Thursday, June 13, 2024

అభినవ ఝల్కరీ బాయి

- Advertisement -
- Advertisement -

ఒక సామాన్యమైన నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన యువతి… పెళ్లి చేసుకుని అత్తవారింట్లో సగటు జీవితం గడుపుతున్న సమయంలో భర్త దూరం అవడంతో విధి వక్రీకరించింది. జీవిత నౌక ఒక్కసారిగా ఉప్పెనలో అలల తాకిడికి గురైన రీతి లో అగమ్యగోచరమైనది. తన జీవితాన్ని సరిదిద్దుకొని తన ఒక్కగానొక్క కుమార్తెకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ, ఒక ప్రైవేటు పాఠశాలలో అధ్యాపకురాలిగా జీవితాన్ని ప్రారంభించిన ఆ మహిళ, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడమే కాదు సమాజంలో ఉన్న కుల వైషమ్యాలకు వ్యతిరేకంగా, వివక్షలకు గురి అవుతున్న మహిళల పక్షాన నిలబడిన ధీరోదాత్త వనితగా చరిత్ర పుటల్లో తనకంటూ ఒక పేజీని సృష్టించుకున్న అణగారిన వర్గాల ప్రతినిధిగా వినుతికెక్కిన ఆమె మరెవరో కాదు ఈశ్వరిబాయి. అలనాటి ఝల్కరీ బాయ్‌ని జ్ఞప్తికి తెచ్చే ధీరోధాత్త పోరాట పటిమ ఆమె సొంతం.

ఈశ్వరీ బాయి పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడిన దళిత నేతగా, లింగ వివక్షకు వ్యతిరేకంగా అణచివేతకు గురవుతున్న స్త్రీ జాతికి వెన్నుదన్నుగా నిలిచిన మహిళా నాయకురాలుగా, తాను జన్మించిన తెలంగాణ గడ్డ అభివృద్ధి కొరకు ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ముందుకు తీసుకు వెళ్లిన తెలంగాణ ఉద్యమ సారథిగా, శాసన సభలో ప్రతిపక్షాల నాయకులలో జవసత్వాన్ని నింపిన అపర కాళికగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్న జెట్టి ఈశ్వరీబాయి పలువురికి ఆదర్శప్రాయురాలు. తన జీవన ప్రస్థానంలో ఒక ఉపాధ్యాయురాలుగా జీవితాన్ని ప్రారంభించిన ఆమె మహిళలకు అంతగా ప్రోత్సాహం లేని సమయంలో రాజకీయ రంగంలో ప్రవేశించి ఎంతగానో రాణించారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వంటి మహనీయుల ఆశయాలను పుణికి పుచ్చుకొని ఆలక్ష్యాల సాధనకు జీవితాన్ని వెచ్చించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ప్రసంగాన్ని స్వయంగా విని స్ఫూర్తిని పొందారు. కుల వివక్ష, అంటరానితనం, అణచివేత, పీడనలకు గురవుతున్న ఆదివాసీ దళిత వర్గాల పక్షాన వారి హక్కుల సాధనకు నడుం కట్టిన నాయకురాలుగా ఖ్యాతి అందుకున్నారు. మహిళా హక్కుల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. రాజకీయాల్లో ప్రవేశించి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా హైదరాబాద్ నగర పాలక సంస్థ కార్పొరేటర్‌గా విజయం సాధించిన ఆమె ప్రస్థానం అక్కడితో ఆగిపోలేదు. నిరంతరం ప్రజా సమస్యల సాధనకు పాటు పడుతూ అంచెలంచెలుగా ఎదిగి తాను నమ్మిన ఆశయాల సాధన కొరకు రాజకీయ పదవులు ద్వారా కృషి చేశారు. నిరుపేద మహిళలలో ఏమాత్రం చైతన్యం లేని సమయంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల సాధికారత, సమానత్వం, ఆర్థిక స్వాతంత్రం కొరకు కృషి చేసిన నేతగా మహిళల్లో స్థానం సంపాదించారు.కుటుంబాలను శాశ్వతంగా పేదరికంలోనికి నెడుతున్న మద్యపానంపై పోరా టం చేసిన నాయకురాలుగా చరిత్ర సృష్టించారు.

నిరంతరం ప్రజల్లో తిరుగుతూ రౌడీమూకలను సైతం తనదైన శైలిలో ఎదుర్కొని తెగువ ప్రదర్శించారు. 1962లో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పిఐ) పార్టీలో చేరిన ఆమె రాజకీయాల్లో కాకలు తీరిన నేతలు సదాలక్ష్మి, నంది ఎల్లయ్యలను ఓడించి శాసన సభ్యురాలుగా తనదైన శైలిలో పని చేశారు. ఈశ్వరీబాయి పేరు చెప్పగానే ఆనాడు అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన నేటికీ ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని కంచికచర్లలో పాలేరుగా జీవనం సాగిస్తున్న కోటేసు అనే ఎస్‌సి వర్గానికి చెందిన వ్యక్తిని అగ్రవర్ణ భూస్వాములు దొంగతనం నెపంతో సజీవ దహనం చేసిన సంఘటనను అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన ఆమె, చర్చ సందర్భంగా నాటి రాష్ట్ర మంత్రి తిమ్మారెడ్డి అనుచిత వ్యాఖ్యల పట్ల ఈశ్వరీ బాయి కలకత్తా కాళికగా చెలరేగిపోయా రు. చెప్పుతో సమాధానం చెప్పిన ఆ తెగువను ఎవరూ మర్చిపోలేరు.

ఈ సంఘటన వెనుక తన వర్గంపై జరుగుతున్న దౌర్జన్యాలపై ఆమె ఆవేదన, కులవైషమ్యాలను ఎదుర్కొనేందుకు అణగారిన వర్గాల ప్రజలను చైతన్యపరిచేందుకు, అణచివేతకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు తాను ముందు ఉండి నడిపించేందుకు తనను తాను ఆవిష్కరించుకున్న తీరు చరిత్రలో నిలిచిపోయింది.కేవలం దళిత నాయకురాలుగా మాత్రమే గాక తెలంగాణ ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంతం లో వున్న ప్రత్యేక పరిస్థితులు, వెనుకబాటుతనం పేదరికం, సరియైన నీటి సౌకర్యం లేక ఎడారులుగా మారుతున్న బీడు భూములు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలకు పరిష్కారంగా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ద్వారా తమ పాలన తామే చేసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించుకోవాలనే లక్ష్యంతో తొలినాళ్లలో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఉద్యమనేతగా ఆమె తెలంగాణ ప్రజలకు చిరస్మరణీయురాలు.

తెలంగాణ ప్రజాసమితి ఉపాధ్యక్షురాలుగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు అప్పటి పాలకుల దమన నీతిని ప్రదర్శించారంటూ వారిపై అసెంబ్లీ సాక్షిగా తీవ్రంగా ఎదురు తిరిగారు. అలా అని ఈ ఒక్క ప్రాంతానికే ఆమె పరిమితం కాలేదు. రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణలో అణచివేత ఎక్కడున్నా వారి పక్షాన నిలిచేందుకు అక్కడ ఈశ్వరీ బాయి ప్రత్యక్షమయ్యేవారు. దళిత విద్యార్థుల భవిష్యత్తు కొరకు సంక్షేమ హాస్టల్లో వసతుల కల్పన కొరకు, నిరుపేద వర్గాలకు ఇళ్ల స్థలాల కల్పన కొరకు బంజరు భూములు పంపిణీ చేయించేందుకు, చేనేత కార్మికుల సమస్యల కొరకు, జైలు ఖైదీల జీవితాలలో వెలుగులు నింపేందుకు, నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు, ఉద్యోగుల సమస్యల కొరకు, వ్యవసాయ కార్మికులు రైతుల సమస్యల కొరకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన కొరకు, వయసు మళ్ళి జీవితం భారంగా మారిన వృద్ధులకు పెన్షన్ కల్పన కొరకు, దళిత బలహీన వర్గాలకు చెందిన మత్స్యకారులకు చెరువుల్లో హక్కులు కల్పించేందుకు ఆమె అసెంబ్లీని వేదికగా చేసుకొని సమస్యలను సాధించుకున్నారు.

ఒక సామాన్య మహిళగా జీవనం ప్రారంభించిన ఈశ్వరీ బాయి విధిని ఎదిరించి తన జీవితాన్ని తనంతట తాను మలచుకొని ఎందరికో వెలుగులు నింపారు. ప్రజా జీవితంలో తనదైన శైలిలో ప్రజా సమస్యల సాధన కొరకు శ్రమించిన తీరు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఆదివాసీ దళిత ప్రజల గుండె చప్పుడుగా, మహిళల ఆత్మగౌరవంగా, తెలంగాణ ప్రజల హృదయ నేతగా కీర్తింపబడిన ఈశ్వరీ బాయి జీవితం ఆదర్శనీయం. ఆమె కుమార్తెగా రాజకీయాల్లో ప్రవేశించిన గీతారెడ్డి ఆమె అడుగుజాడల్లో రాజకీయాల్లో రాణించి పేదల పక్షాన నిలుస్తున్నారు. ఈశ్వరీ బాయి పేరున పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సమాజానికి ఈశ్వరీ బాయి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమె జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News