Tuesday, May 14, 2024

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య ఒప్పందం

- Advertisement -
- Advertisement -

India-Australia Trade Agreement

ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు
ఇరు దేశాల సంబంధాల్లో ఇదో మైలురాయని ప్రధాని మోడీ వ్యాఖ్య
10 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని పీయూష్ గోయల్ ఆశాభావం

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల ఇరు దేశాలు ఇప్పుడున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడానికి వీలు కలగడంతో పాటుగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్, పర్యాటకుల మార్పిడికి వీలు కలుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం వర్చువల్‌గా జరిగిన ఒక కార్యక్రమంలో భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోడీ, స్కాట్‌మారిసన్‌ల సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, డాన్ టెహాన్‌లు ‘ ఇండియా ఆస్ట్రేలియా ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. ఇంత తక్కువ సమయంలో ఈ ఒప్పందం కుదరడం ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసానికి నిదర్శనమని ప్రధాని మోడీ అన్నారు. ఇరు దేశాలు ఒకరి అవసరాలు మరొకరు తీర్చడానికి ఎంతో అవకాశముందని, ఆ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

భారత్, ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న సంబంధాలకు ఈ ఒప్పందం మరో మైలురాయని ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ అన్నారు. ఇరు దేశాల మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాలను పొంపొందించడంతో పాటుగా ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న సంబంధాలను ఈ ఒప్పందం మరింతగా బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. కాగా ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య సహకార స్ఫూర్తి, ఐక్యతకు నిదర్శనమని ఒప్పందంపై సంతకాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ పీయూష్ గోయల్ అన్నారు. ఇది భారత దేశానికి చరిత్రాత్మకమైన రోజని అన్నారు. అతిపెద్ద అభివృద్ధి చెందిన దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఓదశాబ్దంలో ఇదే మొదటిసారని అన్నారు. రానున్న నాలుగైదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ప్రస్తుతం ఉన్న 27 బిలియన్ డాలర్లనుంచి 4550 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని, తద్వారా 10లక్షల ఉద్యోగావకాశాలువస్తాయని ఆశిస్తున్నట్లు గోయల్ చేప్పారు. సేవా రంగంలో కూడా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని చెప్పారు. ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు రెండేళ్లనుంచి నాలుగేళ్ల వరకు పోస్ట్ స్టడీ వర్క్ వీసాల జారీ కూడా ఈ ఒప్పందంలో భాగమేనని తెలిపారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు వర్క్, హాలిడే వీసాలకోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత శాస్త్రాల్లో పోస్ట్ స్టడీ వర్క్ వీసాల జారీకి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే వారం తాను ఆస్ట్రేలియాలో పర్యటిస్తానని, ఆ దేశంలోని వ్యాపార దిగ్గజాలతో,భారత దేశ వాణిజ్య ప్రతినిధులతో చర్చిస్తానని పీయూష్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News