Saturday, April 27, 2024

ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు

- Advertisement -
- Advertisement -

Townships

 

ప్రతి మున్సిపల్ పట్టణంలో ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం?

వాక్ టు వర్క్ విధానం కింద అమలు
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి
బిల్డర్లకు, డెవలపర్లకు ప్రోత్సాహకాలు
ప్రణాళిక సిద్ధం చేస్తున్న పురపాలక శాఖ

హైదరాబాద్ : ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. “వాక్ టు వర్క్‌” అనే విధానంతో నూతన అత్యాధునికమైన టౌన్‌షిప్‌లను పట్టణాల్లో తీసుకురావాలని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ఇటీవల మున్సిపల్ ఉన్నతస్థాయి అధికారులకు సూచించినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే భూసమీకరణ పథకం, నీటి సరఫరా, డ్రైనేజీ, మురుగునీరు ప్రణాళిక, పారిశుధ్య, పట్టణ పచ్చదనం, రోడ్ల ప్రణాళిక, ట్రాఫిక్, రవాణా ప్రణాళికలతో రూపకల్పన చేయబడిన స్థానిక ప్రాంతత ప్రణాళికలతో కూడిన మాస్టర్ ప్లాన్‌ను తీసుకురావాలని పురపాలక శాఖ విభాగం సన్నాహాలు చేస్తున్నది.

ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన కొత్త మున్సిపల్ చట్టం 2019 పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లను ప్రోత్సహించాలని స్పష్టంగా పేర్కొన్నది. పెరుగుతున్న జనాభతో శరవేగంగా విస్తరిస్తున్న పట్టణాల్లో టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఇటు ఉద్యోగులకు, అటు ప్రయాణికులకు, మరోవైపు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందనేది పురపాలక శాఖ ఉద్దేశంగా ఉన్నది. రాష్ట్రంలో మొదటి ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌గా హైదరాబాద్ శివారులోని పోచారం మున్సిపాలిటీలో సింగపూర్ టౌన్‌షిప్ ఏర్పడింది. వాస్తవానికి ఈ టౌన్‌షిప్‌కు సంస్కృతి అనేది పేరు. రాష్ట్ర హౌసింగ్ బోర్డు, సింగపూర్ ప్రభుత్వం కలిసి నిర్మించినందున దీనికి సింగపూర్ టౌన్‌షిప్‌గా పేరుపడింది. ప్రారంభంలో 1600 ఫ్లాట్‌లు ఉండగా ఇప్పుడది 2080 ఫ్లాట్లకు పెరిగాయి. ఇక్కడ ఇన్‌ఫోసిస్, జెన్‌పాక్ట్

బహుళజాతి సంస్థల కార్యాలయాలు ఉండటంతో ఈ టౌన్‌షిప్‌ను ప్రతిపాదించడం జరిగింది. ఇన్‌ఫోసిస్, జెన్‌పాక్ట్ కంపనీలతో పాటు ఇతర కంపనీలు కూడా ఇక్కడే ఉండటంతో వాటిల్లో పనిచేసే ఉద్యోగులు అధిక శాతం మంది సింగపూర్ టౌన్‌షిప్‌లో ఫ్లాట్లు తీసుకుని అక్కడి నుంచి సంస్థలకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోనూ ఉద్యోగులు పనిచేసే చోటే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లను తీసుకురావడం వల్ల వాక్ టు వర్క్ విధానం కార్యరూపంలోకి వచ్చి ఉద్యోగులకు, కార్యాలయాలకు మధ్య దూరం తగ్గుతుందని, అధిక శాతం వాహనాలు, రోడ్లపైకి రాకుండా నివారించినట్టుగా ఉంటుందనేది పురపాలక శాఖ ఉద్దేశ్యం. వాక్ టు వర్క్ పద్దతి వల్ల ఉద్యోగులకు సమయం చాలా మిగులుతుందనేది ప్రభుత్వ యోచన.

రాయితీలు.. నూతన టౌన్‌షిప్‌లను నిర్మించేందుకు ఆసక్తి ఉన్న బిల్డర్లు, డెవలపర్లులకు ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు, రాయితీలు కల్పించాలని భావిస్తున్నది. వీటిని కల్పించడం వల్ల వారిని ప్రోత్సహించినట్టుగానూ, ఆయా పట్టణాల్లో టౌన్‌షిప్‌లను ప్రోత్సహించినట్టుగానూ ఉంటుందనేది పురపాలక శాఖ భావన. నివాసాలు, కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, వినోదం, సేవలతో పాటు ప్రణాళికాబద్దమైన మౌలిక వసతులున్న ఈ టౌన్‌షిప్‌లు పట్టణాల్లో ఒక హబ్‌గా వ్యవహరిస్తుంటాయ ని ప్రభుత్వ ఉద్దేశ్యం. క్రమమైన అభివృద్ధితో పట్టణాల్లో కాలుష్యం తగ్గుదల, ఉద్యోగులకు వత్తిళ్ళ నుంచి ఉపశమనం, త్వరగా కార్యాలయాలకు, ఇండ్లకు చేరుకునే వెసులుబాటు ఉంటుందని యోచిస్తుంది.

Integrated Townships within Municipality
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News