Tuesday, May 14, 2024

కోహ్లి సేన సెమీస్ ఆశలకు తెరపడినట్టే?

- Advertisement -
- Advertisement -

India's semi final hopes jolted

అనూహ్యం జరిగితే తప్ప ముందుకు వెళ్లడం కష్టమే!

దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ట్వంటీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలు కావడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేక పోతున్నాడు. వరుస ఓటములతో విరాట్ కోహ్లి సేన సెమీ ఫైనల్ అవకాశాలకు దాదాపు తెర పడిందనే చెప్పాలి. ఇప్పటికే భారత్‌పై విజయం సాధించిన పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు దాదాపు సెమీస్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయనే చెప్పాలి. ఒకవేళ మిగిలిన మూడు మ్యాచుల్లో భారత్ భారీ తేడాతో నెగ్గినా సెమీస్‌కు చేరడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. పాకిస్థాన్, న్యూజిలాండ్‌లు చిన్న జట్లు స్కాట్లాండ్, నమీబియా తదితర జట్లతో ఆడాల్సి ఉంది. ఈ జట్ల చేతుల్లో కివీస్, పాకిస్థాన్ ఓడి పోతేనే భారత్‌కు నాకౌట్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కివీస్, పాక్‌లను ఓడించడం ఈ జట్లకు శక్తికి మించిన పనిగానే చెప్పొచ్చు. ఇక పాకిస్థాన్ ఇప్పటికే భారత్, కివీస్‌లతో పాటు ప్రమాదకర జట్టు అఫ్గానిస్థాన్‌ను ఓడించింది. ఇక భారత్‌కు సెమీస్ ఆశలు ఏమైనా మిగిలివుండాలంటే అది అఫ్గానిస్థాన్‌తోనే సాధ్యమవుతోంది. ఒక వేళ కివీస్‌పై అఫ్గాన్ విజయం సాధిస్తేనే భారత్‌కు ఆశలు కాస్త చిగురిస్తాయి. అప్పుడూ టీమిండియాకు నెట్ రన్‌రేట్ చాలా కీలకంగా మారుతోంది. ఇక మిగిలిన మూడు మ్యాచుల్లో భారీ తేడాతో గెలవడమే కాకుండా రన్‌రేట్ కూడా మెరుగు పరుచుకోక తప్పదు. అంతేగాక ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.

అంచనాలు తారుమారు..

ఈ ప్రపంచకప్‌లో ట్రోఫీ ఫేవరెట్‌లలో ఒకటిగా భావించిన టీమిండియా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేక పోయారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్లలో ఒకటిగా పేరున్న భారత్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలు కావడంతో పరిస్థితి తారుమారైంది. ఆరంభ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో పది వికెట్ల తేడాతో అవమానకర రీతిలో ఓటమి చవిచూసింది. అయితే కివీస్‌పై గెలిచి మళ్లీ గాడిలో పడడం ఖాయమని అందరూ భావించారు. కానీ అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ కివీస్‌పై మరింత చెత్త ఆటతో తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో కేవలం 110 పరుగులకే పరిమితమైంది. ఇక భారత్ ఉంచిన స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ అలవోకగా ఛేదించి సెమీస్ అవకాశాలను మెరుగు పరుచుకుంది.

ఇక వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన భారత్ మరో మూడు పోటీలు ఆడాల్సి ఉన్నా సెమీస్ రేసు నుంచి దాదాపు వైదొలిగిందనే చెప్పాలి. రోహిత్, కోహ్లి, రాహుల్, రిషబ్, జడేజా, హార్దిక్, షమి, భువనేశ్వర్, బుమ్రా, శార్దూల్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఆరంభ మ్యాచుల్లోనే పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. రెండు మ్యాచుల్లోనూ ప్రత్యర్థి జట్లకు కనీస పోటీని ఇవ్వకుండానే చేతులెత్తేయడంతో కోట్లాది మంది ఆశలు నీరుగారాయి. భారీ ఆశలతో ప్రపంచకప్ బరిలోకి దిగిన టీమిండియా కనీసం సెమీస్‌కు కూడా చేరుకోలేని పరిస్థితి ఏర్పడడాన్ని అభిమానులు తట్టుకోలేక పోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News