Thursday, May 2, 2024

ఐపిఎల్ కష్టమేనా?

- Advertisement -
- Advertisement -

IPL 2020

 

ఎటు తేల్చుకోని ఫ్రాంచైజీలు, రద్దు చేయడమే మంచిదన్న అభిప్రాయం

ముంబై: కరోనా వైరస్ వల్ల ఇప్పటికే వాయిదా పడిన ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 సీజన్ జరుగడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ నెల 29న ప్రారంభం కావాల్సిన ఐపిఎల్‌ను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఏప్రిల్ 15కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఆ తర్వాత కూడా ఐపిఎల్ జరుగడం అనుమానమే. శనివారం ముంబైలో సమావేశమైన పలు ఫ్రాంచైజీల యజమానులు ఐపిఎల్‌ను పూర్తిగా రద్దు చేయడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. ఇక, ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోవా వ్యాధి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో క్రీడలు రద్దయ్యాయి. మరికొన్ని నిరవధికంగా వాయిదా పడ్డాయి.

మరోవైపు భారత్ వేదికగా ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపిఎల్‌పై కూడా దీని ప్రభావం పడింది. కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా భారత్‌కు వచ్చే విదేశీయులపై ఆంక్షలు కూడా విధించింది. దీంతో ఐపిఎల్‌లో ఆడే వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లకు వీసాలు లభించని పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 15 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ తర్వాత ఈ ఆంక్షలను మరి కొన్ని రోజుల పాటు పొడిగించినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపిఎల్‌లో విదేశీ క్రికెటర్లు పాల్గొనడం కష్టంగా మారింది. విదేశీ క్రికెటర్లు లేకుండా ఐపిఎల్ నిర్వహిస్తే అభిమానుల నుంచి తగిన స్పందన లభిస్తుందా అనేది ఫ్రాంచైజీల యజమానులను కలవరానికి గురి చేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీ నిర్వహించడం కంటే రద్దు చేయడమే మంచిదని పలు ఫ్రాంచైజీల యాజమాన్యాలు అభిప్రాయపడి నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా, కరోనా వ్యాధి ఉన్నా ఐపిఎల్‌ను నిర్వహించి తీరుతామని గతంలో స్పష్టం చేసిన భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్ర  స్తుతం వెనక్కి తగ్గినట్టే కనిపిస్తున్నాడు. భారత ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో గంగూలీ కూడా తన పంథాన్ని వీడాడు. అందులో భాగంగానే ఐపిఎల్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాడు.

ఆశలు వదులుకున్నారు..
మరోవైపు ఈ ఏడాది ఐపిఎల్ జరుగడంపై అభిమానులు కూడా ఆశలు వదులుకున్నారు. కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో అభిమానులు స్టేడియాలకు తరలి వచ్చే మ్యాచ్‌ను చూసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అభిమానులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఐపిఎల్ నిర్వహణ కమిటీ కూడా పెద్దగా ఆసక్తి చూపక పోవచ్చు. కాసుల పంట పండించే ఐపిఎల్‌కు అభిమానులే పెద్ద పెట్టుబడి. వారు అందించే ప్రోత్సాహం క్రికెటర్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. ఇక, అభిమానులే లేకుంటే ఐపిఎల్ నిర్వహించినా పెద్దగా ప్రయోజనం ఉండక పోవచ్చు. ఖాళీ స్టేడియాల్లో ఐపిఎల్ నిర్వహించడం కంటే దాన్ని రద్దు చేయడమే మంచిదని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేగాక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఏడాది టోర్నీని రద్దు చేసినా వచ్చే నష్టమేమీ ఉండదని వారు పేర్కొంటున్నారు.

IPL 2020 Postponed
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News