Sunday, April 28, 2024

బెకా బంధం

- Advertisement -
- Advertisement -

India and US signed Basic Exchange and Cooperative Agreements

 

ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకు తనకు మధ్య అమెరికా ద్వేష బీజాలు చల్లుతున్నదని చైనా వ్యాఖ్యానించిందంటే మంగళవారం నాడు న్యూఢిల్లీలో భారత అమెరికాల మధ్య సంతకాలు జరిగిన రక్షణ ఒప్పందం ఎంతటి ప్రధానమైనదో తెలుస్తున్నది. ఈ ఒప్పందం చైనా గుండెల్లో గుబులురేపుతున్న విషయం అర్థమవుతున్నది. రక్షణ రంగంలో అత్యంత సాన్నిహిత్య సహకారాలకు, పటిష్ఠమైన సైనిక బంధానికి దోహదం చేసే మౌలిక సమాచార మార్పిడి, సహకార ఒప్పందం (బేసిక్ ఎక్సేంజ్ అండ్ కోపరేటివ్ అగ్రిమెంట్ బెకా) సహా ఐదు ఒప్పందాలపై మంగళవారం నాడు భారత అమెరికాలు సంతకాలు చేశాయి. ఇందుకోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ అమాత్యులు మార్క్ ఎస్పర్ సోమవారం నాడు న్యూఢిల్లీ వచ్చారు. ఇటీవల లడఖ్ వద్ద చైనా సేనల దాడిలో మరణించిన 20 మంది భారత యోధుల స్మారక స్థలాన్ని అమెరికా మంత్రులిద్దరు సందర్శించారు. మంత్రుల స్థాయి చర్చల తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో దానిని ప్రస్తావించారు. తమ రెండు దేశాల సార్వభౌమత్వానికి, స్వేచ్ఛకు ముప్పు ఎదురవుతున్నందున అమెరికా ఇండియాకు దన్నుగా ఉంటుందని ఆ ప్రకటనలో పాంపియో పేర్కొన్నారు.

భారత పర్యటన ముగించుకొని ఆయన శ్రీలంక, మాల్దీవులను కూడా సందర్శిస్తారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు బీజింగ్‌లో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు సమాధానమిస్తూ అమెరికా ఈ ప్రాంత దేశాలకు తమకు మధ్య అమిత్ర బీజాలు చల్లుతున్నదని అన్నారు. భారత అమెరికాల మధ్య ఇప్పుడు కుదిరిన బెకా ఒప్పందం రక్షణ వ్యూహాత్మక రంగాల్లో రెండు దేశాలూ కుదుర్చుకోదలచిన నాలుగు పునాది అవగాహనల్లో చిట్ట చివరిది, అత్యంత కీలకమైనది. ఈ వరుసలోని మిగతా మూడింటినీ 2002, 2016, 2018 సంవత్సరాలలో కుదుర్చుకున్నాయి. బెకా కింద ఉభయ దేశాలు రక్షణకు సంబంధించిన మ్యాపులు తదితర సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. అమెరికాకు గల అత్యాధునికమైన, అతిసమర్థవంతమైన రక్షణ సాంకేతిక నైపుణ్యం, శోధనాశక్తి మనకు ఎంతగానో ఉపయోగపడే అవకాశమున్నది. మనపట్ల శత్రుభావంతో ఉన్న దేశాల ముఖ్యంగా చైనా, పాకిస్థాన్‌ల రక్షణ సన్నద్ధతను తెలుసుకోడానికి అవకాశమిచ్చే అంశాలను అమెరికా మనకు సరఫరా చేయడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుంది.

తన ఉపగ్రహాలు, సుదూర గ్రాహక స్పెన్సర్ల ద్వారా అది సమకూర్చుకునే విషయాలను మనం పొందవచ్చు. అవి శత్రు దేశాలతో మనకు ఘర్షణలూ, యుద్ధాలూ తలెత్తినప్పుడు క్షిపణులను, ఇతర ఆయుధాలను గురి తప్పకుండా ప్రయోగించడంలో ఉపయోగపడతాయి. చైనాతో ఇటీవల ఏర్పడిన నూతన ఉద్రిక్త వాతావరణంలో బెకా ఒప్పందానికి విశేష ప్రాధాన్యమున్నది. ఈ ఒప్పందం ద్వారా మనం సంగ్రహించుకోగల సమాచారం హిందూ మహాసముద్రంలో చైనా యుద్ధ నౌకల కదలికలను తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది. పాకిస్థాన్ భూభాగంలోని బటాలపై మన వైమానిక దళం గతంలో జరిపిన మెరుపు దాడుల వంటి సందర్భాల్లో అవి ఎంత వరకు విజయవంతమయ్యాయో తెలుసుకోడానికి కూడా బెకా కింద అమెరికా చేసే సహకారం తోడ్పతుంది. వాస్తవానికి అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత గత నాలుగేళ్లలో మన ప్రధాని మోడీకి ఆయనకు మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం భారత అమెరికాలను అపూర్వ స్థాయిలో చేరువ చేసింది. గత జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలో మన సైనికులపై చైనా సేనలు జరిపిన మొరటు దాడిని ఏ ఇతర దేశం కంటే ఎక్కువగా స్పష్టంగా నిర్దంద్వంగా అమెరికా ఖండించింది.

అలాగే భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ల మధ్య ఇండో పసిఫిక్ ప్రాంత జలాలను స్వేచ్ఛగా ఉంచే లక్షంతో ఉద్దేశించిన చతుర్ముఖ (క్వాడ్) ఒప్పందం ఇప్పుడు క్రియాశీలకంగా మారుతున్నది. ఈ ఒప్పంద సన్నాహాల పట్ల కూడా చైనా గుర్రుగా ఉంది. అమెరికాతో కలిసి మనం తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నామనే భావనను అది రోజురోజుకూ పెంచుకుంటున్నది. వాస్తవాధీన రేఖ పొడుగునా మన భూభాగంలో మనం మెరుగుపర్చుకుంటున్న రోడ్లు, వంతెనలు వంటి మౌలిక సౌకర్యాల పట్ల కూడా చైనా అసంతృప్తితో ఉంది.

అయితే గతంలో మనం పాటించిన అలీన విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పి అమెరికాతో అపూర్వమైన మైత్రిని పెంపొందించుకోడం మనకు ఎంత వరకు ప్రయోజనకరమనేది చర్చనీయాంశమే. ఎందుకంటే చైనా, పాకిస్థాన్‌లతో పాటు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి ఇతర పొరుగు దేశాలతో కూడా దూరం పెరుగుతుండగా సుదూరంలోని అమెరికాతో దాని అనుకూల దేశాలతో అనుబంధాలను మితిమించి పటిష్ఠం చేసుకోడం ఆశించినంత శ్రేయస్సును చేకూర్చదనే అభిప్రాయమూ ఉన్నది. విజయదశమి సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన ప్రసంగంలో కూడా పొరుగునున్న చిన్న దేశాలతో సఖ్యతకు ప్రాధాన్యమివ్వాలని సూచించిన విషయం గమనించదగినది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News