Tuesday, April 30, 2024

చాలెంజర్స్‌కు సిఎస్‌కె ఝలక్

- Advertisement -
- Advertisement -

జడేజా ఆల్‌రౌండ్ షో, రాణించిన డుప్లెసిస్
బెంగళూరుపై చెన్నై ఘన విజయం

IPL 2021: CSK Win by 69 runs against RCB

ముంబై : ఐపిఎల్14లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జైత్ర యాత్రకు తెరపడింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) 69 పరుగుల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరును సాధించింది. లక్షఛేదనకు దిగిన బెంగళూరు నిర్ణీత ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్ర మే చేసి ఓటమి పాలైంది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌షోతో చెన్నైకి ఒంటిచేత్తో విజయం సాధించి పెట్టాడు. ఈ సీజన్‌లో బెంగళూరుకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఇక సీజన్‌లో నాలుగో విజయం సాధించిన చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
శుభారంభం లభించినా..
భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు కు ఓపెనర్లు విరాట్ కోహ్లి, దేవ్‌దుత్ పడిక్కల్ శుభారంభం అందించారు. కిందటి మ్యాచ్‌లో అజేయ శతకంతో అలరించిన పడిక్కల్ ఈసారి కూడా దూకుడును ప్రదర్శించాడు. చెన్నై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరు ను పరిగెత్తించాడు. మరోవైపు కోహ్లి అతనికి అండగా నిలిచాడు. అయితే కోహ్లి (8)ను శామ్ కరన్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే పడిక్కల్ కూడా వెనుదిరిగాడు. చెలరేగి ఆడిన పడిక్కల్ 15 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 34 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. చెన్నై బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ చాలెంజర్స్ బ్యాట్స్‌మెన్‌ను కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా ఏడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక స్టార్ ఆటగాడు మాక్స్‌వెల్ కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. 3 ఫోర్లతో 22 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన డివిలియర్స్ (4) నిరాశ పరిచాడు. ఈ మూడు వికెట్లు కూడా రవీంద్ర జడేజా ఖాతాలోకే వెళ్లడం విశేషం. ఇక డానియల్ క్రిస్టియన్ (1), హర్షల్ పటేల్ (0), నవ్‌దీప్ సైని (2) కూడా జట్టుకు అండగా నిలువడంలో విఫలమయ్యారు. మరోవైపు జెమీసన్ 16 పరుగులు చేసి రనౌటయ్యాడు. సిరాజ్ 12, చాహల్ 8 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక చెన్నై బౌలర్లలో జడేజా 13 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తాహిర్‌కు రెండు వికెట్లు లభించాయి. జడేజాకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఓపెనర్ల జోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ మరోసారి మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు బెంగళూరు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. గైక్వాడ్ తన మార్క్ షాట్లతో అలరించాడు. అయితే 25 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33 పరుగులు చేసిన గైక్వాడ్‌ను చాహల్ వెనక్కి పంపాడు. దీంతో 74 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వన్ డౌన్‌లో వచ్చిన రైనా కూడా దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ ముందుకు సాగాడు. అయితే మూడు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసిన రైనాను హర్షల్ ఔట్ చేశాడు. ఆ వెంటనే డుప్లెసిస్ కూడా పెవిలియన్ చేరాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్ 5ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేశాడు.
జడేజా విధ్వంసం..
ఇక చివర్లో రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. చాలెంజర్స్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ పరుగుల వరద పారించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో కనువిందు చేశాడు. అతన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన జడేజా 28 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో చెన్నై స్కోరు 191 పరుగులకు చేరింది.

IPL 2021: CSK Win by 69 runs against RCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News