Wednesday, May 8, 2024

పకడ్బందీగా ‘కుడా’ మాస్టర్ ప్లాన్

- Advertisement -
- Advertisement -

Kakatiya Urban Development Authority Master Plan

 

15 నగరాల్లో చేసిన అధ్యయనంతో రూపకల్పన
ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్లతో అనుసంధానం
మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణ
మంత్రి దయాకర్‌రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష
నేడు మున్సిపల్ మంత్రి కెటిఆర్‌తో సమావేశం

మనతెలంగాణ / హైదరాబాద్ : పెరుగుతున్న జనాభా, ఏర్పడుతున్న అవసరాలకు అనుగుణంగా, స్ఫూర్తిదాయకంగానూ కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని వరంగల్ జిల్లాకు చెందిన రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. మంగళవారం ఆయన అధ్యక్షతన జరిగిన కుడా సమీక్ష సమావేశంలో పలు విషయాలపై సమగ్రంగా చర్చించడం జరిగింది. కుడా మాస్టర్ ప్లాన్‌ను అత్యంత పకడ్బందీగా సిద్ధం చేయాలని, మరిన్ని మెరుగులు దిద్దడం, భవిష్యత్‌లో మెరుగైన రవాణా అవసరాలకు సరిపడా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు.

చారిత్రాత్మక కాకతీయ వాసరత్వ నగరం వరంగల్‌ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. త్వరితగతిన ముఖ్యమంత్రి కెసిఆర్ హామీలను, అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. మామునూరు ఎయిర్ పోర్టును పునరుద్ధరించాలని సమావేశంలో చర్చించారు. “కుడా” మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లు అభినందించేలా రూపకల్పన చేయాలని అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దిశానిర్దేశం చేశారు.

మరిన్ని మెరుగులు అవసరం
ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెనె్నై, భువనేశ్వర్, అహ్మదాబాద్, బెంగళూరు, జైపూర్, భోపాల్, తిరువనంతపురం, గౌహతీ వంటి 15 నగరాలను పరిశీలించి రూపొందించిన కుడా మాస్టర్ ప్లాన్‌కు మరిన్ని మెరుగులు దిద్దాలని మత్రి ఈ సందర్భంగా దయాకర్‌రావు సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డులను అనుసంధానం, జాతీయ రహదారులను కలుపుతూ రోడ్లను ఏర్పాటు చేయాలని మంత్రి చెప్పారు. కుడా పరిధిలోని ప్రస్తుతం ఉన్న చెరువులు, కుంటలు, ఆక్రమణకు గురయ్యాయని, వాటి మనుగడ, పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అలాగే ఏయే కారిడార్లలో ఏయే పరిశ్రమలు ఉన్నాయి? ఇంకా ఏయే పరిశ్రమలు పెట్టడానికి వీలుంటుందనే విషయాలు స్పష్టం చేయాలన్నారు.

వర్షపునీటి నిర్వహణ, మురుగుునీటి కాలువల పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నించారు. వీలైనన్ని ఎక్కువ హరిత హారం, గ్రీన్ జోన్స్ ఏర్పాటు చేయాలని, అర్బన్ లంగ్ స్పేస్ లను పెంచాలని సూచించారు. పురావస్తు భవనాలు, దేవాలయాలను పరిరక్షిస్తూనే, వాటిని పర్యావరణ సహితంగా, పర్యాటకానికి వీలుగా తీర్చిదిద్దాలని సూచించారు. వారసత్వ కట్టడాల పరిరక్షణకు నడుం బిగించాలన్నారు. గుతంలో మంత్రి కెటిఆర్ సూచించిన విధంగా చేసిన మార్పులపై కూడా అధికారులను ప్రశ్నించారు.

మామునూరు విమానాశ్రయం
నాటి నిజాం నవాబు 1930లోనే ఏర్పాటు చేసిన మామునూరు ఎయిర్ పోర్టు ఉమ్మడి రాష్ర్ట పాలనలో పూర్తిగా పనిచేయకుండా పోయిందన్నారు. మామునూరు ఎయిపోర్టును పునరుద్ధరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో మంత్రులు, ఎంఎల్‌ఎలు, అధికారులు చర్చించారు. సీఎం కెసిఆర్ 2016లో వరంగల్ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల పనులపైనా సమావేశం చర్చించింది. రూ. 817.20 కోట్ల విలువైన 1,342 పనులు మంజూరయ్యాయని అధికారులు సమవేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆయా పనులు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు తెలపడంతో ఆయా పనులు, వాటి పురోగతిపై నియోజకవర్గాల వారీగా వారు చర్చించారు. ఆయా పనులను అత్యంత వేగంగా, నాణ్యతగా పూర్తిచేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.

నేడు మంత్రి కెటిఆర్‌తో చర్చ

ఇవే అంశాలపైనా నేడు(బుధవారం) మధ్యాహ్నం ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కెటిఆర్‌తో సమావేశమై సమీక్షించాలని నిర్ణయించారు. ఈ సమీక్ష సమావేశంలో స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశ్ రావు, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, శాసన మండలి సభ్యులు కడియం శ్రీహరి, ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ హన్మంత్ గాంధీ, వరంగల్ నగర కమిషనర్ పమేలా సత్పతి, కుడా, వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Kakatiya Urban Development Authority Master Plan
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News