Sunday, April 28, 2024

మొతెరాలో మోత మోగించారు

- Advertisement -
- Advertisement -

చివరి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ విజయం, 3-1తో సిరీస్ కైవసం
మళ్లీ తిప్పేసిన అశ్విన్, అక్షర్, ఇంగ్లండ్ 135 ఆలౌట్

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో, చివరి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరానికి భారత్ దూసుకెళ్లింది. లార్డ్స్ లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. అంతేగాక ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది. ఇదే క్రమంలో స్వదేశంలో వరుసగా 13వ టెస్టు సిరీస్‌ను గెలిచి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. చివరి టెస్టు మూడు రోజుల్లోనే ముగియడం విశేషం. అంతకుముందు మొతెరాలోనే జరిగిన చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్‌ను భారత్ రెండు రోజుల్లోపే సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులు చేసింది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 205, రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌లు ఐదేసివికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించిన రిషబ్ పంత్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు వరించింది.
సుందర్ పోరాటం..
ఓవర్‌నైట్ స్కోరు 294/7తో శనివారం మూడో రోజు తిరిగి ఆటను కొనసాగించిన భారత్‌కు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లు అండగా నిలిచారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా వరకు ఫలించలేదు. ఇదే క్రమంలో సుందర్ అర్ధ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సమన్వయంతో బ్యాటింగ్ చేసిన అక్షర్ పలేట్ 97 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు చేసి రనౌటయ్యాడు. దీంతో 113 పరుగుల 8వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్‌లు నిరాశ పరిచారు. ఇద్దరు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో సుందర్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన వాషింగ్టన్ సుందర్ 174 బంతుల్లో పది ఫోర్లు, ఒక సిక్స్‌తో 96 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా, భారత్‌కు కీలకమైన 160 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ నాలుగు, అండర్సన్ మూడు, జాక్ లీచ్ రెండు వికెట్లు పడగొట్టారు.

స్పిన్ ఉచ్చులో రూట్ సేన..
ఇక భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. లంచ్ తర్వాత 6/0 స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్‌లు కోలుకునే ఛాన్స్ ఇవ్వలేదు. ఇద్దరు పోటీ పడి వికెట్లు తీస్తూ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు ఊపిరాడనివ్వలేదు. అశ్విన్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. ఓపెన్ జాక్ క్రాలీ (5), వన్‌డౌన్‌లో వచ్చిన జానీ బెయిర్‌స్టో (0)లను అశ్విన్ ఔట్ చేశాడు. మరో ఓపెనర్ డొమినికి సిబ్లి (3), స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ (2)లను అక్షర్ వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్ 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ జో రూట్ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఓలి పోప్ అండతో స్కోరును ముందుకు నడిపించాడు. కానీ 15 పరుగులు చేసిన పోప్‌ను అక్షర్ ఔట్ చేశాడు. ఆ వెంటనే జో రూట్‌ను అశ్విన్ పెవిలియన్ బాట పట్టించాడు. కుదురుగా ఆడిన రూట్ 72 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. మరోవైపు డానియల్ లారెన్స్ ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న లారెన్స్ 95 బంతుల్లో ఆరు ఫోర్లతో 50 పరుగులు చేసి చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 54.5 ఓవర్లలో 135 పరుగుల వద్దే ముగిసింది. ఇదిలావుండగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన మూడు టెస్టుల్లోనూ టీమిండియా జయకేతనం ఎగుర వేసి సిరీస్‌ను సొంతం చేసుకుంది.

India win Test Series with 3-1 against England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News