Tuesday, May 21, 2024

బ్రిటన్‌ను తలదన్నాం, కాని..

- Advertisement -
- Advertisement -

 

దేశాభివృద్ధిని దేనిలో చూడాలి, ఉత్పత్తి వృద్ధి లెక్కల్లోనా, ప్రజల సుఖశాంతుల్లోనా? ఈ ప్రశ్నను పక్కనపెడితే స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) పరంగా భారత్ దూసుకుపోతున్నది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ప్రపంచ జిడిపిలో 3.5 శాతం వాటాతో ఇండియా ఆర్థికంగా పెద్ద అంగలే వేస్తున్నది. ఈ జిడిపి 3.3 శాతం వద్ద గల బ్రిటన్‌ను దాటిపోయింది. ఇండియా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని సాధించుకున్నది. ఇది అమిత ఆనందభరితమైన పరిణామం. వృద్ధి రేటు ఇప్పటి స్థాయిలోనే కొనసాగితే 2027 నాటికి జర్మనీ ని సైతం మించిపోయే అవకాశమున్నట్టు వార్తలు చెబుతున్నాయి. అప్పటికి మన జిడిపి 4 శాతం కానున్నది. 2029 నాటికి జపాన్‌ను సైతం తలదన్ని అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత దేశం ధగధగలాడగలదని భావిస్తున్నారు.

2014లో ప్రపంచ జిడిపిలో మన వాటా 2.6 శాతమే. అప్పుడు పదవ స్థానంలో వున్న భారత దేశం ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకోడం మాటలు కాదు. అయితే ఈ వృద్ధి ఎక్కడ పోగుపడుతున్నది, జన జీవనం అనేక సమస్యలతో అదే పనిగా ఎందుకు దారిద్య్ర సుందరంగా వున్నది అనేది కీలక ప్రశ్న. ప్రపంచ జిడిపిలో వాటాపరంగా చూసినప్పుడు ఇండియా ఇప్పటికీ అమెరికా, చైనాలకు చాలా దూరంలో వున్నది. 26695 బిలియన్ డాలర్లతో అమెరికా ప్రపంచ జిడిపిలో 24.1 శాతం వాటాను అనుభవిస్తున్నది. రెండవ స్థానంలో వున్న చైనా 21,865 బిలియన్ డాలర్లతో ప్రపంచ జిడిపిలో 19.80 శాతం వాటాను కలిగి వున్నది. 5291 బిలియన్ డాలర్లతో జపాన్ 4.8 శాతం వద్ద మూడో స్థానంలో వుంది. 4565 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో వున్న జర్మనీ వాటా 4.1 శాతం కాగా, 3894 బిలియన్ డాలర్లతో ఐదో స్థానానికి వచ్చిన భారత్ వాటా 3.5 శాతంగా నమోదయింది.

3687 బిలియన్ డాలర్లతో బ్రిటన్ (3.3 శాతం) ఆరో స్థానానికి దిగజారిపోయింది. దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల సంపద స్థాయికి తీసుకుపోవాలని ప్రధాని మోడీ ప్రకటించి వున్నారు. ప్రస్తుత వాతావరణాన్ని బట్టి చూస్తే ఇది కష్టసాధ్యం కాకపోవచ్చు. దేశంలోని వ్యాపార దిగ్గజాలు ఆశ్రిత పెట్టుబడిదారీ దారిలో విశేషంగా ధనాన్ని మేటలు వేసుకుంటున్నాయి. సరకు మీద, సేవల మీద గుత్తాధిపత్యాన్ని పెంచుకుంటూ ప్రజల నుంచి విపరీతంగా గోళ్లూడగొట్టి వసూలు చేస్తూ బిలియన్ల డాలర్ల సంపదను పోగు వేసుకుంటున్నాయి. శ్రీమంతుల వద్దకు చేరుతున్న సంపద పరంగానే ప్రపంచ జిడిపిలో మన వాటా పెరుగుతున్నది తప్ప ప్రజల ఉద్యోగ, ఉపాధుల పరంగా కానేకాదు. 2021 డిసెంబర్ నాటికే ఇండియా ఆర్థిక వ్యవస్థ బ్రిటన్‌ను మించిపోయిందని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆర్థిక వేత్తలు ప్రకటించారు.

ఈ ఏడాది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో మన జిడిపి 13.5 శాతం వృద్ధిని సాధించింది. దేశీయ డిమాండ్ పెరిగినందువల్ల ఈ వృద్ధి సాధ్యమైందని బోధపడుతున్నది. కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు స్తంభించిపోయిన వినియోగం ఇప్పుడు ఒకుమ్మడిగా విజృంభించింది. పర్యవసానంగా సేవల రంగంలో అమిత వృద్ధి నమోదవుతున్నది. ఏ దేశ ఆర్థిక వృద్ధి అయినా తయారీ రంగంలోనూ అంటే వస్తూత్పత్తిలో, వాటి ఎగుమతుల్లోనూ ప్రతిబింబించాలి. మన తయారీ రంగ వృద్ధి కేవలం 4.8 శాతం వద్ద అథమ స్థాయిలో కొనసాగుతున్నది. తలసరి జిడిపిపరంగా చూసినప్పుడు బ్రిటన్ కంటే మనం చాలా వెనుకబడి వున్నాము. దాని తలసరి జిడిపి 47 వేల డాలర్లు కాగా, ఇండియాది కేవలం 2500 డాలర్లు. దేశంలో పని వయసు ప్రజలు అత్యధికంగా వున్నారు. 2020 నాటికి భారత దేశ జనాభాలో 67 శాతం మంది అంటే 90 కోట్ల మంది ప్రజలు పని వయసు(1564 ఏళ్ల మధ్యలోని వారు) లో వున్నారు. 2020 30 దశకంలో వీరి సంఖ్య మరి పది కోట్లు పెరగనున్నది.

వీరందరికీ ఉద్యోగాలు, ఉపాధులు కల్పించడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోగలిగితే ప్రస్తుతం 3 ట్రిలియన్ల వద్దనున్న దేశ స్థూల ఉత్పత్తి 2030 నాటికి 9 ట్రిలి యన్లకు, 2047 నాటికి 40 ట్రిలియన్లకు చేరుకోగలదని నిపుణులు చెబుతున్నారు. ప్రజల నైపుణ్యాల స్థాయి అత్యథమంగా వుండడం వల్ల ఆధునిక ఉద్యోగాలు, ఉపాధులు వారికి అందుబాటులో లేవు. వృత్తి నైపుణ్యాలను పెంచడమనేది భారత దేశానికి అతి పెద్ద సవాలుగా వున్నది.

తలసరి ఆదాయపరంగా భారత దేశం 190 దేశాల్లో ఇంకా 122 వ స్థానంలోనే వుంది. దిగుమతుల భారం ఎక్కువైపోయి వాస్తవ స్థితిలో ఆర్థిక వ్యవస్థ కుంగికునారిల్లిపోతున్నది. పాలకులు దాని వైపు దృష్టి సారించడం లేదు. దేశంలో పని చేస్తున్న వారు మొత్తం జనాభాలో 48 శాతం మాత్రమే కాగా, వీరు బ్రిటన్‌లో 78 శాతం, అమెరికాలో 62 శాతంగా వుండడం గమనించవలసిన విషయం. ప్రపంచంలో అత్యధిక శ్రమశక్తి చైనాలోనే వుంది. మనం కూడా మన జన వనరులను విశేషంగా ఉపయోగించుకోవాలి. అప్పుడే మన జిడిపి గొప్పతనం జనజీవనంలో ప్రతిబింబించి నిజమైన అభివృద్ధి శిఖరం చేరుకోగలుగుతాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News