Sunday, April 28, 2024

దేశ ప్రగతికి సెమీ కండక్టర్లు

- Advertisement -
- Advertisement -

మానవుని నిర్విరామ కృషి ఫలితంగానే 1940 వ దశకంలో ఎలెక్ట్రానిక్స్ శకానికి అంకురార్పణ జరిగిందనుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని విస్తరించేందుకు విశేషమైన సంభావ్యత కలిగిన కొత్త పరికరాల శ్రేణిలో మొదటిది అనదగ్గ ట్రాన్సిస్టర్‌ను 1947లో జాన్ బార్డీన్, వాల్టర్ హెచ్.బ్రాటైన్, బెల్ పరిశోధనా సిబ్బందికి చెందిన విలియం బి. షాక్లీలు కనుగొన్నారు. ట్రాన్సిస్టర్‌లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ల వంటి తదుపరి పరిణామాలతో పాటు స్ఫటికాకార ఘన పదార్థాలతో రూపుదిద్దుకునే సెమీకండక్టర్స్ అందుబాటులోకి వచ్చాయి. నిరంతర పరిశోధనలతో ఈరంగం కొత్తపుంతలు తొక్కుతూ 1980 మధ్య నాటికి చవకైన మైక్రోప్రాసెసర్ లకు తెరలేపడంతో ప్రోగ్రామబుల్ మైక్రోవేవ్ ఓవెన్‌లు, థర్మోస్టాట్‌లు, వాషింగ్ మెషీన్లు, డ్రైయర్‌లు, సెల్ఫ్-ట్యూనింగ్ టెలివిజన్లు, సెల్ఫ్ ఫోకస్ కెమెరాలు, విసిఆర్‌లు, వీడియో గేమ్‌లు, టెలిఫోన్లు, ఆన్సరింగ్ మెషీన్లు, సంగీత వాయిద్యాలు, గడియారాలు, భద్రతా వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. గత 50 ఏళ్లలో సెమీకండక్టర్ టెక్నాలజీలో జరిగిన పరిణామాలు ఎలక్ట్రానిక్ పరికరాలను సూక్ష్మంగా, వేగంగా, మరింత విశ్వసనీయంగా మార్చాయి.

ప్రపంచ వ్యాప్తంగా నేడు మన పాలపుంతలో ఉన్న నక్షత్రాల సంఖ్యకు సమానంగా అంటే దాదాపు 100 బిలియన్ల ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు రోజువారీ ఉపయోగంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. కేవలం సెమీకండక్టర్ డిజైన్‌పై దృష్టి సారించే కంపెనీలను ‘కల్పిత’ అని, తయారీపై దృష్టి సారించే కంపెనీలను ‘ఫౌండ్రీస్’ అని, అలా కాక రెండు కార్యకలాపాలను నిర్వహించే సంస్థలను ఇంటిగ్రేటెడ్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్ లేదా(ఐడిఎం)లు అని అంటారు. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఎస్‌ఐఎ), ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్‌లు సంయుక్తంగా చేపట్టిన ఒక అధ్యయనం ప్రకారం, దేశీయంగా 67 వేల మంది కాకుండా విస్తృత అమెరికా ఆర్థిక వ్యవస్థను పరిగణనలోనికి తీసుకుని 2030 నాటికి 1.4 మిలియన్ల సెమీకండక్టర్స్ నిపుణులు, కంప్యూటర్ శాస్త్రజ్ఞులు, ఇతర ఇంజనీర్ల కొరత ఏర్పడనున్నట్లు అంచనా వేసింది. ఇండీడ్ (Indeed) జాబ్ పోర్టల్ సమాచారం ప్రకారం 20192023 మధ్యకాలంలో దేశంలో ఈరంగంలో 7% ఉద్యోగావకాశాలు పెరిగినట్లు తెలిసింది. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్, మెటీరియల్స్ ఇంజినీరింగ్ పట్టభద్రులకు సెమీకండక్టర్స్‌లో డిమాండ్ ఉంటుంది.

స్టాటిస్టా (STATISTA) అంచనా ప్రకారం భారత్ నుండి ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులలో తమ పేర్లు నమోదు చేసుకుంటుండగా, ప్రపంచ వ్యాప్తంగా ఇంజినీరింగ్ పట్టా అందుకుంటున్న వారిలో దాదాపు 25% భారతీయులు కావడం విశేషం. ఈ ప్రత్యేకతను అవకాశంగా మలచుకుని మన ఇంజినీర్లకు పరిశ్రమలో సుశిక్షితులైన నిపుణులతో శిక్షణ అందించగల్గితే ప్రతిభావంతులైన ఇంజినీర్లు ఉద్భవించి తమ నైపుణ్యంతో ఈకొరతను తీర్చవచ్చు.
సెమీకండక్టర్స్ లేదా చిప్స్ తయారీలో డిజైనింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ వరకు ప్రతి దశలోనూ అత్యంత నైపుణ్యం గల వ్యక్తులు అవసరం. చిప్స్ డిజైనింగ్ పరిశ్రమ నిపుణుల అంచనా ప్రకారం, భారత దేశంలో ప్రస్తుతం చిప్ డిజైనింగ్, డెవలప్‌మెంట్ విభాగాలలో దాదాపు లక్షా ఇరవై ఐదు వేల బ్యాచిలర్స్, మాస్టర్స్ లేదా పిహెచ్‌డి పూర్తిచేసిన ఇంజినీర్లు పనిచేస్తున్నారు. సాధారణంగా విఎల్‌ఎస్‌ఐ (Very Large Scale Integration) డిజైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే సంస్థల్లో పని చేయడానికి ఎలక్ట్రానిక్స్,

కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్‌లో బిటెక్, విఎల్‌ఎస్‌ఐ డిజైన్‌లో ఎంటెక్ లేదా సెమీకండక్టర్ టెక్నాలజీ, మెటీరియల్ సైన్స్ లేదా కెమికల్ ఇంజినీరింగ్‌లో పిహెచ్‌డి వాంఛనీయం. ఈవిభాగంలో పనిచేస్తున్న బిటెక్ ఇంజినీర్ల వార్షిక వేతనం రూ. 3- 18 లక్షల మధ్య ఉంటుంది. కాగా, ఇంటెల్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఎన్‌ఎక్స్‌పి లాంటి భారీ బహుళజాతి చిప్ కంపెనీలలో మరింత అధిక జీతాలకు అవకాశం ఉంటుంది.దేశీయ సెమీకండక్టర్ పరిశ్రమలో చిప్స్ తయారీ కంటే కూడా ఎటిఎంపి (అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్)కి అధిక ఉద్యోగావకాశాలు ఉన్నాయి. జీతం విషయానికి వస్తే భారత దేశంలోని సంస్థలు ఈ విధులు నిర్వహించే నిపుణులకు రూ.7- 14 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తుండగా అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం రూ.20-55 లక్షల వరకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ రంగంలో పనిచేసే వ్యక్తులు విభిన్న సాంకేతికతలకు సంబంధించిన అంశాలపై విధులు నిర్వర్తించవలసి ఉండడంతో కేవలం ఏదో ఒక కోర్సు పూర్తి చేసి నెట్టుకు రావాలంటే సాధ్యమయ్యే పనికాదు. బిటెక్ లేదా ఎంటెక్ స్థాయి లో ఏర్పడిన ప్రాథమిక అవగాహనతో ఉద్యోగ నిర్వహణతో పాటు అనుభవం గడిస్తూ కాలానుగుణంగా తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవాల్సి ఉంటుందని స్వతంత్ర సెమీ కండక్టర్ విశ్లేషకుడు అరుణ్ మాంపాఝీ అభిప్రాయం. వేగంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా నిపుణులు అందుబాటులో లేకపోవడంతో ఈ రంగంలోని సంస్థలు మేధో వలసను అరికట్టడంతో పాటు తమ ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపర్చడానికి శిక్షణార్థం భారీ మొత్తాన్ని వెచ్చిస్తుంటాయి. అమెరికాలోని ఒక ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ, తమ సంస్థలోని వందలాది మంది ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం కోసం ప్రతి యేటా 1.40 మిలియన్ డాలర్ల విద్యా సహాయాన్ని అందిస్తుండగా మరో సంస్థ ప్రతి ఉద్యోగికి సంవత్సరానికి 30 వేల డాలర్ల ట్యూషన్ రీఇంబర్స్‌మెంట్ అందిస్తుంది.

భారత అధ్యక్షతన ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా9- 10 సెప్టెంబర్ 2023 న నిర్వహించబడిన జి- 20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ముఖాముఖి చర్చల అనంతరం పటిష్ఠమైన ప్రపంచ సెమీకండక్టర్ సప్లై-ఛైన్ (ఉత్పత్తి నుండి అంతిమ వాడకందారు వరకు చేరే వివిధ దశలు) వ్యవస్థను నిర్మించడానికి నాయకులు తమ పరస్పర సహకారాన్ని పునరుద్ఘాటించడం శుభపరిణామం. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బిజినెస్ టుడేతో మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు (Artificial Intelligence), సెమీ కండక్టర్స్, సూపర్ కంప్యూటింగ్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, క్వాంటం (కంప్యూటింగ్) కోసం భారత దేశాన్ని, అమెరికా విశ్వసనీయమైన భాగస్వామిగా గుర్తించింది అని తెలిపారు. భారత్‌లో పరిశోధన, అభివృద్ధిని విస్తరించడానికి అమెరికాకు చెందిన మైక్రోచిప్ టెక్నాలజీ ఇన్కార్పోరేటెడ్ సుమారు 300 మిలియన్ డాలర్లు,

అడ్వానస్డ్ మైక్రో డివైజ్ వచ్చే ఐదేళ్ళలో 400 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నాయి. అలాగే జూన్ 2023లో అమెరికా కంపెనీలు మైక్రోన్, LAM రీసెర్చ్, అప్లైడ్ మెటీరియల్స్ చేసిన ప్రకటనలకు కొనసాగింపుగా జరుగుతున్న పనులపై ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం 10 మిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో ఇండియా- యుఎస్ గ్లోబల్ ఛాలెంజెస్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు కోసం కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి కౌన్సిల్), అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీస్ (ఎఎ యు)ల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని వారు స్వాగతించారు. గ్లోబల్ ఛాలెంజెస్ ఇన్‌స్టి ట్యూట్ ప్రధానంగా ఐఐటి కౌన్సిల్, ఎఎయులతో పాటు ఇరుదేశాలలోని ఉన్నత విద్య, పరిశోధనా సంస్థలను సమన్వయ పర్చి శాస్త్రసాంకేతిక, వ్యవసాయం, ఆరోగ్య భద్రత, మహమ్మారులను ఎదుర్కోవడం, సెమీకండక్టర్స్, టెలికమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వివిధ రంగాల ఆధునీకరణకు కృషి చేస్తుంది.

వచ్చే రెండు నుండి ఐదు సంవత్సరాలలో డిజైన్, తయారీ, శిక్షణ, నైపుణ్యం, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, కెమికల్స్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్‌లకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడనుండడంతో, మన దేశం ఈ రంగంలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా విద్యార్థులకు ప్రణాళికాబద్ధమైన శిక్షణ అందించగలిగితే ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమకు నిపుణులైన మానవ వనరులను అందించి తన ఆధిపత్యాన్ని చాటుకోవడంతో పాటు రోజురోజుకు పెచ్చుమీరుతున్న నిరుద్యోగ సమస్యను కూడా అధిగమించవచ్చు. అయితే భారత్‌లో ఈ సాంకేతికపరమైన అంశాలను బోధించే అధ్యాపకులకు పరిశ్రమలో పని చేసిన ప్రత్యక్ష అనుభవంలేకపోవవడం ప్రతికూలంశమని పరిశ్రమ ప్రముఖుల అభిప్రాయం. అందుచేత ఈ డొమైన్‌లో బోధించే అధ్యాపకులకు యుద్ధప్రాతిపదికన విస్తృతమైన అవగాహన కల్పించి వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దడం తక్షణ కర్తవ్యమే కాక పెను సవాలు కూడా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News