Wednesday, May 8, 2024

ఐపిఎల్ 2020

- Advertisement -
- Advertisement -

indian premier league 2020 schedule

కోవిడ్ -19 విశ్వ మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో నిశ్శబ్దంగా ఉన్న క్రీడా జగత్తులో ఒక్కసారిగా ఉత్సాహం నింపడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపియల్-2020 సిద్ధమైంది. ఉత్కంఠ వీడింది. ఎదురు చూసిన క్రికెట్ సంబరం రానే వస్తోంది. కరోనా వైరస్ కల్లోల వేళ నిర్వహిస్తున్న ఐపియల్- 2020ని పూర్తి కట్టుదిట్టమైన బయో-సెక్యూర్ బబుల్ (జీవ- సురక్షిత బుడగ లేదా కంచె) ఏర్పాటు చేసి క్రికెట్ విందును ప్రేక్షకులను వడ్డించనున్నారు. తొలి మ్యాచ్ డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నర్స్ అప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సెప్టెంబర్ 19న అబుదాబి వేదికగా ప్రారంభం కానుంది. సుదీర్ఘంగా 53 రోజుల పాటు 56 మ్యాచ్‌లు మూడు ప్రాంగణాలలో జరుగనున్నాయి. అబుదాబిలో 20, దుబాయ్‌లో 24, షార్జాలో 12 మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వాహక బిసిసిఐ తెలిపింది. ఐపియల్- 2020 లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేసిన బిసిసిఐ మిగిలిన ప్లే ఆఫ్, ఫైనల్ వేదికలను ప్రకటించాల్సి ఉంది.

టోర్నీలో 10 డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30కి, రెండో ఆట రాత్రి 7:30కి ప్రారంభమవుతాయి. ప్లే ఆఫ్‌లతో కలిపి 60 మ్యాచ్‌లు, ఫైనల్ పోరు నవంబర్ 10న జరుగనుంది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లలో క్వాలిఫైయర్- 1, ఎలిమినేటర్ , క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లు జరుగనున్నాయి. క్రికెట్ అభిమానుల్లో కిక్ ఇచ్చే డ్రీమ్-11 ఐపియల్ సీజన్-13 వేడుక కరోనా కారణంగా యుఎఇ కి తరలిపోయింది. ఇప్పటికే అన్ని జట్లు 23 ఆగస్టున ఎడారి దేశానికి చేరి ప్రాక్టీసులు ప్రారంభించాయి. ఆదిలోనే సియస్‌కే జట్టులోని ఇద్దరితో పాటుగా 13 మంది క్రికెటర్లు కరోనా బారిన పడడంతో ఐపియల్-2020 కొంత ఆలస్యం అయిన విషయం మనకు తెలుసు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆడనున్న ఐపియల్- 2020కి కట్టుదిట్టమైన ఏర్పాట్లను బిసిసిఐ చేసింది. ఆటగాళ్ళకు, సపోర్టింగ్ స్టాఫ్‌కు కరోనా సోకకుండా బయో-సెక్యూర్ బబుల్ లేదా జీవ-సురక్షిత బుడగ /కంచె/కవచం నిర్మించడానికి విస్తృత ఏర్పాట్లను చేశారు.

క్రికెటరు, సహాయక సిబ్బంది ఉండే ప్రదేశాలైన హోటల్స్, క్రీడామైదానం, స్విమ్మింగ్ పూల్, ప్రాక్టీస్ ఏరియా, డ్రస్సింగ్ రూమ్స్, జిమ్నాజియం, సైక్లింగ్ ట్రాక్ లాంటి ప్రదేశాలను కరోనా రహిత ప్రదేశాలుగా కనిపించని శాస్త్రీయ కంచెను ఏర్పరిచారు. ఈ విధంగా కరోనా వంటి వ్యాధికారక జీవులు , ఇతర వైరస్‌లు వ్యాపించకుండా ఆయా ప్రాంతాలను ఐసొలేట్ చేయడాన్ని ‘బయో-సెక్యూర్ బబుల్’ అంటారు. బ్రిటీష్‌కు చెందిన్ ‘రెస్ట్రాటా టెక్నాలజీ’ సంస్థ వారు బిసిసిఐ సూచించిన ప్రోటోకాల్స్ (నిర్వహణ నియమాలు) పాటిస్తూ పూర్తి బబుల్ భద్రత ఇవ్వనున్నారు. ఐపియల్- 2020లో 8 జట్లు పాల్గొననున్నాయి. ఒక్కొక్క జట్టులో ఆటగాళ్ళు, సహాయ సిబ్బంది కలిపి 60 మంది ఉంటారు. బయో-సెక్యూర్ బబుల్‌లోకి చేరడానిక ముందు ఒక్కొక్కరు మూడు సార్లు కోవిడ్-19 పరీక్షలు చేసుకోవలసి ఉంటుంది.

జీవ-సురక్షిత కంచెలో ఉన్న వారందరూ రెండు, మూడవ వారంలో కోవిడ్ 19 పరీక్షలు తప్పక చేయించుకోవాలనే కఠిన నిబంధనలు పెట్టారు. స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా టివి లైవ్ టెలికాస్ట్ చూసే వారికి మాత్రమే పరిమితమై జరిగే ఈ మ్యాచ్‌లలో ఛీర్ గర్ల్స్ నాట్యాలు, సంగీతాలు ఖాళీ ప్రాంగణంలో ప్రతిబింబిచనున్నాయి. ఒక్కరికి కరోనా సోకినా పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున ప్రత్యేక సందర్భానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కసారి బయో-సెక్యూర్ బబుల్‌లోకి ప్రవేశించినవారు బయటకు రావడానికి గాని లేదా ఇతరులు ప్రవేశించడానికి గాని అవకాశం ఉండదు. ఈ నియమ నిబంధనలు పాటించని వారికి బిసిసిఐ కఠిన శిక్షలు కూడా వేయనుంది. సెక్యూరిటీ, ట్రాన్స్‌పోర్ట్ సిబ్బంది కూడా రెండు సార్లు కోవిడ్-19 పరీక్షలు చేసుకున్న తరువాతనే బబుల్‌లోకి అనుమతించడం జరుగుతుంది. మ్యాచ్ జరిగే ప్రాంగణంలో 450 మంది (ఆటగాళ్ళు, సహాయక సిబ్బంది, నిర్వహకులు, టివి సిబ్బంది, భద్రతా సిబ్బంది, హౌజ్ కీపింగ్, సర్వింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటర్స్, ఛీర్ గర్ల్స్) జీవ-సురక్ష కవచంలో ఉండనున్నారు.

క్రీడాకారులు కూడా వీలైనంత వరకు సామాజిక దూరాలు పాటిస్తూ, మాస్కులు ధరిస్తారు. వికెట్ పడినపుడు ఆటగాళ్ళ సంబరాలు, బౌలర్లు బంతికి ఉమ్మి రాయడం వంటివి నిషేధించబడినవి. క్రీడాకారులు తమ త్రాగు నీటి బాటిళ్ళను తామే తెచ్చుకోవలసి ఉంటుంది. ఒకవేళ మధ్యలో కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లైతే విధిగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండి నెగెటివ్ వచ్చిన తరువాతనే బబుల్‌లో చేరాల్సి ఉంటుంది. ఐపియల్ -2020 ఆటగాళ్ళు, సహాయక సిబ్బంది దాదాపు 80 రోజులు జీవ-సురక్షిత కవచంలో ఉంటారు. ప్రతి జట్టులో కోవిడ్-19 నిపుణులు, బబుల్ దాటకుండా చూసే భద్రతా సిబ్బంది ఉన్నారు. ఐపియల్- 2020 క్రికెటర్లు, సహాయక సిబ్బంది కరోనా విధించిన నియమ నిబంధనలకు లోబడి తమ ప్రతిభను చూపుతూ, ప్రపంచ వ్యాప్త క్రికెట్ అభిమానులకు బ్యాట్ బంతి పోరును మరోసారి ఆసక్తికరంగా పరిచయం చేయనున్నారు. గెలుపోటములు సహజమైనవి.ఎవరు ఓడినా, ఎవరు గెలిచినా చివరకు క్రికెట్‌దే అంతి మ విజయం కావాలి. కరోనాను ఓడిస్తూ, శాంతియుతంగా, సురక్షితంగా ఐపియల్ -2020 జరగాలని ఆశిద్దాం, ఆసాంతం ఆస్వాదిద్దాం.

* డా. బుర్ర మధుసూదన్ రెడ్డి- 99497 00037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News