Tuesday, April 30, 2024

దారుణం

- Advertisement -
- Advertisement -

menstruating women

 

దేవుడికి, మతానికి సంబంధించిన నమ్మకాలు పవిత్రత, పరిశుద్ధత ప్రమాణాలు సృష్టి మూలాలనే అవమానించే స్థాయికి వికటించడం అది మహిళలను చిన్న చూపు చూసి వెలికి గురి చేయడం శాస్త్రీయ చైతన్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లివిరియవలసిన ఈ ఆధునిక కాలంలోనూ నిరాఘాటంగా సాగిపోడం సిగ్గుతో తల దించుకోవలసిన అంశం. గుజరాత్‌లో ఒక మత సంస్థ నడుపుతున్న కళాశాల వసతి గృహంలో రుతుస్రావ స్థితిలో ఉండి గుడిలోకి, వంట గదిలోకి ప్రవేశించారన్న అనుమానంతో ఆ కాలేజీ ప్రిన్సిపల్, మరి ముగ్గురు మహిళా పర్యవేక్షకులు కలిసి 68 మంది విద్యార్థినుల లోపలి దుస్తులను తీయించి పరీక్షించిన ఉదంతం ప్రధాన మంత్రి మోడీ ఇచ్చిన బేటీ పడావో, బేటీ బచావో నినాదాన్ని అవహేళన పాలు చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న ఈ విద్యార్థినులలో కొందరు నెలసరి సమయంలో అపచారానికి పాల్పడ్డారన్న ఫిర్యాదు మీద మొత్తం వారందరినీ ఒకరి తర్వాత ఒకరిని మరుగు గదిలోకి పిలిచి ఈ పరీక్ష నిర్వహించారని ధ్రువపడింది.

పరీక్షించినట్టు బయటికి చెబితే హాస్టల్ నుంచి గెంటివేస్తామని బెదిరించినట్టు కూడా వార్తలు చెబుతున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఈ దారుణం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించారు. కాని మహిళలపై జరుగుతున్న ఈ మతపరమైన, దైవ సంబంధమైన అమానుషానికి విరుగుడు సాధించడం ఎలా అన్నదే ఇప్పుడు నిలువెత్తున నిలిచి భయపెడుతున్న ప్రశ్న. సంప్రదాయ పరిరక్షకులమని చెప్పుకునే కుటుంబాలలో ప్రతి నెలా ఆ మూడు రోజులూ మహిళలను ఇంటి బయట ఉంచి మైల పడిన వారుగా పరిగణించే దుష్ట ఆచారం కొనసాగడం తెలిసిందే. ఇప్పుడీ దారుణ పరీక్షలు జరిగిన గుజరాత్ విద్యా సంస్థలో కూడా పవిత్రత, పరిశుద్ధత పేరుతో ఇటువంటి అమానవీయ కట్టుబాట్లు అమల్లో ఉన్నాయి. రుతుస్రావమైన మహిళలు ఆ సంస్థ ప్రాంగణంలోని గుడిలోకిగాని, వంట గదిలోకిగాని ప్రవేశించరాదనే ఆంక్ష అందులో ఒకటి. వంట గదిలోకి వారు చొరబడితే ఆహారం కలుషితమవుతుందట.

ఇది పచ్చి అబద్ధం, అశాస్త్రీయం. సైన్సు డిగ్రీతో పాటు ఉన్నత చదువులు నేర్పడంలో అందె వేశామని చెప్పుకునే ఆ విద్యా సంస్థ యాజమాన్యం ఇటువంటి అశాస్త్రీయమైన నియమాలను అప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్న విద్యార్థినులపై విధించడం వారి చదువుకుగాని, సమాజ వికాసానికిగాని ఎలా తోడ్పడుతుందని అనుకున్నారో అర్థం కాని విషయం. రుతుస్రావం స్త్రీలు సంతానవతులు కావడానికి ఆ విధంగా సృష్టి సాగడానికి ఒక తప్పనిసరి దశ. క్రమం తప్పుకుండా నెలనెలా రుతుస్రావం సంభవించడం స్త్రీల ఆరోగ్య సౌభాగ్యానికి రుజువు. అది వారి శరీరంలో తగినన్ని హార్మోన్ల విడుదలకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా గర్భవతి కావడానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. సృష్టిలోని అటువంటి ఒక గొప్ప మహత్తర శారీరక పరిణామాన్ని హీనమైనదిగా పరిగణించి ఆ స్థితిలోని మహిళను వెలికి గురి చేయడం కంటే దుర్మార్గం ఏముంటుంది? అంతకు మించి ప్రగతి నిరోధకమైన, మానవ వికాసానికి విఘాతకరమైన దురాచారం ఉండదు.

నెలసరి సమయంలోని స్త్రీని గుడికి, బడికి, వంట గదికి మొత్తంగా ఇంటికి దూరంగా ఉంచే దుస్సంప్రదాయాన్నే మతం నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నది. ఇటువంటి చోట స్త్రీ విద్య, పురుషునితో సమానంగా ఆమె అభివృద్ధి ఎలా సాధ్యమవుతాయి? బేటీ పడావో, బేటీ బచావో అని గొంతు చించుకునే పాలకులు, నాయకులు ఇటువంటి దురాచారాలను బడి నుంచి, గుడి నుంచి, ఇంటి నుంచి తరిమివేయడానికి నడుం బిగించడానికి బదులు శబరిమల వంటి ఆలయాల్లోకి రుతుస్రావ వయసులోని మహిళలకు ప్రవేశాన్ని అనుమతించిన సుప్రీంకోర్టు తీర్పుని అడ్డుకునే అవరోధాత్మక ఆందోళనలకు వ్యాజ్యాలకు ప్రోత్సాహం ఇవ్వడం ఎంత బాధాకరమో చెప్పనక్కర లేదు. అటువంటివారు పాలన పగ్గాలు చేపట్టిన చోట ఇటువంటి దురాచారాలు పెరిగి పేట్రేగిపోడం వింత కాదు. గుజరాత్‌లోని ఆ వసతి గృహంలో ఆ 68 మంది విద్యార్థినులు అంతటి హేయమైన పరీక్షకు గురయినప్పుడు ఎంతగా వేదన చెంది ఉంటారో ఊహించవచ్చు.

మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి చదువు కోసం, జ్ఞాన ఆర్జన కోసం వచ్చిన ఆ బాలికలలో విద్యాభ్యాసం పట్ల శాశ్వతమైన విరక్తి కలిగి ఉంటే ఆశ్చర్యపోనక్కర లేదు. రుతుస్రావం, గర్భం దాల్చడం, నవ మాసాలు మోసి కని పెంచడం అనే సృష్టిపరమైన మహత్తర బాధ్యత వహిస్తున్నందుకు స్త్రీని ఉన్నతురాలుగా భావించి ఎంతో గౌరవించవలసి ఉండగా అందుకు విరుద్ధంగా ఆమెను ద్వితీయ శ్రేణి మనిషిగా పరిగణించి నీచంగా చూడడం, హింసించడం, వంటగది, పడక గదుల బానిసగా భావించి అణగదొక్కడం వెలి వేసి వేధించడం అంతం కానంత వరకు మన సమాజం బాగుపడదు.

Inhumanity on menstruating women
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News