భారత్‌కు పరీక్ష
ఆత్మవిశ్వాసంతో సౌతాఫ్రికా, నేడు కటక్‌లో రెండో టి20
కటక్: తొలి టి20లో పరాజయం పాలైన టీమిండియా ఆదివారం సౌతాఫ్రికాతోజరిగే రెండో మ్యాచ్ సవాల్‌గా మారింది. మొదటి మ్యాచ్‌లో 211 పరుగుల భారీ స్కోరును సాధించినా భారత్‌కు ఓటమి తప్పలేదు. బౌలర్ల ఘోర వైఫల్యం వల్ల టీమిండియాకు అనూహ్య పరాజయం ఎదురైంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. రెండో టి20లోనూ విజయమే లక్షంగా పెట్టుకుంది. ఈసారి కూడా బ్యాటర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకొంది. డుసెన్ ఫామ్‌లోకి రావడం డేవిడ్ మిల్లర్ దూకుడు మీద ఉండడం సౌతాఫ్రికాకు కలిసి వచ్చే అంశంగా మారింది. బౌలర్లు కూడా గాడిలో పడితే సౌతాఫ్రికా జట్టుకు ఎదురుండక పోవచ్చు. అయితే ఒక్క మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన టీమిండియాను తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కిందటి మ్యాచ్‌లో మెరుగ్గా రాణించిన ఓపెనర్ ఇషాన్ కిషన్ ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. రుతురాజ్‌తో కలిసి అతను మరోసారి శుభారంభం అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ రిషబ్ పంత్, ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక దినేష్ కార్తీక్ రూపంలో మరో మ్యాచ్ విన్నర్ బ్యాట్స్‌మన్ జట్టుకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ఒకరిద్దరూ నిలదొక్కుకున్నా టీమిండియాకు మరోసారి భారీ స్కోరు కష్టం కాక పోవచ్చు. ఇక కటక్‌లో చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతోంది. దీంతో పిచ్ ఎలా ఉంటుందనేది అంతుబట్టకుండా మారింది. ఇలాంటి స్థితిలో టాస్ కీలకంగా మారే అవకాశం ఉంది. కానీ రెండు జట్లలోనూ టి20 స్పెషలిస్ట్‌లకు కొదవలేదు. దీంతో టాస్‌కు ప్రాధాన్యత ఉండక పోవచ్చు.
జోరుమీదున్నారు..
మరోవైపు మిల్లర్ భీకర ఫామ్‌లో ఉండడం సౌతాఫ్రికాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. గుజరాత్‌కు ఐపిఎల్ ట్రోఫీ అందించడంలో మిల్లర్ పాత్ర చాలా కీలకం. పలు మ్యాచుల్లో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ఇక అదే జోరును తొలి టి20లోనూ కొనసాగించాడు. తాజాగా డుసెన్ కూడా ఫామ్‌లోకి రావడం సఫారీలకు మరింత కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో వీరిద్దరూ వీరోచిత బ్యాటింగ్‌తో సౌతాఫ్రికాకు సంచలన విజయం సాధించి పెట్టారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. ఇక కెప్టెన్ బవుమా, ఓపెనర్ డికాక్, ప్రెటోరియస్ తదితరులతో సౌతాఫ్రికా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక రబాడ, షమ్సి, నోర్జే, మహారాజ్, పార్నెల్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా సౌతాఫ్రికా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
IND vs SA 2nd T20 Match today