Sunday, April 28, 2024

జనవరి 26 జాతీయ పండగేనా!

- Advertisement -
- Advertisement -

26 జనవరి అనగానే పిల్లల్లో ఒక ఆనందం. చక్కని స్కూలు డ్రెస్‌లు వేసుకొని ఉదయం 5 గం॥లకే తయారై స్కూలుకు పరిగెత్తాలని ఉత్సాహం. స్కూలు నుండి రెండు వరుసలుగా బారులు తీరి జెండాలు చేతబట్టి ఊరేగింపుగా బయలుదేరడం, ‘భారత మాతాకి జై’, ‘భారత రాజ్యాంగానికి జై’ అంటూ నినాదాలతో ఉత్సాహంగా సాగిపోతుంటారు. అందరికీ ఇది చిన్ననాటి ఉత్సాహవంతమైన జ్ఞాపకం. 26 జనవరి ప్రాధాన్యత ఏమిటో అప్పుడు అర్థం కాలేదు. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన పరిపాలన, మన న్యాయ వ్యవస్థ, మన రాజకీయ ప్రతినిధులు, చట్టసభలు ఎలా ఉండాలో పౌరుల హక్కులు, బాధ్యతలు ఏమిటో అని నిర్ణయించుకొని అమలులోకి తెచ్చుకున్న రోజు జనవరి 26, 1950. స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం, అందరికీ ఒకే ఓటు, కుల వివక్ష, మత వివక్ష, ప్రాంతీయ వివక్ష, జాతుల వివక్ష మొదలైనవాటన్నిటినీ తొలగించుకొని నూతన సమాజంగా రూపుదిద్దుకోవడానికి రాజ్యాంగబద్ధంగా కృషి చేయాలని నిర్ణయించుకున్న రోజు. అలా ఇవాళ అందరం సమస్త హక్కులు కోరడానికి, కుల వివక్ష, వర్గ వివక్ష, వర్ణ వివక్ష, మత వివక్షలకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి భారత రాజ్యాంగమే పునాది.

ఇలా 26 జనవరి 1950 నుండి భారత రాజ్యాంగం ఛత్రఛాయలో భారత ప్రజలు జీవిస్తున్నారు. అందువల్ల పౌరులందరూ రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. తమ హక్కులేమిటో, కర్తవ్యాలేమిటో తెలుసుకోవడం అవసరం.భారత రాజ్యాంగంలో మొత్తం 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్కరికీ అవసరమైనవి సంక్షిప్తంగా పేర్కొన్నాను. ప్రభుత్వాలు ఎలా ఏర్పడుతున్నాయి? ఎలా పని చేస్తున్నాయి? ఓటు హక్కు ద్వారానే ఈ మొత్తం పరిపాలన వ్యవస్థ ఎలా నిర్దేశించబడుతున్నదో రాజ్యాం గం చదివితే తెలుస్తుంది. ప్రజా ప్రతినిధులను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, లోక్‌సభ, శాసనసభ సభ్యులను, సర్పంచ్ దాకా మొదలైన అందరినీ కనిపెంచుతున్న తల్లిదండ్రులు పౌరులే అనే విషయం అర్థం చేసుకోవాలి.

రాజ్యాంగాన్ని మనం కరదీపికగా ఈ సమాజాన్ని సామాజిక సంస్కరణ, ఆధునిక అభివృద్ధిని, అందులో సమానమైన వాటాను సాధించుకోవడం అవసరం. అడగనిదే అమ్మైనా పెట్టదు. అంగట్లో ఉన్నంత మాత్రాన అన్ని మన నోట్లోకిరావు. రాజ్యాంగంలో ఉన్నంత మాత్రాన మనకు అందుబాటులోకి రావు. మనం వాటి కోసం డిమాండు చేసి, ఉద్యమించి సాధించుకున్నప్పుడే మన అందుబాటులోకి వస్తాయి. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలోనే మన వివేచన, దక్షత, సామర్థ్యం దాగి ఉంది. మనం ఎలాంటి వారిని ఎన్నుకుంటే అలాంటి పరిపాలనే ఉంటుంది. ఎన్నికల ప్రణాళికలో ఎన్నో చెప్తారు. వాటిని ఆచరించకపోవచ్చు. అందువల్ల వాటి కోసం ఉద్యమించడం అవసరం. అందుకు రాజ్యాంగంలోని హక్కులేమిటో తెలుసుకోవడం అవసరం. ప్రతి ఒక్కరికీ అవసరమైన మేరకు ఈ చిన్న పుస్తకంలో పొందుపరిచాను. బిసి కమిషన్ ఛైర్మన్‌గా రాసిన ‘బిసి నోట్‌బుక్’ నుండి ముఖ్యమైన అంశాలను సంక్షిప్తీకరించి పొందుపరచడం జరిగింది.
26 జనవరి 1950కి ముందు మనుషులందరూ సమానం కాదు

భారత రాజ్యాంగం విశిష్టతను ఒబిసిలు, ఎస్‌సిలు, ఎస్‌టిలు సరిగ్గా గుర్తించడం లేదు. భారత రాజ్యాంగం మనుషులందరినీ సమానం చేసింది. ‘వన్ మ్యాన్ వన్ వాల్యూ, వన్ ఓట్’ (ప్రతి మనిషికి ఒకే విలువ, ఒకే ఓటు) అని స్థిరపర్చింది. 26 జనవరి 1950 నుంచి భారత రాజ్యాంగం ద్వారా ఇది తాత్విక భూమికగా నిలిచింది. దాంతో రాజ్యాంగబద్ధ్దంగా మనుషులందరూ సమానమయ్యారు. అంతకు ముందు మనుషులందరూ సమానులు కారు. విభిన్న కులాలుగా, వర్ణాలుగా, వర్గాలుగా, తెగలుగా, జాతులుగా అనేక అసమానతలకు, వివక్షలకు, వెలివేత లకు, పీడనలకు, అణచివేతలకు గురయ్యే తత్వశాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు, మనుస్మృతి, బ్రాహ్మణీయ శాస్త్రాలు, రామాయణం, మహాభారతాలు మొదలైనవి వర్ణ, కుల వ్యవస్థల అసమానతలకు పునాదిగా నిలిచాయి. వాటన్నిటినీ పూర్వపక్షం చేస్తూ ఆధునిక సమాజ నిర్మాణం కోసం భారత రాజ్యాంగం ప్రపంచంలో ఒక గొప్ప రాజ్యాంగంగా ముందుకు వచ్చిన రోజు 26 జనవరి 1950.
పరస్పరం అంగీకారంతో సాధించిన విజయాలే భారత రాజ్యాంగం. అందులో వాయిస్ గ్రూపుగా ఉన్నవారు, అందులో లేనివారిని కూడా పట్టించుకున్నారు. మహిళలు, బాలలు లేకపోయినప్పటికీ వారి గురించి పట్టించుకున్నారు. ఒబిసిలు బలమైన వాయిస్ ఇవ్వగలిగినవారు ఎవరూ లేకపోయినప్పటికీ అనేక ఆర్టికల్స్‌ను చేర్చి రక్షణను కల్పించారు. తర్వాత తీసుకోవాల్సిన చర్చల కోసం అవకాశమిచ్చారు. చర్యల కోసం, చట్టాల కోసం అవకాశాలిచ్చారు. అందరినీ ఒప్పించిన రాజ్యాంగం అన్నింటికన్నా గొప్పది. ఆచరణలో ఉన్నది.

ప్రపంచంలోని మహోన్నత తాత్వికత
“వన్ మ్యాన్ వన్ వాల్యూ, వన్ ఓట్‌”
‘వన్ మ్యాన్ వన్ వాల్యూ, వన్ ఓట్’ (ప్రతి మనిషికీ ఒకే విలువ. ఒకే ఓటు) అనేది ఎంత గొప్ప తాత్వికతో నేను అనేక తాత్విక గ్రంథాల్లో, రచనల్లో, ప్రసంగాల్లో వివరించాను. దీన్ని బలంగా జీవితమంతా సమస్త రంగాల్లోకి విస్తరింపజేసిన దార్శనికుడు డా. బి.ఆర్. అంబేడ్కర్. వేల యేళ్ళుగా ఎందరో తత్వవేత్తలు ఎన్నో సిద్ధాంతాలు చేశారు. వాటన్నిటి కన్నా అత్యంత వాస్తవికమైన అత్యున్నత తాత్వికత. అది రాజ్యాంగబద్ధమైంది. అన్నిటికీ భూమికగా నిలిచింది. దీని ప్రాధాన్యతను బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు, మహిళలు గుర్తించాలి. ఇతర దేశాల్లో అనేక ఉద్యమాల తర్వాత సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించబడింది. మహిళలకు ఎంతో ఆలస్యంగా ఓటు హక్కు కల్పించారు.

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం. సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు. సమస్త అసమానతలు, వివక్షలు, దోపిడీల నిర్మూలన. కుల నిర్మూలన, స్త్రీల సమానత్వం, స్టేట్ సోషలిజం, భూమిని, పరిశ్రమలను, బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీలను జాతీయం చేయడం, ప్రభుత్వ ఉద్యోగ, విద్యారంగాలలో వెనుకబడిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు, విద్య ప్రాముఖ్యత, మానవీయ విలువలు, ప్రపంచ స్థాయిలో భారత దేశం పునర్నిర్మాణం, రాజ్యాంగ నిర్మాణ పరంగా డా. బి.ఆర్. అంబేడ్కర్ రుణం భారత జాతి తీర్చుకోలేనిదని ప్రథమ రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేడ్కర్ హిందూ సమాజంలోని కుల, మత, ఆర్థిక దోపిడీ శక్తుల పాలిట విప్లవానికి ప్రతీక అని భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేర్కొన్నారు.

భారత స్వాతంత్య్ర చట్టం, 1947
‘లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక’ భారత దేశ విభజనకు ఆధారం అని చెప్పవచ్చు.ఈ ప్రణాళిక ప్రకారం బ్రిటిషు పార్లమెంట్ భారత స్వాతంత్య్ర చట్టాన్ని 1947 జులై 5, ఆమోదించింది. ఇది 1947 జులై 18న బ్రిటీషు రాజరికం ఆమోదాన్ని పొందింది. ఈ చట్టం 1947 ఆగస్టు 15 నుంచి అమలులోకి వచ్చింది. భారత స్వాతంత్య్ర చట్టాన్ని పురస్కరించుకొని, ఇండియా, పాకిస్థాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు అవతరించాయి. భారత రాజ్యాంగం సుదీర్ఘమైనది. భారత రాజ్యాంగంలో శాసన నిర్మాణ, పరిపాలన, ఆర్థిక సంబంధాలు కేంద్ర, రాష్ట్రాల మధ్య ఎలా ఉండాలో వివరించారు.

భారత రాజ్యాంగం రూపకల్పన
డా. బి.ఆర్. అంబేడ్కర్ డ్రాఫ్ట్ కమిటీ ఛైర్మన్‌గా 1948, జనవరి నెలలో రాజ్యాంగం తొలి ముసాయిదా ప్రతి (చిత్తు ప్రతి) విడుదల అయింది. ఆ చిత్తు ముసాయిదాకు వివిధ వర్గాల నుండి, ప్రజల నుండి 7,635 సవరణలు వచ్చాయి. వాటిలో 2,473 సవరణలపై ఉప సంఘం చర్చించింది. 26 నవంబర్, 1949న నూతన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. తొలి రాజ్యాంగ ప్రతిపై 24 జనవరి 1950 తేదీన 284 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు సంతకాలు చేశారు. అలా నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అదే గణతంత్ర దినం అనే రిపబ్లిక్‌డే.

బి.ఎస్.రాములు
8331966987

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News