Sunday, April 28, 2024

‘మీ కొడుకు వయస్సు అంతటిదాన్ని తిడుతావా’: ఉద్దవ్ థాక్రేపై కంగన ఫైర్

- Advertisement -
- Advertisement -

ముంబై: బంధుప్రీతితో కూడిన చెత్త సరుకు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై నటి కంగన రనౌత్ విరుచుకుపడ్డారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు తీరు తెన్నులపై కంగన నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ఈ దశలో విజయదశమి సందర్భంగా ముఖ్యమంత్రి తమ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలపై నటి సోమవారం తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి తనను నమక్ హరాం, విశ్వాసఘాతకి అని పేర్కొనడాన్ని నటి తప్పుపట్టారు. తన స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ దేవ్ భూమి అని, గంజాయి క్షేత్రం కాదని తేల్చిచెప్పారు. ముంబైని తాను ఆక్రమిత కశ్మీర్ అని అభివర్ణించడాన్ని రనౌత్ సమర్థించుకున్నారు. ఆదివారం దసరా సమ్మేళనపు ప్రసంగంలో సిఎం మాట్లాడుతూ ముంబైని కొందరు పిఒకె అని పిలుస్తున్నారని, దిక్కులేకుండా ఇక్కడికి వచ్చిన వారే ఇటువంటి మాటలకు దిగుతున్నారని అన్నారు. ముంబైని పిఒకె అని పిలువడం ప్రధాని మోడీ వైఫల్యానికి ప్రతీక అని థాకరే చెప్పారు. పిఒకెను భారత్‌లోకి తిరిగి తీసుకువస్తామనే ప్రధాని మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

దసరా సమ్మేళనం తరువాతి రోజున సిఎం వ్యాఖ్యలపై నటి స్పందించారు. కంగన ఇటీవలి కాలంలో సినీ ఫైర్‌బ్రాండ్ అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై పలు అంశాలపై ఘాటుగా విమర్శిస్తున్నారు. ముంబైని పిఒకెతో ఆమె ఇటీవల పొల్చి మాట్లాడటం శివసేనకు నటికి మధ్య చిచ్చుకు పరాకాష్ట అయింది. రాజ్‌పుత్ మృతి కేసును ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్యా తప్పుదోవ పట్టిసున్నారనే వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వీటిపై ఇంతకాలం మౌనంగా ఉన్న సిఎం ఉద్ధవ్ దసరా సమ్మేళనం రోజున స్పందించారు. బీహార్ పుత్రుడి(సుశాంత్)కి న్యాయం జరగాలనే వారు మహారాష్ట్ర కుమారుడి ప్రతిష్ట దెబ్బతియ్యాలని చూస్తున్నారని విమర్శించారు. నమక్‌హరాంలు కొందరు ఈ విధంగా మాట్లాడుతున్నారని కంగనపై పరోక్షంగా విమర్శలకు దిగారు. దీనిపై స్పందించిన కంగన ఆయనను ఉద్ధేశించి ‘నీ కుమారుడి వయస్సున ఆడపిల్లపై కోపంతో నువ్వు మొత్తం రాష్ట్రం పరువు మంటగలిపేలా మాట్లాడుతున్నావు. ముంబైని నేను పిఒకె అనడం నీకు రుచించలేదు. ముంబైలో ఆజాది కశ్మీర్ నినాదాలు తలెత్తినందుకు నేను భయపడి ఆ విధంగా చెప్పడం జరిగింది. మీ సోనియా సేన అన్నింటిని సమర్థిస్తూ వచ్చింది. అందుకే నేను ముంబైని పిఒకె అన్నాను’ అని కంగన తెలిపారు.

ఇంతకు ముందు శివసేన నేత సంజయ్ రౌత్ కూడా తనను తిట్టాడని, హారాంఖోర్ అన్నాడని, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉద్ధవ్ తన కొడుకు వయస్సు వ్యక్తిపై ఇటువంటి వ్యాఖ్యలకు దిగడానికి సిగ్గుండాలని కంగన ఫైర్ అయ్యారు. తాను బంధుప్రీతి వ్యక్తిని కాదని, ఆత్మవిశ్వాసం, స్వయం శక్తిని నమ్ముకుని ఎదుగుతున్న దానిని అన్నారు. ముఖ్యమంత్రివి అయి ఉండి హక్కులను హరించే స్థాయికి దిగజారుతావా? అని ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని హిమాలయాల ఔన్నత్యాలు, అందాలు ప్రతి భారతీయుడికి చెందుతాయని, అదే విధంగా ముంబై కల్పించే అవకాశాలను అందుకునే హక్కు అందరికీ ఉందని స్పష్టం చేశారు. తన రాష్ట్రం దేవి భూమి అని, ముఖ్యమంత్రి చెపుతున్నట్లు గంజాయి వనం కాదని అన్నారు. ముఖ్యమంత్రి పదవులు, ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ఇవ్వాళ్ల ఉంటాయి రేపు పోతాయని అన్నారు. ప్రముఖమైన ప్రజా పదవిలో ఉండే వారు ప్రజల నుంచి గౌరవాన్ని పోగొట్టుకోరాదని, ఇక్కడి సిఎం పట్ల ప్రజలు సంతోషంగా లేరని అన్నారు.

Kangana Ranaut again slams Uddhav Thackeray

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News