Sunday, April 28, 2024

యువతకు కొలువులు సాధ్యమే

- Advertisement -
- Advertisement -

Jobs are possible for young people

 

ఇప్పుడున్న డిజిటల్ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నూతన టెక్నాలజీతో మనుషులు చేసే పలు రకాల పనులను కంప్యూటర్లు, యంత్రాలు చేయగలుగుతున్నాయి. ఈ దశలో నూతన స్కిల్స్ సాధించుకోవడం అవసరం. తెలంగాణ యువతలో గల బిడియం, ఆత్మన్యూనతాభావం, చెప్పాలనుకున్నది సరిగా చెప్పలేకపోవడం, లేజీనెస్, ఈజీ గోయింగ్‌తత్వం, సామాజిక, ఆర్థిక కారణాల వల్ల ఉపాధి అవకాశాలు అందుకోలేక పోతున్నారు. మన ఆర్థిక వ్యవస్థ పలు రంగాలతో పని చేస్తుంది. మొదటిది వ్యవసాయం. రెండవది కులవృత్తులు, సేవావృత్తులు. మూడు పరిశ్రమలు. నాలుగు రవాణా రంగం. ఐదు భవన నిర్మాణ రంగం. ఆరు ఐటి ఆధారిత రంగం. ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు. ఎనిమిది వ్యాపార రంగం, వైద్య రంగం, విద్యారంగం. తొమ్మిది కరెంట్, మెకానికల్ రిపేరింగ్, సెల్‌ఫోన్, కంప్యూటర్ రిపేరింగ్, ప్రింటింగ్, డిటిపి, చాయ్ దుకాణం, హోటళ్లు, సూపర్ మార్కెట్లు. కిరాణ, జనరల్ స్టోర్స్ ముదలైన అనేక దుకాణాలు, వాటిలో ఉద్యాగాలు. కాంట్రాక్టులు.

మట్టి తవ్వకం మొదలుకొని మహా నిర్మాణాల దాకా అన్నీ కాంట్రాక్టుల ద్వారానే సాగుతాయి. చైనా ఉత్పత్తులను మనమే ఉత్పతి చేసుకోవలసిన రంగాలు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగ భద్రత ఉంటుందని ప్రైవేటులో పోటీ ఎక్కువ అని నిరుద్యోగ యువత భావిస్తున్నది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ, పోటీ ఎక్కువ అయింది. 24 లక్షలమంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద రిజిష్టర్ చేసుకున్నారు.

వాస్తవానికి ఏ ప్రభుత్వం కూడా ఇందులో పది శాతానికి కూడా ఉద్యోగాలు కల్పించలేదు. ఇపుడున్న ఉద్యోగుల్లో పూర్తి స్థాయి ఉద్యోగులు 2.90 లక్షలు మాత్రమే. మొత్తం కలిపి 4.5 లక్షలే. ఇప్పటికే 1.36 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తేనే ఈ సంఖ్య. ఇపుడు జిల్లాలో మొత్తం కలిపి ఐదారు వేల మంది ఉద్యోగులే ఉంటారు. ఎక్కువ మంది హైదరాబాద్ నగరంలో, ఆర్‌టిసి, ఎలక్ట్రిసిటీ, సింగరేణిలలో పని చేస్తున్నారు. తెలంగాణ యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పన గురించి మనం ఏమైనా చేయగలమా? ప్రభుత్వంతో నిరుద్యోగ యువతకు కొలువులు వచ్చేలా మనం ఏమైనా చేయించగలమా!? తెలంగాణ యువతకు చిన్నదో, పెద్దదో, తాత్కాలికమో, రెగ్యులరో ఏదో ఒకటి లక్ష యాభై వేలు, రెండు లక్షల కొలువుల కల్పన సాధ్యమే. పైగా 33 జిల్లాలైనయి. వాటిలో ప్రతి జిల్లాకు అన్ని శాఖలు, విద్య, వైద్య అవకాశాలు సమగ్రంగా రూపుదిద్దుకోవాలి. యువత సంఘటిత శక్తిగా ఎదిగి కొలువులు సాధించుకోవాలి.

తిట్లు, విమర్శలు లేకుండా, రాత పూర్వక సమగ్ర నివేదికలు, సూచనలు, నివేదనలతో రాజకీయ పార్టీలు చొరబడకుండా నిరుద్యోగ యువత ఏకమై కదిలితే తప్పకుండా సఫలమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలలో జిల్లాకు 3 వేల ఉద్యోగాలు కల్పిస్తే? వీరికి ఏం పని చెప్పడం.? మనం ఆలోచించాలి. విద్యార్థులలో సగానికి పైగా ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్నారు. వారు ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వలె ఉపాధ్యాయులతో పని చేయిస్తేనే ప్రభుత్వ స్కూళ్లకు ఆకర్షించబడతారు. ప్రభుత్వ హాస్టళ్ల వల్లనే చాలా చోట్ల ప్రభుత్వ స్కూళ్లు నడుస్తున్నాయి. వాటితో పాటుగా రెసిడెన్షియల్ స్కూళ్లను పెంచితే ఇపుడున్న టీచర్లు కాకుండా మరో పది వేల దాకా కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. తద్వారా 3.5 లక్షల మందికి అదనంగా గురుకుల విద్య అందుతుంది. మిగతా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తే వచ్చే ఉద్యోగాల సంఖ్య సుమారు ఒక లక్ష యాభై వేలు లేదా రెండు లక్షలు అనుకుందాం. 24 లక్షల నిరుద్యోగులను ఏం చేయడం అనే ప్రశ్న వస్తుంది. ఇక ప్రైవేటు రంగం, స్వయం ఉపాధి కల్పన, పరిశ్రమల స్థాపన.

అందుకు తగ్గ స్కిల్స్ పెంచుకోవాలి. నిరంతర అధ్యయనం జ్ఞానసముపార్జన అవసరం. కొత్త విషయాలను నేర్చుకోవలసిన అవసరం ఉన్నది. నేటి యువతలో సబ్జెక్టు, రీసర్చ్, మార్కెట్ లాంటి విషయాల్లో పరిజ్ఞానం కొరవడుతుంది. ఇది కూడా యువత నిరుద్యోగానికి కారణం. కేవలం ఆఫీస్ ఉద్యోగాలు, వైట్ కాలర్ ఉద్యోగాలు మాత్రమే కాదు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా లక్షలాది మంది యువత కార్పెంటర్లుగా, ఎలెక్ట్రీషన్లుగా, ప్లంబర్లుగా, టైల్స్ వేసే పనులు, యంత్రాల ఆపరేటర్లుగా ఇంకా ఎన్నో ఎన్నో అవకాశాలను విద్యార్హతను బట్టి యువత పొందవచ్చు. హైదరాబాద్ బిట్స్ పిలాని పూర్వ విద్యార్థులు నడుపుతున్న నిర్మాణ్ లాంటి ఎన్‌జిఒ సంస్థ వారు ఎంపిక చేసుకున్న విద్యాసంస్థలలో వివిధ దశలలో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపట్ల శిక్షణ ఇచ్చి ఉపాధి పొందేలా చేస్తున్నారు. చిన్న వృత్తులకు పోచంపల్లి స్వామి రామానంద తీర్థ శిక్షణ సంస్థ వంటివి కృషిచేస్తున్నాయి. ఇన్సూరెన్స్ సెక్టార్‌లలో పెద్దగా విద్యార్హత లేకున్నా కనీస అర్హతలతో ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే షార్ట్ టర్మ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చు.

ఈ కోర్స్ మెటీరియల్‌ను ఐఆర్‌డిఎఐ వెబ్‌సైట్‌నుండి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనే మూడు భాషల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మూడు రకాల ఇన్సూరెన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. కేవలం వారం రోజుల్లో టాటా ఎఐఎ లాంటి సంస్థలు ఈ కోర్సులు ఉచితంగానే అందిస్తున్నాయి. యువత స్కిల్ డెవెలప్‌మెంట్ కోసం ఈ కింది వెబ్‌సైట్‌లో అప్లై చేసుకొని ఉచిత శిక్షణ పొంది ఉపాధిని పొందవచ్చు.

a. ddugky.gov.in / b. srtri.com / c. vivohealth care. com / d. Swarna Bharati Trust / e. ifbi.com / f. iirmworld.org.in /g. indeed.co.in etc. / h. skill proindia.com / i. skillupindia.org / j.riseindia.net.in ఇలా ఎన్నో సంస్థలు ఉచితంగా శిక్షణనిస్తున్నాయి. చాలా మందికి వీటి గురించి తెలియదు. వాటిని తెలుసుకుని నైపుణ్యాలను పెంపొందించుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. ఇతరులకు ఉద్యోగాలు కల్పించేలా ఎదగాలంటే ఇంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రారంభించాలనే ఒక బలమైన కోరిక ఉన్నట్లయితే చాలా సంస్థలు మొదటి దశల్లో అనుకున్నది డెవెలప్ చేసుకోవడానికి సహకరిస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో www.tez.co.in, start upindia.upgrad.com కేవలం నాలుగు వారాల్లోనే ఉచితంగా స్టార్టప్ ల గురించి నేర్చుకోండి అంటూ సహకరిస్తున్నాయి.

వీటి ద్వారా ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ ఇకో సిస్టం గురించి పూర్తి జ్ఞానాన్ని పొందవచ్చు. ఉస్మానియా యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థులు నడుపుతున్న TEMPO- Telugu Entrepren eurs Motivationand Promotional Organiza tion (tempo.org.in) ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు సహకరిస్తుంది. ఇవే కాకుండా ఆరోగ్యం, ఫిట్నెస్, యోగా, న్యూట్రిషన్‌లో షార్ట్ టర్మ్ కోర్సులు చేస్తే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నేడు ఫిట్ నెస్ రంగంలో సంవత్సరానికి 40% పెరుగుదల ఉన్నది. ఈ రంగంలో విస్తృతమైన అవకాశాలు నేటి యువతకు ఉన్నాయి. విఎల్‌సిసి, BFY- Better Fitness for You, IBAM- Indian Board of Alternative Medicine లాంటివి హెల్త్ కేర్ పై షార్ట్ టర్మ్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. చాలా తక్కువ రోజుల్లో ఈ శిక్షణను పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైన అవకాశాలు పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడానికి 1bridge.one Connectindia.com మొదలగు సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం ఎంటెర్‌ప్రెన్యూర్షిప్‌కి సమయం చాలా అనుకూలంగా ఉన్నది. ఐ.ఐ.టి. హైదరాబాద్, గచ్చిబౌలిలో దీనిపై తరచూ శిక్షణ నిస్తూ యువతను అటువైపు ప్రోత్స హిస్తున్నాయి.

అదే మాదిరిగానే జాగృతి యాత్ర డాట్ కామ్ లో (jagritiyatra.com.) లో లాగిన్ అయి అప్లై చేసి, జాయిన్ అయి ప్రయత్నం చేయవచ్చు. భారత మాజీ రాష్ట్రపతి డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం రాసిన ‘టార్గెట్ త్రీ బిలియన్‘ పుస్తకం అనుసారంగా ఎంపికైన అభ్యర్థులను ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 వ తేదీ నుండి 15 రోజుల పాటు రైలు ప్రయాణంలో దేశంలోని అన్ని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలను, పారిశ్రామిక వేత్తలను, బిసినెస్ ప్రముఖులను పరిచయం చేస్తున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాత్రా అనే వినూత్న కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసాల్లో ఎంపికైన 20 మంది ఇంట్రెప్రేనర్లకు పూర్తి శిక్షణనిచ్చి కంపెనీలు పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నది. జాతీయ స్థాయిలో కూడా ఇదే యాత్రా కార్యక్రమం పేరుతో 100 మంది ఎంటర్ ప్రెన్యూర్‌ర్లను దేశ వ్యాప్తంగా ఎంపిక చేసుకుని వారికి పూర్తి శిక్షణ ఇస్తూ వారే సొంత కంపెనీలు పెట్టి ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తున్నారు.

ఇలా ఎన్నో అవకాశాలు యువతకు అందుబాటులో ఉన్నాయి. వాటి గురుంచి తెలుసుకొని శిక్షణ పొందితే ఉద్యోగాలు స్వీకరించే స్థాయి నుండి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదిగే అవకాశాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుత వాతావరణంలో ఐటి, రియల్ ఎస్టేట్ సంబంధిత పనులు,రవాణా శాఖ పనులు, ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న కరోనా వైరస్ దృష్ట్యా ఆరోగ్య పరిరక్షణ సంబంధిత, హెల్త్ కేర్ రంగంలో ఉన్న పనులు నేర్చుకుంటే చాలా ఉపాధి అవకాశాలు వస్తాయి. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎస్‌డిసి) ఏయే రంగాల్లో అవకాశాలు అధికంగా ఉన్నా యి, ఏ రకమైన నైపుణ్యాలు అవసరం ఉంది, ఏ రకమైన శిక్షణ ద్వారా ఉద్యోగ అర్హత పొందవచ్చు అనే విషయాలతో కూడిన ఒక సమగ్ర రిపోర్టును తయారు చేసింది. తెలంగాణలో పరిశ్రమ రంగంలో ఉద్యోగాల విషయానికొస్తే ఇప్పటికే ఉన్న వివిధ పరిశ్రమల్లో కొలువులు, వ్యవసాయ అనుబంధ, ఆహార మెగా పార్కులు, కొత్తగా పెట్టే చిన్న, సూక్ష్మ పరిశ్రమలు, కొత్తగా ఆలోచన చేస్తున్న ఇండస్టీయల్ సిటీ, ఫార్మాసిటీ, టెక్సటైల్ సిటీ ఐటి అనుబంధ పరిశ్రమలలో తెలంగాణ యువతకు కొలువులు వచ్చే అవకాశం ఉన్నది.

సేవా రంగంలోని ఉద్యోగాల్లో వ్యవసాయ రంగం, నిర్మాణ రంగం ,వైద్యం, ఆరోగ్యం, విద్యా రంగం, వృత్తి విద్య ,శిక్షణ ,బ్యాంకులు, బీమా, పర్యాటకం, హోటల్లు, రవాణా, నీళ్లు ,విద్యుత్తు, సేవలు, సమాచారం, సినిమా, టెలివిజన్, కళాకారులు, వ్యాపారం, చిల్లర వర్తకం, ఆటలు, ప్రభుత్వ ఉద్యోగాలు, గృహసంబంధ సేవలు మొదలగు ఉపాధి మార్గాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విధంగా టి. ఎస్. ఐ. పాస్ అనే అధునాతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి ఎన్నో పరిశ్రమలను ఆకర్షించింది. ఇలా అనేక రంగాలలోకి యువత విస్తరించాలి. సంపద సృష్టించాలి. సేవలు అందించాలి. ఉపాధి పొందాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News