Saturday, April 27, 2024

కశ్మీర్ ఎన్నికలు ఎప్పుడు?

- Advertisement -
- Advertisement -

ఇంకా అవతరించని జమ్మూ కశ్మీర్ శాసన సభ స్థానాలను పెంచడానికి ఉద్దేశించిన నియోజకవర్గాల పునర్వవస్థీకరణ బిల్లును, అలాగే జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో బుధవారం నాడు ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఐదేళ్ళుగా బాకీపడి వున్న అసెంబ్లీ ఎన్నికల ఊసు ఎత్తకపోడం గమనించవలసిన విషయమే కాదు, గర్హించవలసిన అంశం కూడా అనడం అనుచితం కాబోదు. అంత వరకు ఆ రాష్ట్రానికి వున్న ప్రత్యేక హక్కులను రద్దు చేసి దాని రాష్ట్ర ప్రతిపత్తిని కూడా తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తలెత్తిన అశాంతికి తెర దించడంలో బిజెపి పాలకులు విఫలమవుతున్నారని పదే పదే రుజువవుతున్నది. అంతేకాకుండా అక్కడ అధికారం తమకు దక్కేలా చేసుకోడానికే ఆ సమయం వచ్చే వరకు ఎన్నికలను వాయిదా వేస్తూ పోవాలన్న దురుద్దేశం కూడా వారికి వున్నట్టు స్పష్టపడుతున్నది. 2018 డిసెంబర్ 19 నుంచి జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనలో వుంది. అక్కడ గత అసెంబ్లీ ఎన్నికలు 2014 నవంబర్‌లో జరిగాయి. 2019లో లోక్‌సభ ఎన్నికలను కూడా అక్కడ జరిపించారు.

మునిసిపల్, పంచాయతీ ఎన్నికలను 2018లో నిర్వహించారు. కాని రాష్ట్రాధికారాన్ని ప్రాతినిధ్య ప్రభుత్వానికి అప్పగించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి దోహదం చేసే శాసన సభ ఎన్నికలను మాత్రం ఏదో ఒక సాకు చూపి నిరవధికంగా వాయిదా వేస్తున్నారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగం 370వ అధికరణను, శాశ్వత నివాసులకు లేదా స్థానికులకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పిస్తూ వచ్చిన 35ఎ ని అక్కడి ప్రజల సమ్మతి తీసుకోకుండా 2019 ఆగస్టులో పార్లమెంటు ఆమోదం ద్వారా ప్రధాని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి నుంచి అక్కడ అశాంతి ప్రబలింది. దానితో కశ్మీర్ లోయలో పండిట్లను, బయటి నుంచి వచ్చి అక్కడ పని చేసుకొంటున్న కార్మికులను కూడా టెర్రరిస్టులు హతమార్చడం ప్రారంభించారు. జమ్మూలో కూడా టెర్రరిజం పెరిగింది. శాంతి భద్రతలను నెలకొల్పడమే అత్యంత శ్రమతో కూడిన పనిగా మారిపోయింది. పోలీసులను, భద్రతా దళాలను మితిమించి ఉపయోగించక తప్పని పరిస్థితి తలెత్తింది. ఒక రకంగా చెప్పాలంటే అసలే అత్యంత సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలో బిజెపి పాలకులు తమ హిందూత్వ లక్ష సాధన కోసం తామే జ్వాలలు రగిలించి వాటిని ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు.

తాము తీసుకొంటున్న కఠిన చర్యల వల్ల టెర్రరిజం తగ్గుముఖం పట్టిందని, అక్కడి పరిస్థితులు చక్కబడ్డాయని చెప్పుకొంటున్న కేంద్ర పాలకులు అసెంబ్లీ ఎన్నికలను జరిపించలేకపోడం వివాదాస్పదమవుతున్నది. పార్లమెంటులోనూ, బయటా కశ్మీర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మీద విమర్శలు గుప్పించడం వారికి అలవాటైపోయింది. తాజాగా రెండు బిల్లుల ఆమోదం సందర్భంలో కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మళ్ళీ అదే పని చేశారు. పాకిస్థాన్‌తో యుద్ధంలో భారత సైన్యం గెలుస్తున్న సమయంలో ప్రధాని నెహ్రూ తొందరపడి కాల్పుల విరమణ ప్రకటించి వుండకపోతే ప్రస్తుత ఆక్రమిత కశ్మీర్ కూడా భారత దేశంలో శాశ్వత భాగమై వుండేదని అమిత్ షా విమర్శించారు. ఈ అంశంపై ఐక్యరాజ్య సమితికి వెళ్ళడం తప్పేనని పేర్కొన్నారు. జరిగిపోయిన దాని మంచి చెడ్డలను అటుంచితే నెహ్రూ మీద దుమ్మెత్తి పోస్తూ కశ్మీర్ మంటలను ఎంత కాలం అలా రగలనిస్తారనేది ప్రధానమైన ప్రశ్న. అందుకు ప్రస్తుత కేంద్ర పాలకులను మాత్రమే బాధ్యులను చేయక తప్పదు. దేశంలోని ఏ ఒక్క ప్రాంతంలోనైనా ప్రజాస్వామిక ప్రక్రియ నిరంతరం వాయిదా పడుతూ వుండడం ఎంత మాత్రం మంచిది కాదు.

భద్రతా దళాలు, పోలీసుల నిఘాలో ప్రజాజీవనం కష్టాల పాలవుతుందేగాని సుఖంగా సాగదు. 13 ఏళ్ళ వ్యవధి తర్వాత 2018లో కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి (పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ) రెండూ బహిష్కరించాయి. జిల్లా అభివృద్ధి మండళ్ళ ఎన్నికల్లో ప్రతిపక్ష గుప్కార్ ప్రజా కూటమి ఘన విజయం సాధించింది. అందుచేత గెలుపు ధీమా కొరత వల్ల కశ్మీర్‌లో శాసన సభ ఎన్నికలను కేంద్రం వాయిదా వేస్తున్నదనే అభిప్రాయం ఏర్పడింది. తాజాగా ఆమోదించిన బిల్లుల ద్వారా శాసన సభలో స్థానాలను పెంచడానికి, మొట్టమొదటి సారిగా ఎస్‌టిలకు 9 స్థానాలు రిజర్వు చేయడానికి ఉద్దేశించారు. అలాగే పండిట్లకు, ఆక్రమిత కశ్మీర్ నుంచి వలస వచ్చిన వారికి, మహిళలకు రిజర్వేషన్లు కల్పించదలిచారు. అయితే జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని కేంద్రం ప్రకటించి వుంది. అది ఇంకా జరగలేదు. అది జరిగి అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా మెజారిటీ ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించగలిగినప్పుడే అక్కడ మామూలు పరిస్థితులు నెలకొన్నట్టు భావించగలం. 2026 నాటికి టెర్రరిజాన్ని సమూలంగా నిర్మూలిస్తామని అమిత్ షా ప్రకటించారు. అంత వరకు ఎన్నికలుండవా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News