న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర సమయంలో దేశ సైన్యంపై అనుచిత వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు సోమవారం మందలించిన విషయం తెలిసిందే. కాగా రాహుల్‌పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని, రాహుల్ వ్యాఖ్యలు సరైనవేనంటూ ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పలు పార్టీలు అభిప్రాయపడ్డాయి. జాతీయ అంశాలను ప్రశ్నించే బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంటుందని స్పష్టం చేశాయి. ఈ అంశంపై ఇండియా కూటమిలోని పలు పార్టీలకు చెందిన సభాపక్ష నేతలు మంగళవారం సమావేశమై చర్చించారు.
‘రాజకీయ పార్టీల ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా న్యాయస్థానం అసాధారణమైన వ్యాఖ్యలు చేసింది. దీన్ని అన్ని పార్టీల నేతలు అంగీకరించారు’ అని కాంగ్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది. రాజకీయ పార్టీలకు.. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేతలకు జాతీయ సమస్యలపై ప్రశ్నించే బాధ్యత ఉంటుందని ఆ పార్టీ పేర్కొంది. కాగా రాహుల్ గాంధీ భారత భద్రతా దళాలను ఎంతో గౌరవిస్తారని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఆయనకు ఉందని వయనాడు కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. మంగళవారం పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘నిజమైన భారతీయుడు ఎవరనేది న్యాయమూర్తులు నిర్ణయించలేరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష నేతగా రాహుల్ బాధ్యత’ అని అన్నారు. రాహుల్ ఎప్పుడూ సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడరని, ఆర్మీని గౌరవిస్తారని ప్రియాంక అన్నారు.