Friday, May 24, 2024

బయటకు ధీమా..లోపల గుబులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : సార్వత్రి క ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్ జరిగింది. గత ఎన్నికల తో పోల్చితే ఈ ఎన్నికలలో ఓటర్లు స్పష్టమైన అవగాహనతో ఓట్లు వేసినట్లు కనిపించడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు గె లుపుపై ధీమాతో ఉన్నారు. ఈ ఎన్నికల లో ఓటర్లు తమ స్వీయ అనుభవంలో ఉ న్న అంశాలను బేరీజు వేసుకుని ఎవరికి ఓట్లు వేయాలో ముందే నిర్ణయించుకుని ఎలాంటి అయోమయం లేకుండా చాలా స్పష్టమైన అవగాహనతో ఓట్లు వేసినట్లు తెలిసింది.కొత్త ఓటర్లు మాత్రం చివరి వ రకు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేక అయోమయానికి గురైనట్లు కనిపించింది. ఉదయం కొంత మందికొడిగా సాగిన పోలింగ్ మధ్యాహానికి ఊపందుకుంది. ఓటర్లు పోలింగ్ బూతులకు బారులు తీరారు. కొన్ని పోలింగ్ బూతులలో ఓట్లు వేసేందుకు ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరగా,మరికొన్ని పోలింగ్ బూతులలో మధ్యాహ్నం 3 తర్వాత ఓటర్లు చేరుకున్నారు. సాయంత్రం సమయంలో ఓటర్లు గంటల తరబడి

క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేశారు. అదే పట్టణ ప్రాంతాలలో మాత్రం ఉదయం 10 గంటల తర్వాతనే ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వెళ్లారు. గ్రామాలతో పోల్చితే నగరాలలో మాత్రం అంతగా క్యూ లైన్లు కనిపించలేదు. ఈ ఎన్నికలలో ఓటర్లు చాలా వరకు తమ మనసులోని అభిప్రాయాన్ని ఎవరితో పంచుకోకుండా మౌనంగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు ఎవరికివారు ధీమాగా ఉన్నారు. ఓటర్లు పోలింగ్ బూతుకు వెళ్లే సమయంలో ఎవరికి ఓటు వేయబోతున్నారని తెలుసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎంత ప్రయత్నించినా ఓటర్ మనసులోని అభిప్రాయాన్ని తెలుసుకోలేకపోయారు. ఓటు వేసి బయటకి వచ్చిన తర్వాత కూడా ఎవరి ఓటు వేశారో తెలియనీయకుండా నేతలను, విశ్లేషకులను ఓటర్లే అయోమయానికి గురి చేశారు. దాంతో పోలింగ్ ముగిసిన తర్వాత తాము కచ్చితంగా గెలుస్తామని చాలామంది ప్రధాన పార్టీల అభ్యర్థులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

పోలింగ్ సరళిని విశ్లేషించుకున్నట్లు అభ్యర్థుల
పోలింగ్ సరళిని చూసిన తర్వాత నియోజకవర్గాలలో అభ్యర్థులు పోలింగ్ సరళిని విశ్లేషించుకుంటున్నారు. పోలింగ్ శాతం, పోలింగ్ జరిగిన తీరు ఎలాంటి పరిణామాలకు దారిస్తుందోనని వివిధ పార్టీల నాయకత్వాల్లో కూడా ఆందోళన, చర్చ మొదలైనట్లు తెలిసింది. రాష్ట్రస్థాయి నేతలు జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులకు ఫోన్లు చేసి వాకబు చేస్తుండగా, నియోజకవర్గ స్థాయి నాయకులు ఆయా గ్రామాలు, మండలాలలోని నేతలకు ఫోన్లు చేసి పరిస్థితి కనుక్కొంటూ పోలింగ్ సరళిని తెలుసుకుంటున్నారు. పట్టణాలు, మండల కేంద్రాలలో నమోదైన పోలింగ్ శాతాన్ని తెలుసుకుని ఫలితాలను అంచనా వేసుకుంటున్నారు. ఓట్లు ఎక్కడైతే కచ్చితంగా తమకు పడతాయని అంచనా వేశారో అలాంటి చోట్ల అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దూరప్రాంతాలలో ఉన్న ఓటర్లను స్వస్థలాలకు రప్పించి ఓట్లు వేయించడంతో పాటు గ్రామాలు, పట్టణాలలో ఆయా పార్టీల కార్యకర్తలే ఓటర్లను పోలింగ్ బూతుల వరకు తీసుకెళ్లి ఓట్లు వేయించారు. కొన్ని ప్రాంతాలలో తమకు అనుకూలంగా ఉండే గ్రామాలలో ఓటింగ్ శాతంగా అంతగా లేకపోవడం కొంతమంది అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది.

కొంతమంది ధీమా..కొంతమందిలో ఆందోళన
ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో కొంతమంది కచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉండగా, మరికొంతమంది ఈసారి ఓడిపోతామేమో అన్న ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీల పరంగా నియోజకవర్గాలలో తమ బలం, బలహీనతలను అంచనా వేసుకుంటూ గెలుపు ఓటములపై అభ్యర్థులు విశ్లేషించుకున్నారు. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు గెలుపు ఓటములపై ఓ స్పష్టమైన అంచనాకు రాగా, మరికొంతమంది కొంచెం అటుఇటూగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News