Sunday, May 12, 2024

చైనాకు సవాలైన కరోనా

- Advertisement -
- Advertisement -

 CoVID19

 

ప్రపంచంపై పంజా విసిరిన కొత్త కరోనా వైరస్‌కు కోవిద్ 19 అని పేరు పెట్టారు. దాదాపు 60 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు, 1369 మంది మరణించారు. ఇప్పుడు కొత్త కేసుల సంఖ్య తగ్గినట్లు పరిశీలకులు అంటున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ఒక్క రోజులోనే అత్యధికంగా 3,887 కేసులు రికార్డయ్యాయి. క్రమంగా ఈ ఉధృతి తగ్గుతూ ఫిబ్రవరి 11 రోజున 2,015 కేసులు నమోదయ్యాయి.

చైనా కమ్యూనిస్టు పార్టీ ఆలస్యంగా క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. హుబే ప్రాంతంలో పార్టీ అధినేతగా ఉన్న జియాంగ్ చోలింగ్‌ను తొలగించింది. షాంఘై మేయర్ ఇంగ్ యాంగ్‌ను ఆయన స్థానంలో నియమించింది. వుహాన్‌లో పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్న మాగోకియాంగ్ ను కూడా తొలగించి వాంగ్ జాంగ్లింగ్ కు బాధ్యతలు కట్టబెట్టింది. హుబే లో కరోనా నిర్ధారించే పరీక్షల పద్ధతులు మార్చిన తర్వాత రోగుల సంఖ్య ఎక్కువని తేలింది. ఆ తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ చర్యలు చేపట్టిందని గమనించాలి.

సింగపూర్, థాయ్ లాండ్, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా తదితర ప్రాంతాల్లోనూ వైరస్ వ్యాపించింది. వైరస్ ను అదుపు చేయడానికి చైనాలో దాదాపు 6 కోట్ల జనాభా కదలికలపై ఆంక్షలు విధించారు. ఫలితంగా సాధారణ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వైరస్ ను కట్టడి చేయడానికి వివిధ నగరాలు, పట్టణాలు కూడా కఠిన ఆంక్షలు విధించడం ప్రారంభమయ్యింది. ఫిబ్రవరి 10వ తేదీన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ బీజింగ్ పర్యటన సందర్భంగా జాతీయ మీడియాలో కనిపించారు. ఆయన కేవలం మామూలు సర్జికల్ మాస్కు మాత్రమే ధరించి ఉన్నారు. పరిస్థితి అదుపులో ఉందనే సంకేతాలు ఇవ్వడానికి ఆయన ప్రయత్నించారు.

కరోనా వైరస్ గురించి మొదట హెచ్చరించిన డాక్టర్ లీ వెన్ లింగ్ మరణం కూడా వివాదమయ్యింది. ఆయన మరణంపై విచారణ జరపడానికి నేషనల్ సూపర్ వైజరీ కమిషన్ బృందం వూహాన్ పట్టణానికి వెళ్ళింది. నిజానికి కరోనా వైరస్ గురించి డాక్టర్లు ముందే గుర్తించారు. మొదట హెచ్చరికలు చేసిన డాక్టర్ వెన్ మాత్రమే కాదు, మరో ఇద్దరు డాక్టర్లు కూడా ఈ హెచ్చరికలు చేశారు. అయితే పోలీసు యంత్రాంగం వారిని బెదిరించి నోరు మూయించింది. అనవసరంగా భయాందోళనలు రేకెత్తించవద్దని చెప్పారట.

పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశాలు చైనా అధ్యక్షుడు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. కరోనా వైరస్ పై అదుపు సాధిస్తున్నామని ఆయన ఈ సమావేశాల్లో చెప్పినట్లు తెలుస్తోంది. చైనా వైద్య రంగంలో సవాళ్ళ గురించి కూడా చర్చించారట. ఆసుపత్రుల సామర్థ్యం పెంచాలని సూచనలు వచ్చాయి. కరోనా వ్యాధి రాకుండా నివారణ చర్యలకు ప్రాముఖ్యం ఇవ్వడం, వ్యాధిగ్రస్థులను వేరు చేసి చికిత్స అందించడం, హుబే ప్రాంతంలో ముఖ్యంగా వూహాన్ పట్టణంలో వైద్య సేవలు పెంచడం జరుగుతున్నది. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంతో పాటు దీని వల్ల ఆర్ధిక వ్యవస్థపై పడిన ప్రభావాన్ని కూడా చక్కదిద్దాలని నిర్ణయించారు. టాక్సులు తగ్గించడం, ఫీజులు తగ్గించడం ద్వారా కంపెనీలకు సహాయపడాలని నిర్ణయించారు. యాంటి వైరస్ తయారు చేయడానికి ప్రోత్సాహకాలు కూడా ప్రకటిస్తున్నారు.

కానీ ఈ వైరస్ గురించి తెలిసింది చాలా తక్కువ అని డాక్టర్లు చెబుతున్నారు. రోగుల్లో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యుర్ ఎందుకు జరుగుతున్నదో అర్ధం కావడం లేదని అంటున్నారు. కాగా మరో పెద్ద సమస్య ఏమంటే, వైద్యం చేస్తున్న డాక్టర్లకు కూడా ఈ కరోనా సోకే ప్రమాదం ఉంది. ఎన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి ఉంది. వ్యాధి సోకిన తర్వాత కొందరు రోగుల్లో శరవేగంగా వ్యాధి ముదిరిపోవడం కూడా డాక్టర్లకు అర్థం కావడం లేదు. వ్యాధి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి పారిశుధ్యం పాటించాలనే స్పష్టత కూడా లేదు.

కరోనా వైరస్ ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ప్రజలను నాలుగు తరగతులుగా విభజించారు. వ్యాధి సోకినట్లు నిర్ధారణ జరిగిన వారు, వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నవారు, జ్వరంతో బాధపడే వారు, రోగులతో సన్నిహితంగా ఉన్నవారు. కమ్యూనిస్టు పార్టీ వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం 17 వేల మందిని సమస్య తీవ్రంగా ఉన్న హుబే ప్రాంతానికి పంపించారు. ఈ నాలుగు తరగతుల ప్రజలందరినీ క్వారంటైన్ సదుపాయాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాని రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఆసుపత్రుల్లో స్థలం చాలడం లేదు. వెయ్యి పడకల ఆసుపత్రి ఆగమేఘాల మీద కట్టించారు కాని వాస్తవానికి అక్కడ ప్రస్తుతం 286 పడకలే అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. మరో ఆసుపత్రి 15 వందల పడకల ఆసుపత్రి అన్నారు కాని అక్కడ కూడా కేవలం 30 పడకలే అందుబాటులో ఉన్నాయట.

డిసెంబర్ 1 నుంచి జనవరి 20 మధ్య కాలంలో కరోనా ప్రారంభమైన రోజుల్లో స్థానిక ప్రభుత్వాల ప్రతిస్పందన గురించి పత్రికలు రాశాయి. కాని ఈ వ్యాసాన్ని తర్వాత తొలగించారు. అయినా వెబ్ సైటుల్లో చాలా మందికి అందుబాటులో ఉంది. వైరస్ గురించి సమాచారం డిసెంబరు మాసం నుంచి ప్రభుత్వం వద్ద ఉంది. డా. లీ వెన్ లియాంగ్ వి చాట్ మెస్సేజింగ్ గ్రూపులో ఈ వైరస్ గురించి రాశాడు. ఇది సార్స్ కాదని కొత్త వైరస్ అని చెప్పాడు. ఆ డాక్టరును మునిసిపల్ కమిషనర్ పిలిచి అనవసరంగా భయాందోళనలు రెచ్చగొట్టవద్దని హెచ్చరించాడట. అప్పట్లోనే జ్వరం తదితర కేసులు వస్తే, న్యూమోనియా కేసులుగా కొట్టి పారేశారట. డిసెంబర్ 8వ తేదీన మొదటి కేసు బయటపడింది. కాని వూహాన్ చేపల మార్కెటును మూసివేసి తగిన చర్యలు తీసుకునే ప్రయత్నాలు జరగలేదు.

అక్కడి నుంచి ఈ వైరస్ ప్రారంభమైందని భావిస్తున్నారు. 22 రోజుల తర్వాత ఈ మార్కెట్‌ను మూయించారు. జనవరి 9వ తేదీ నాటికి ఇది కొత్త వైరస్ అనే విషయం నిపుణులు అధ్యయనాల తర్వాత ప్రకటించారు. చైనాలోని వూహాన్ మునిసిపల్ అధికారులు అసలు ప్రారంభంలో ఇది అంటువ్యాధి అని కూడా ఒప్పుకోలేదు. మూర్ఖంగా వ్యవహరించారు. తర్వాత నిపుణులు ఇది తీవ్రమైన అంటువ్యాధిగా నిర్ధారించారు. చైనా అధికారులు ఈ వైరస్ సంబంధించిన డేటాను ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇచ్చారు. ఫిబ్రవరి 10వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం పర్యటించేందుకు అనుమతి ఇచ్చారు. అమెరికా కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. కాని ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు. చైనా ప్రభుత్వం, అధికారుల అలసత్వం, నిర్లక్ష్యాలే కరోన మహమ్మారి విజృంభించడానికి కారణమయ్యాయి.

Corona virus is named CoVID19
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News