Sunday, April 28, 2024

కనీసం 7 గంటలైనా నిద్ర అవసరం.. లేకుంటే అంతే…

- Advertisement -
- Advertisement -

18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి కనీసం 7 గంటలైనా రాత్రి నిద్ర అవసరం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ నిద్రతో అనేక సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యం దాపురిస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకనే తగినంత నిద్ర ఉంటే రోగ నిరోధక శక్తి ఉత్తేజం కావడమే కాక, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత అభివృద్ధి చెందుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దైనందిన వ్యవహారాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతాయి. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

ఏడు గంటల కన్నా తక్కువ నిద్ర వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు , గుండెపోటు, కుంగుబాటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతుంటారు. ప్రతిదానికి విసుక్కోవడం ఉంటుంది. ఐదారు గంటలు, అంతకంటే తక్కువ నిద్రతో ఏకాగ్రత , జ్ఞాపకశక్తి తగ్గుతాయి. కొత్త అంశాలను నేర్చుకోవాలన్న ఆసక్తి తగ్గుతుంది. పనివేగం తగ్గి పొరపాటు పనులు చేస్తుంటారు. మనసుపై ఆలోచనలపై ఉద్వేగాలపై నియంత్రణ కోల్పోతారు. కొవిడ్ కారణంగా గత మూడేళ్లుగా ప్రజల దైనందిన వ్యవహారాల్లో మార్పులు వచ్చాయి.

అలాగే గత పదేళ్లలో భారతీయుల్లో నిద్రపోయే అలవాట్లు మారాయి. అర్ధరాత్రి వరకు చాలా మంది మేల్కొని ఉంటున్నారు. ఉదయం పూట ఆలస్యంగా లేవడం పరిపాటి అయింది. నిద్ర వల్ల శరీరం విశ్రాంతి చెందుతుందని ఒక్కటే అనుకోరాదు. మెదడు పనితీరు సరిగ్గా ఉండడానికి కూడా సరైన నిద్ర అవసరం. నాలుగైదేళ్లుగా ఐటీ కంపెనీలు, ఇతర రంగాల ఉద్యోగులు ఎక్కువగా వర్క్‌ఫ్రం హోం పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ ఉద్యోగుల్లో సరైన నిద్ర ఉండదు. గురక పెడుతుంటారు. మధ్యలో ఉలికి పడుతుంటారు. పొద్దున లేచేసరికి వారిలో తాజాదనం కనిపించదు.

ఇలాంటి లక్షణాలు అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అనే సమస్య వల్ల కనిపిస్తాయి. దీనికి చికిత్స ఉన్నా కొన్ని నిబంధనలు కూడా కచ్చితంగా పాటించాలని పల్మనాలజీ స్పెషలిస్టులు సూచిస్తున్నారు. రోజూ కనీసం ఏడు గంటలైనా నిద్ర పోవాలని, సాయంత్రం 5 తరువాత టీ, కాఫీ తీసుకోకూడదని, రాత్రి 9 తర్వాత ఎలెక్ట్రానిక్ పరికరాలు వాడటం ఆపేయాలని సూచిస్తున్నారు. నిద్రించే చోట తగిన ఉష్ణోగ్రత, తక్కువ వెలుతురు, శబ్దాలు పెద్దగా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News