Saturday, May 4, 2024

ఎన్‌డిఎలో చేరిన జెడిఎస్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్నాటకకు చెందిన జనతాదళ్ సెక్యులర్(జెడిఎస్)బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్‌డిఎ) కూటమిలో చేరింది. జెడిఎస్ సీనియర్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాలను కలిసారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎతో కలిసి పనిచేయడం, సీట్ల కేటాయింపుపై వారితో చర్చించారు. కాగా జెడి(ఎస్) ఎన్‌డిఎలో చేరినట్లు బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించారు.హెచ్‌డి కుమారస్వామితో ఉన్న ఫొటోలను ఆయన ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. ‘ జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగస్వామిగా ఉండాలని జెడి(ఎస్) నిర్ణయం తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నా. వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం.

ఎన్‌డిఎతో పాటుగా ‘నవ భారతం, బలమైన భారత దేశం’ కోసం ప్రధాని మోడీ దార్శనికతను ఇది బలపరుస్తుంది’ అని నడ్డా పేర్కొన్నారు. మరోవైపు జెడి(ఎస్) చీఫ్ హెచ్‌డి దేవెగౌడ గత వారం మీడియాతో మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎతో కలిసి వెళ్లేందుకుఢిల్లీలోని బిజెపి సీనియర్ నేతలతో చర్చలు ప్రారంభించినట్లు చెప్పారు.ఈ నిర్ణయం మళ్లీ ప్రధానిని కావడానికి కాదని, పార్టీని కాపాడుకోవడం కోసమేనని స్పష్టం చేశారు. దేవెగౌడ నేతృత్వంలోని జెడి( ఎస్) కర్నాటకలో కాంగ్రెస్, బిజెపిల తర్వాత బలమైన పార్టీగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బలం బాగా పడిపోగా కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా బిజెపి ఈ రెండు పార్టీల తర్వాత మూడో స్థానానికి పడిపోయింది. దక్షిణ కర్నాటకలో బలంగా ఉన్న జెడి(ఎస్)తో చేతులు కలపడం వల్ల రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటవచ్చని బిజెపి భావిస్తోంది.

సెక్యులర్ అని చెప్పుకునే అర్హత లేదు: కాంగ్రెస్
కాగా సెక్యులర్ పార్టీగా చెప్పుకునే జెడి(ఎస్) మతతత్వ పార్టీ అయిన బిజెపితో చేతులు కలపడంపై కర్నాటక కాంగ్రెస్ తమదైన రీతిలో స్పందించింది.. ఆ పార్టీ ఇకపై సెక్యులర్ పార్టీనని చెప్పుకోజాలదని ఆ పార్టీ నేతలు అన్నారు. దీనివల్ల తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, హోంమంత్రి జి పరమేశ్వర వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జెడి(ఎస్) ప్రధాన పార్టీ అని,బిజెపి దాని బిటీమ్ అని దీన్ని బట్టి స్పష్టమవుతోందని కూడా వారన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా తమ పార్టీ పేరులో సెక్యులర్ పదాన్ని తొలగించాని జెడి( ఎస్) ఎన్నికల కమిషన్ లేఖ రాయాలని కూడా వ్యంగ్యంగా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News