోనూ రాణించి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తున్నాడు.
కోహ్లిపైనే అందరి కళ్లు
కిందటి మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈసారి కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే కోహ్లి తనదైన శైలీలో విజృంభిస్తే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. కోహ్లి ఫామ్‌లోకి రావడం భారత్‌కు శుభసూచకంగా చెప్పొచ్చు. ఇక శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు కూడా జోరుమీదున్నారు. పంత్ తనదైన విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరిస్తున్నాడు. అయ్యర్ కూడా నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈసారి కూడా ఇద్దరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్ తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ కెరీర్‌కు శ్రీకారం చుట్టిన సూర్యకుమార్ యాదవ్‌కు ఇప్పటి వరకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అవకాశం లభిస్తే చెలరేగి పోయేందుకు సూర్య తహతహలాడుతున్నాడు. బౌలింగ్‌లో కూడా భారత్ సమతూకంగా కనిపిస్తోంది. భువనేశ్వర్, చాహల్, సుందర్, శార్దూల్, హార్దిక్‌లతో కూడిన పటిష్టమైన బౌలింగ్ విభాగం భారత్‌కు అందుబాటులో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ప్రతీకారం కోసం
మరోవైపు ఇంగ్లండ్ కూడా కిందటి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ బలంగానే ఉంది. అయితే నిలకడలేమి జట్టుకు సమస్యగా మారింది. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్, బౌలర్లు తమ పాత్ర సమర్థంగా పోషించాల్సిన అవసరం ఎంతైన ఉంది. కిందటి మ్యాచ్‌లో రెండు విభాగాల్లో ఇంగ్లండ్ విఫలమైంది. దీంతో ఘోర పరాజయం తప్పలేదు. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుకు సాగాలని తహతహలాడుతోంది. జాసన్ రాయ్, జోస్ బట్లర్, మోర్గాన్, బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, మార్క్‌వుడ్, స్టోక్స్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్ జట్టులో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరూ నిలదొక్కుకున్నా ఇంగ్లండ్‌కు భారీ స్కోరు ఖాయం. ఆర్చర్, వుడ్, ఆదిల్, స్టోక్స్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగానే కనిపిస్తోంది. దీంతో ఇంగ్లండ్‌ను ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా టీమిండియాకు మరోసారి చేదు అనుభవం ఖాయమనే చెప్పాలి. కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే.

IND vs ENG 3rd T20 Match on Tuesday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News