Thursday, May 2, 2024

27లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

 దాదాపు 20 లక్షల మంది రికవరీ
 24 గంటల్లో 55,079 కొత్త కేసులు, 876 మరణాలు
 51 వేలు దాటిన మరణాలు
 మహారాష్ట్రలో 20 వేలు దాటిన మరణాలు
 ఒక్క రోజే 57,937 మంది డిశ్చార్జి, 9 లక్షల శాంపిల్స్ టెస్టింగ్

India Corona Cases Cross 27 lakh mark

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా మరో 55,079 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మంగళవారం నాటికి దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 27లక్షలు దాటింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 51,797 మంది మృత్యువాత పడ్డట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే మరో 876 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కాగా దేశంలో మొత్తం కొవిడ్ బాధితుల్లో ఇప్పటివరకు19 లక్షల 77 వేల మంది కోలుకున్నారు. మరో 6,73,166 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్క రోజే 57,937 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 73.18 శాతం ఉండగా, మరణాలు రేటు 1.92 శాతంగా ఉంది. ఈ నెల 7వ తేదీ దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటగా కేవలం పది రోజుల్లోనే మరో 7 లక్షల కేసులు చేరడం వైరస్ ఉధృతికి అద్ంద పడుతోంది. వాస్తవానికి 26 లక్షలనుంచి 27 లక్షలకు చేరుకోవడానికి కేవలం ఒక్క రోజే పట్టడం గమనార్హం.

ఇదిలా ఉండగా ఇప్పటివరకు 3,09,41,264 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని, నిన్న ఒక్క రోజే దాదాపు 9 లక్షల శాంపిల్స్‌ను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) తెలిపింది. కాగా తాజా మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 228 మంది మృతి చెందారు. దీంతో అక్కడ ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 20,265కు చేరుకుంది. తమిళనాడులో మరో 120 మంది, కర్నాటకలో 115 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో తమిళనాడులో మరణాల సంఖ్య 5,886కు చేరుకోగా, కర్నాటకలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల సంఖ్య 4,062కు చేరుకుంది. కాగా ఢిల్లీలో సోమవారం మరో 18 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ ఇప్పటివరకు వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య4,214కు చేరుకుంది. ఒకప్పుడు మహారాష్ట్ర తర్వాత వైరస్ ఉధృతి అధికంగా ఉండిన ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కేసులతో పాటుగా మరణాలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. కాగా గుజరాత్‌లో మరణాల సంఖ్య 2,800కు చేరుకోగా, ఆంధ్రప్రదేశ్, యుపి, పశ్చిమ బెంగాల్‌లలో కూడా 2,500 దాకా మరణాలు సంభవించాయి. కాగా గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా 60 వేలకు దిగువన కేసులు నమోదవుతుండగా, మరణాలు కూడా కాస్త తగ్గుముఖం పట్టడం గమనార్హం.

బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్‌కు కరోనా
ప్రముఖ బయోఫార్మా సంస్థ బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షాకు కరోనా సోకింది. ఆమే స్వయంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కొవిడ్ సోకిన వారి జాబితాలో చేరాను. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. అవి ఆ స్థాయిలోనే ఉంటాయని భావిస్తున్నాను’ అని కిరణ్ మజుందార్ ఓ ట్వీట్‌లో వెల్లడించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేసిన వెంటనే వందలాది మంది ఫాలోవర్లు, అభిమానులు కిరణ్ మజుందార్ షా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బెంగళూరులో నివాసముంటున్న కిరణ్ మజుందార్ కొవిడ్ 19 వైరస్, వ్యాక్సిన్ గురించిన విషయాలు, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ విధానాలపై జరిగే చర్చలు, విశ్లేషణల్లో క్రియాశీలకంగా పాలొటున్న విషయం తెలిసిందే.

India Corona Cases Cross 27 lakh mark

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News