Thursday, May 2, 2024

త్వరలో అంతర్రాష్ట్ర సర్వీసులు

- Advertisement -
- Advertisement -
Interstate RTC bus services to begin soon
 వచ్చే వారం నుంచి బస్సుల పరుగు

హైదరాబాద్ : అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. వచ్చే వారం నుంచి ఎపి, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు గురువారం అంతరాష్ట్ర సర్వీసులపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రాథమిక చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల మధ్య నాలుగు దశల్లో ఆపరేషన్ స్టార్టయ్యే విధంగా ప్రయత్నాలు కొనసాగనున్నాయి. టిఎస్‌ఆర్టీసి ఇప్పటికే ఇందు కు సిద్ధంగా ఉండగా, 256 బస్సు సర్వీసులను ఎపి నుండి తెలంగాణకు నడిపేందుకు ఎపి సన్నాహాలు చేస్తోంది. విభజన సమయంలో ఇంటర్‌స్టేట్ అగ్రిమెంట్ అమలు కాలేదు. దీనిపై ప్రధానంగా చర్చ కొనసాగింది. అంతరాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణను వేగవంతం చేసే విధంగా చర్యలను ఇప్పటికే టిఎస్‌ఆర్టిసి వేగవంతం చేసింది. ఇదే క్రమంలో కర్ణాటక, ఎపి ప్రభుత్వాలకు టిఎస్‌ఆర్టీసీ గతంలోనే ఇందుకు సంబంధించి లేఖలు రాసింది.

కర్ణాటకలో బెంగళూరు, రాయిచూరుకు తెలంగాణ నుంచి ఎక్కువ బస్సు సర్వీసులు నడుస్తాయి. కర్ణాటకకు సంబంధించి సాంకేతిక ఇబ్బందులు లేవు. అక్కడి రోడ్డు రవాణాశాఖ నుంచి సానుకూల స్పందన వస్తుందని టిఎస్‌ఆర్టిసి ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. అయితే ఎపితో కొన్ని సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున వాటిపై స్పష్టత కోసం టిఎస్‌ఆర్టిసి ప్రయత్నిస్తూ వచ్చింది. ప్రధానంగా ఎపి బస్సులు మన రాష్ట్రంలో 900 కిలోమీటర్లు మేర నడుస్తుండగా.. తెలంగాణ సర్వీసులు 700 కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. వ్యత్యాసం లేకుండా రెండువైపులా సమానంగా బస్సు సర్వీసులు నడపాలని, దీనిపై ఒప్పందం తర్వాతే సర్వీసులను పునరుద్ధరించాలని సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ఆర్టీసి అధికారుల మధ్య చర్చలు ప్రారంభం కావడం శుభసూచికం.

గురువారం నాడు కొనసాగిన చర్చల్లో కొంత పురోగతి కన్పించింది. కాగా, మరికొన్ని సాంకేతిక అంశాలపై పీటముడి వీడాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. గురువారం చర్చలు ముగిసినా మరో సారి చర్చలు కొనసాగించనున్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఈ చర్చలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో తెలంగాణ, ఎపిల మధ్య బస్సు సర్వీసులకు అడ్డంకులు తొలగి అంతరాష్ట్ర సర్వీసులు నడిచే అవకాశం ఉంది. ఇటీవల హైదరాబాద్ సిటీ బస్సులు మినహా జిల్లాల్లో బస్సులు రోడ్డెక్కాయి. కరోనా నిబంధనలననుసరించి ఆయా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. జిల్లా సర్వీసులు నడుపుతున్నా.. అంతరాష్ట్ర సర్వీసులు నడపడం ద్వారా టిఎస్‌ఆర్టీసి పూర్తి స్థాయిలో గట్టెక్కె అవకాశం ఉందని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావించారు.

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడతో సమీక్షా సమావేశంలో ఆర్టిసి అధికారులు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రధానంగా అంతరాష్ట్ర సర్వీసుల నిర్వహణ ద్వారా టిఎస్‌ఆర్టిసికి రమారమి రోజుకు రూ.7 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందనేది అంచనా. ఎంతగా జిల్లా సర్వీసులను నడిపినా ఒనగూరే ప్రయోజనం కంటే అంతరాష్ట్ర సర్వీసులను ప్రారంభించడం ద్వారా ఆర్టిసి పూర్తిస్థాయిలో గట్టెక్కె అవకాశం ఉందన్న వాదన బలంగా ఉంది. ఇక కరోనా విజృంభణతో హైదరాబాద్‌లో సిటిబస్సులు ఇప్పుడిప్పుడే రోడ్డెక్కె పరిస్థితి లేదు. అయితే పరిస్థితి చక్కబడితే జూలైలో హైదరాబాద్‌లో సిటిబస్సులు నడిపేందుకు అధికారులు యత్నించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్నల్ సర్వీసులు ఇప్పటికే కొనసాగుతున్నాయి. మండు వేసవిలో సర్వీసులు ప్రారంభమైన తరుణంలో లాక్‌డౌన్ నిబంధనలతో తొలుత నష్టాలు చవిచూశాయి.

ప్రజా రవాణా సంస్థలు కాబట్టి బస్సులను డిపోలలో ఉంచేకన్నా నడపడమే శ్రేయస్కరమని భావించి బస్సులు నడిపారు. మరోవైపు తెలంగాణలో లాక్‌డౌన్ సందర్భంగా రాత్రి 7 గంటలకే బస్సులన్నీ ఆయా జిల్లాల డిపోలకు చేరాలని సూచించారు. దీంతో ఆర్టీసి ఉన్నతాధికారులు ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తేవడం.. వారు ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. దీంతో జిల్లాల సర్వీసులను లాక్‌డౌన్ కర్ఫూ కొనసాగుతున్న సమయంలో రిలాక్సేషన్‌కు అనుమతినిచ్చారు. దీంతో గతం కంటే బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య మెరుగైంది. దశలవారీగా లాక్‌డౌన్ నిబంధనల సడలింపు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అప్పటివరకు ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ తాజా సడలింపుల నేపథ్యంలో 39 శాతం నుంచి 49 శాతం మేర ఆక్యుపెన్సీ రేటు పెరిగినట్లైంది. ఇక తాజా చర్చల నేపథ్యంలో అంతరాష్ట్ర సర్వీసులు నడిచితే టిఎస్‌ఆర్టీసి పూర్తిస్థాయిలో గాడినపడినట్లే.

మహారాష్ట్ర, తమిళనాడులకు…

ఇదిలా ఉండగా, ఎపి, కర్ణాటకలకు అంతరాష్ట్ర బస్సు సర్వీసులను నడిపేందుకు టిఎస్‌ఆర్టీసి సుముఖంగా ఉంది. అందుకు తగిన ప్రయత్నాలను శరవేగంగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా కల్లోలం సృష్టిస్తుండటంతో ఆయా రాష్ట్రాలకు ఇప్పట్లో అంతరాష్ట్ర సర్వీసులను నిర్వహించకూడదని టిఎస్‌ఆర్టీసి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆదేశాలు సైతం ఇదే విధంగా ఉన్నాయని తెలుస్తోంది.

సిటిబస్సుల నిర్వాహణ తోడైతే…

ఓ వైపు కర్ణాటక, ఎపిలతో అంతరాష్ట్ర సర్వీసుల నిర్వహణకు సంబంధించి సానుకూల స్పందనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో టిఎస్‌ఆర్టీసికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న హైదరాబాద్ సిటీ సర్వీసులు నడిస్తే మరింత శ్రేయస్కరంగా ఉంటుందని టిఎస్‌ఆర్టీసి భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అందుకు తగిన విధంగా ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే హైదరాబాద్‌లో కరోనా వీర విహారం చేస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. దీంతో సిటిలో ఆర్టీసి సర్వీసులను నడపడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని తెలుస్తోంది. దీంతో హైదరాబాద్‌లో కరోనా కల్లోలం ఉపశమిస్తే తప్ప సిటీబస్సులు ఇక్కడ రోడ్డెక్కే అవకాశం లేదు. జులై నాటికి కరోనా కేసులు తగ్గుముఖం పడితే ఆ నెల నుంచి సిటీబస్సులను రోడ్డెక్కించాలని టిఎస్‌ఆర్టీసి యోచిస్తోంది.

చార్జీలు పెంచేది లేదన్న ప్రభుత్వం

జిల్లా సర్వీసులు ప్రారంభమైన తరుణంలో టిఎస్‌ఆర్టీసీ 33 శాతం మేర ప్రయాణీకుల ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. లాక్‌డౌన్‌తో కష్టనష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలపై అదనపు భారం మోపేది లేదని ప్రభుత్వం ఖరాఖండిగా టిఎస్‌ఆర్టీసికి తేల్చి చెప్పింది. అదే క్రమంలో అన్ని సీట్లలో ప్రయాణీకులకు అనుమతినిస్తూనే భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించి తీరాలని స్పష్టపర్చింది. తాజాగా అంతరాష్ట్ర సర్వీసులకు మార్గం సుగమం కానున్న నేపథ్యలో టిఎస్‌ఆర్టిసికి మరింత లాభం చేకూరే అవకాశం ఉంది. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న అంతరాష్ట్ర సర్వీసులకు కోవిడ్19 నిబంధనలు వర్తించనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News