Saturday, April 27, 2024

ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి సిద్ధాంతాలతో చేటు

- Advertisement -
- Advertisement -

హింసాకాండ, విద్వేషం వ్యాప్తికి అవి దోహదం
బీహార్ యాత్రలో రాహుల్ గాంధీ ఆరోపణ

కిషన్‌గంజ్ (బీహార్) : ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి సిద్ధాంతాలు దేశంలో హింసాకాండ, విద్వేషం వ్యాప్తికి దోహదం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం ఆరోపించారు. తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా కిషన్‌గంజ్‌లో ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, వివిధ మతాలు, కులాలకు చెందినవారు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ హయాంలో తమలో తాము పోరాడుతున్నారని విమర్శించారు.

తమ మాజీ మిత్రుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో తిరిగి చేరడంతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అయిన మరునాడు గాంధీ యాత్ర బీహార్‌లో సాగింది. 2020 అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం తరువాత రాహుల్ బీహార్‌కు రావడం ఇదే మొదటిసారి. ‘ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి సిద్ధాంతాలు దేశంలో హింసాకాండ, విద్వేషం వ్యాప్తికి కారణం అవుతున్నాయి. మతం, కులం, భాష పేరిటి తమలో తాము కలహించుకునేలా ప్రజలను అవి (ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి) రెచ్చగొట్టుతున్నాయి.

సోదరులు తమలో తాము పోరాడుకుంటున్నారు. దేశంలో ఈ వాతావరణాన్ని అవి (ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి) సృష్టించాయి. ప్రజలను సమైక్యపరిచేందుకు, ‘నఫ్రత్ కా బజార్’లో ‘మొహబ్బత్ కీ దుకాన్’ ఏర్పాటుకు మేము కృషి చేస్తున్నాం’ అని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ పార్టీకి గట్టి పట్టు ఉన్న కిషన్‌గంజ్ ద్వారా సోమవారం బీహార్‌లోకి ప్రవేశించింది. బీహార్ పిసిసి అధ్యక్షుడు అఖిలేశ్ ప్రసాద్ సింగ్, ఇతర సీనియర్ నేతలు కిషన్‌గంజ్‌లో రాహుల్‌కు స్వాగతం పలికారు. ముస్లింలకు ఆధిక్యం ఉన్న సీమాంచల్ ప్రాంతంలోఒక జిల్లా కిషన్‌గంజ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News