దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో విభాగంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో అసాధారణ రీతిలో రాణించిన హైదరాబాదీ స్టయిలీష్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తాజా ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒక స్థానాన్ని కోల్పోయి 8వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన రూట్ టాప్ ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. భారత బౌలర్ల ను దీటుగా ఎదుర్కొన్న రూట్ సచిన్, అండర్సన్ సిరీస్‌లో పరుగుల వరద పారించాడు. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లోనూ రూట్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.
రూట్ 908 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌కే చెందిన హ్యారీ బ్రూక్ ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని రెండో స్థానంలో నిలిచాడు. చివరి టెస్టులో బ్రూక్ (Brook Test) సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) ఒక ర్యాంక్‌ను కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తన నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకోవడంలో సఫలమయ్యాడు. భారత ఓపెనర్ యశస్వి మూడు ర్యాంక్‌లు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో యశస్వి అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో బ్యాట్‌ను ఝులిపించి భారత్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ఆరో, కమిందు మెండిస్ (శ్రీలంక) ఏడో ర్యాంక్‌లో నిలిచారు. భారత ఆటగాడు రిషబ్ పంత్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి 8వ స్థానంలో నిలిచాడు. డారిల్ మిఛెల్ (న్యూజిలాండ్) నాలుగు ర్యాంక్‌లు మెరుగుపడి 9వ స్థానాన్ని దక్కించుకున్నాడు.
బెన్ డకెట్ (ఇంగ్లండ్) పదో ర్యాంక్‌ను కాపాడుకోవడంలో సఫలమయ్యాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో విఫలమైన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాప్10 నుంచి వైదొలిగాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో గిల్ 9వ స్థానంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి పడిపోయాడు. టాప్‌లోనే బుమ్రా.. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. చివరి టెస్టుకు దూరంగా ఉన్నా బుమ్రా అగ్రస్థానానికి ఢోకా లేకుండా పోయింది. 889 పాయింట్లతో బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో మూడు టెస్టులు ఆడిన బుమ్రా 14 వికెట్లను పడగొట్టి సత్తా చాటాడు. సౌతాఫ్రికా బౌలర్ కగిసొ రబడా రెండో, పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) మూడో, మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్) నాలుగో, హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.
హెన్రీ మూడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇక భారత స్పీడ్‌గన్ సిరాజ్ తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 12 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ఇంగ్లండ సిరీస్‌లో సిరాజ్ అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం సిరాజ్ 15వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్‌ల విభాగంలో భారత సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. నాలుగో స్థానంలో టీమిండియా టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతోంది. భారత్ 107 పాయింట్లతో టాప్5లో చోటును కాపాడుకుంది. ఆస్ట్రేలియా 124 పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకుంది. సౌతాఫ్రికా రెండో, ఇంగ్లండ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. న్యూజిలాండ్ తాజా ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానాన్ని దక్కించుకుంది.