మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ వద్ద రాష్ట్రంలోనే ఎత్తయిన భారీ ఐటీ సౌధాన్ని నిర్మించాలని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.998 కోట్లతో ఈ భారీ నిర్మాణం చేపట్టనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. 100 కంపెనీలకు వసతి కల్పించి లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ గేట్‌వే పేరిట మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ అవుటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద రాష్ట్రంలోనే ఎత్తయిన భారీ ఐటీ సౌధాన్ని రూ.998 కోట్లతో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ పార్కులో కార్యాలయ భవనాలు, వాణిజ్య కేంద్రం, హోటల్, నివాస భవనాలు, ఆతిథ్య కేంద్రాలు, వాణిజ్య సముదాయాలుంటాయి. 100 కంపెనీలకు అందులో వసతి కల్పించి, లక్ష మందికి ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
దీనికోసం ఐటీ సౌధం ఉమ్మడి అభివృద్ధి పేరిట రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ప్రైవేటు సంస్థల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఒకే సంస్థ లేదా వివిధ సంస్థలతో కూడిన కన్సార్షియాల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఈ భారీ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని 2022లో ఫిబ్రవరి 17న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇందులో నిర్మించే ఐటీ సౌధంలో ఐటీ, దాని అనుబంధ కార్యకలాపాలకు 11 లక్షల చదరపు అడుగులు, ఐటీయేతర కార్యకలాపాలకు 11 లక్షల చదరపు అడుగులు కేటాయించేలా ప్రతిపాదించారు. నిర్మాణానికి ముందుకొచ్చే సంస్థ టీఎస్‌ఐఐసీతో ఒప్పందం చేసుకుని ఐటీ సౌధాన్ని నిర్దేశించిన గడువులోపు నిర్మించి అప్పగించాలి. కేటాయించిన మొత్తం 10.12 ఎకరాల స్థలంలో 40 మీటర్ల ఎత్తులో 14 అంతస్తులు 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐటీ పార్కును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.