Thursday, May 2, 2024

భారత్ 263 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

India

 

విహారి శతకం, రాణించిన పుజారా, న్యూజిలాండ్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్

హామిల్టన్: న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకే ఆలౌటైంది. తెలుగు తేజం హనుమ విహారి (101) శతకంతో జట్టును ఆదుకున్నాడు. మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా (93) తప్ప మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. కివీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా ఈ మ్యాచ్‌ను నిర్వహించారు. శుక్రవారం ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.

ఆరంభంలోనే
ఈ నిర్ణయం తప్పని ప్రారంభంలోనే తేలిపోయింది. ఓపెనర్ పృథ్వీ షా ఇన్నింగ్ తొలి ఓవర్‌లోనే ఇంటిదారి పట్టాడు. కుగేల్‌జిన్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా వెనుదిరిగాడు. ఒక పరుగు మాత్రమే చేసిన మయాంక్ కుగేల్‌జిన్ చేతికే చిక్కాడు. కొంతకాలంగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న మయాంక్ సన్నాహక మ్యాచ్‌లోనూ నిరాశ పరిచాడు. వన్డేల్లో మూడు ఇన్నింగ్స్‌లలో కూడా మయాంక్ తక్కువ స్కోరుకే ఔటైన విషయం తెలిసిందే.

ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగాడు. తర్వాతి బంతికే శుభ్‌మన్ గిల్ కూడా ఔటయ్యాడు. కుగేల్‌జిన్ అసాధారణ బంతితో గిల్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో భారత్ ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను హనుమ విహారి తనపై వేసుకున్నాడు. అతనికి అజింక్య రహానె అండగా నిలిచాడు. ఇద్దరు కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. కానీ, 18 పరుగులు చేసిన రహానేను నిశమ్ వెనక్కి పంపాడు. దీంతో భారత్ 38 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను చేజార్చుకుని పీకల్లోతూ కష్టాల్లో చిక్కుకుంది.

ఆదుకున్న విహారి, పుజారా
ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వందలోపే ఆలౌట్ కావడం ఖాయంగా కనిపించింది. కానీ, విహారి, చటేశ్వర్ పుజారాలు అసాధారణ పోరాట పటిమతో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. సమన్వయంతో ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు కివీస్ ఎలెవన్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు పుజారా, అటు విహారిలు కుదురు కోవడంతో భారత్ కోలుకుంది. ఇదే సమయంలో జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. వీరిని ఔట్ చేసేందుకు ప్రత్యర్థి కెప్టెన్ తరచూ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన విహారి, పుజారాలు అర్ధ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. అంతేగాక స్కోరు 200 పరుగులు దాటించారు.

సెంచరీ మిస్
ఇదిలావుండగా అద్భుత బ్యాటింగ్‌తో కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన మిస్టర్ డిపెండబుల్ పుజారా సెంచరీ వైపు సాగాడు. అతని జోరును చూస్తుంటే శతకం సాధించడం ఖాయంగా కనిపించింది. కానీ, 211 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 93 పరుగులు చేసిన పుజారాను గిబ్సన్ వెనక్కి పంపాడు. దీంతో శతకం చేయకుండానే పుజారా పెవిలియన్ చేరాడు. కాగా, అప్పటికే విహారితో కలిసి పుజారా ఐదో వికెట్‌కు 195 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన హనుమ విహారి శతకాన్ని అందుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న విహారి 182 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, మరో పది ఫోర్లతో 101 పరుగులు చేసి రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

చివర్లో తేలిపోయారు
పుజారా ఔటైన వెంటనే భారత్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. యువ ఆటగాడు రిషబ్ పంత్ మరోసారి నిరాశ పరిచాడు. ఏడు పరుగులు మాత్రమే చేసి ఐష్ సోధి బంతికి పెవిలియన్ చేరారు. మరోవైపు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ కూడా సున్నాకే ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 8 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఉమేశ్ యాదవ్ 9 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో కుగేల్‌జిన్, సోధి మూడేసి వికెట్లు పడగొట్టారు. గిబ్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

India 263 Allout
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News