Tuesday, April 30, 2024

తీరు మారని టీమిండియా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: మహిళల క్రికెట్‌లో టీమిండియా నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నా ఇప్పటి వరకు ప్రపంచకప్ వంటి మెగా ట్రోఫీలను సొంతం చేసుకోలేక పోతోంది. తాజాగా సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్‌కప్‌లో భారత్ సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా ఒత్తిడికి తట్టుకోలేక గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకొంది. గతంలో కూడా మెగా టోర్నీలలో భారత్ ఇలాంటి ఫలితాలనే చవిచూసింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును అలవోకగా ఓడించే అవకాశం లభించినా దాన్ని భారత్ సద్వినియోగం చేసుకోలేక పోయింది. కాస్త ఒత్తిడిని తట్టుకుని ఆడివుంటే కచ్చితంగా టీమిండియా ఫైనల్‌కు చేరేదే. అయితే కీలక సమయంలో వికెట్లను చేజార్చుకోవడంతో టీమిండియాకు మరోసారి చేదు అనుభవమే మిగిలింది.

చేతిలో ఆరు వికెట్లు ఉన్నా 31 బంతుల్లో కేవలం 39 పరుగులు కూడా చేయలేక ఓటమి పాలుకావడం కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేసింది. సెమీ ఫైనల్ వంటి కీలకమైన మ్యాచ్‌లో సీనియర్ క్రికెటర్ స్మృతి మంధాన అత్యంత చెత్త ఆటను కనబరచడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. గతంలో పురుషుల క్రికెట్‌లో సచిన్, సెహ్వాగ్, గంగూలీ తదితరులు కూడా కీలకమైన మ్యాచుల్లో ఆరంభంలోనే పెవిలియన్ చేరి జట్టును ఒత్తిడికి గురి చేసేవారు. ప్రస్తుతం మహిళల క్రికెట్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జట్టు భారీ ఆశలు పెట్టుకున్న మంధాన, షఫాలీ వర్మ తదితరులు పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచారు.

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వీరిలో ఏ ఒక్కరూ కాస్త మెరుగ్గా ఆడినా ఫలితం కచ్చితంగా టీమిండియాకు అనుకూలంగా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వీరిద్దరూ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ బాగానే ఆడినా జట్టును మాత్రం గెలిపించలేక పోయారు. ఇద్దరు కీలక సమయంలో చేజేతులా వికెట్లను చేజార్చుకుని జట్టును కష్టాల్లోకి నెట్టారు. వీరు కాస్త సమన్వయంతో ఆడి ఉంటే ఈ మ్యాచ్‌లో భారత్ అలవోకగా నెగ్గేది. కానీ జెమీమా, హర్మన్ మాత్రం కీలక సమయంలో చెత్త షాట్లతో వికెట్లను చేజార్చుకున్నారు. హర్మన్ రనౌట్ కాకుంటే భారత్‌కే విజయం దక్కేదని చాలా మంది మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.

సువర్ణ అవకాశం చేజారింది..

మరోవైపు ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఓడించే అవకాశం దక్కినా భారత్ దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోవడం బాధించే అంశమే. హర్మన్, రోడ్రిగ్స్‌లలో ఏ ఒక్కరూ చివరి వరకు క్రీజులో నిలిచినా భారత్ కచ్చితంగా విజయం సాధించేదే. కానీ వీరిద్దరు కీలక సమయంలో ఔట్ కావడంతో ఆస్ట్రేలియా ఊపిరి పీల్చుకుంది. తర్వాత వచ్చిన బ్యాటర్లపై ఒత్తిడి తేవడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సఫలమయ్యారు. తీవ్ర ఒత్తిడిలోనూ చివరి వరకు నిలకడైన బౌలింగ్‌ను కనబరిచిన ఆస్ట్రేలియా తమ జట్టును మరోసారి ఫైనల్‌కు చేర్చారు. కానీ గెలిచే స్థితిలో ఉండి కూడా భారత్ అనూహ్య ఓటమితో ట్రోఫీ రేసు నుంచి నిష్క్రమించింది. ఒకవేళ సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఉంటే భారత్‌కు వరల్డ్‌కప్ ట్రోఫీ సాధించడం కష్టమయ్యేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారత్ మాత్రం పేలవమైన ప్రదర్శనతో అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా వృథా చేసుకుని అభిమానులను నిరాశలో ముంచెత్తింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News