Thursday, May 2, 2024

కాంగ్రెస్‌కు తిరుగుబాట్లు కొత్తేమీకాదు

- Advertisement -
- Advertisement -

Kapil Sibal lashes out at Rahul Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు సంక్షోభాలు అసాధారణమేమీ కాదు. అంతకు మించి కొత్తేం కాదు. గతంలోనూ పార్టీలో అనేక సార్లు అసమ్మతులు, నిట్టనిలువు లేదా పాక్షిక చీలికలు తలెత్తాయి. అయితే ఈసారి తలెత్తిన సంక్షోభం విభిన్నం అయింది. గతంలో కాంగ్రెస్ పలు రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో సొంతంగా నో, లేదా ఇతర మిత్రపక్షాలతోనే అధికారంలో ఉన్నప్పుడు సంక్షోభాలను ఎదుర్కొంది. అయితే ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా జరగడం పార్టీ మరింత బలహీనం అవుతుందనే సంకేతాలకు దారితీసింది. కాంగ్రెస్ ఆరు సంవత్సరాలకు పైబడి జాతీయ స్థాయిలో పవర్ లో లేదు. ఇది ఈ పురాతన పార్టీ రికార్డులలో రెండో అతి పెద్ద అధికార లేమి ఘట్టం. 1996 నుంచి 2004 వరకూ పార్టీ సుదీర్ఘకాలం ఈ పరిస్థితిని అనుభవించింది. 1998లో పార్టీ అత్యంత ప్రధానమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది. అయితే గాంధేతర కుటుంబ నేత అయిన సీతారాం కేసరి ప్రధాన బిందువుగా అప్పుడు సంక్షోభం రాజకుంది. కేసరి అప్పట్లో పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన నెహ్రూ గాంధీ కుటుంబానికి వెలుపలి వ్యక్తి కావడంతో ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు తలెత్తింది. దీనికి ఢిల్లీ కాంగ్రె స్ లాబీ ఒకటి తెరవెనుక పాత్ర పోషించింది. సోనియా గాంధీని పార్టీ అధ్యక్షురాలిగా చేసేందుకు ఈ వర్గం రంగంలోకి దిగింది. దీనికి ముందు 1990లో కూడా పార్టీలో తిరుగుబాటు పర్వం నెలకొంది. ఇది కూడా నాన్ గాంధీ నేతకు వ్యతిరేకంగా రగులుకున్నదే. అప్పటి ప్రధాని పివి నరసింహరావుకు వ్యతిరేకంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరాది కాంగ్రెస్ లాబీ నేత ఎన్‌డి తివారీ పివికి వ్యతిరేకంగా చక్రం తిప్పేందుకు నడుం బిగించారు.

ఈ దశలో ఎన్‌డి తివారీ, అర్జున్ సింగ్‌లు పార్టీ నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టారు. అయితే ఇప్పుడు పార్టీ నాయకత్వ పగ్గాలు సోనియా గాంధీ చేతుల్లో ఉన్న దశలో అంతర్గతంగా సంక్షోభం నెలకొంది. అయితే ఇదో విచిత్రమైన తిరుగుబాటుగా మారింది. ఎక్కడా పూర్తి స్థాయిలో సోనియాకు, రాహుల్‌కు వ్యతిరేకత కనపడకుండానే, వారి చేతుల్లో నుంచి పార్టీని వేరే వ్యక్తులకు అప్పగించాలని జరుగుతున్న యత్నంగా భావిస్తున్నారు. అయితే రాహుల్ కానీ, సోనియా కానీ, ప్రియాంక కానీ పార్టీని పూర్తి స్థాయిలో నడిపిస్తారనే ఆశతో ఇంతకాలం ఎదురుచూశామని, అయితే ఇందుకు విరుద్ధంగా జరుగుతోందని, వారు లాంఛనప్రాయంగా పార్టీ నేతలుగా చలామణి అయితే పార్టీ అనుకున్న విధంగా ముందుకు పోవడం కష్టం అని కొందరు నేతలు తెరవెనుక ప్రచారానికి దిగారు. అయితే, రాహుల్ ఆది నుంచి పార్టీలోని కొందరు సీనియర్ నేతల వైఖరి పట్ల అనుమానాస్పదంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలలో వారు చిత్తశుద్ధితో పార్టీ విజయానికి పాల్పడలేదని, జాతీయ స్థాయిలో మోడీ ఆధిపత్యపు బిజెపికి వ్యతిరేకంగా తాను పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేస్తే దీనిని పార్టీలోని సీనియర్లు సరిగ్గా వాడుకోలేదని పార్టీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత రాహుల్ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సంక్షోభం నెలకొంది. సీనియర్లు చాలా మంది సోనియాను కాకుండా రాహుల్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలకు దిగడం పార్టీలో సరికొత్త పరిణామాలకు దారితీసింది.

గాంధీల ఆధ్వర్యంలో పార్టీలో తిరుగుబాట్లు
1969లో కానీ తరువాత 1977లో కానీ ఈ అతి పురాతన పార్టీలో తిరుగుబాటుకు విచిత్రంగా, రాజకీయ పరిణామంగా నెహ్రూ గాంధీ కుటుంబ నుంచే తిరుగుబాటు వ్యక్తం అయింది. వారు తిరుగుబాటును ఎదుర్కోవడం కాకుండా వారే పార్టీలో నాయకత్వానికి వ్యతిరేకంగా తమ కాకస్‌ను రెచ్చగొట్టడం చివరికి పార్టీ చీలికకు రంగం సిద్ధం చేయడం జరిగింది. ఇటువంటి పరిణామాలకు ప్రధానంగా ఐరన్ లేడి ఇందిరా గాంధీ కేంద్ర బిందువు అయ్యారు. ఆమె అప్పట్లో పార్టీలో పూర్తి స్థాయి పట్టుకు యత్నిస్తోన్న పాతతరం నేతలు లేదా సిండికేట్‌కు వ్యతిరేకంగా తమ తిరుగుబాటును అత్యంత చాకచక్యంగా నడిపించారు. రాహుల్ కూడా నానమ్మ తరహాలోనే ఇప్పుడు పార్టీలో పాతతరపు కుహనా విధేయ నేతలపై పూర్తి స్థాయిలో రగిలిపోతున్నట్లు స్పష్టం అయింది. అప్పటి ఇందిరాగాంధీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి నిలిచిన వివి గిరికి తమ మద్దతు ప్రకటించారు. పార్టీ అధికారిక అభ్యర్థిగా అప్పట్లో సిండికేట్ల తరఫున నీలం సంజీవరెడ్డిని నిలిపారు. అయితే ఈ సిండికేట్లు తమ కుటుంబ ప్రాబల్యానికి ఎసరు పెడుతున్నారని గ్రహించి ఇందిరా గాంధీ తన రాజకీయ చాతుర్యంతో వివి గిరికి బాసటగా నిలిచారు. ఈ దశలో పార్టీ చీలిపోయింది. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ నిజలింగప్ప ఇందిరను పార్టీ నుంచి బహిష్కరించారు. 1977లో ఎమర్జెన్సీ అనంతర ఎన్నికలలో పార్టీ పరాజయంతో తిరిగి సంక్షోభం నెలకొం ది. పార్టీ అధ్యక్షులు కాసు బ్రహ్మనంద రెడ్డి, మరో సీనియర్ నేత వై బి చవాన్ ఇందిరకు వ్యతిరేకంగా అసమ్మతిని ప్రకటించారు.

దీనితో తిరిగి పార్టీ చీలింది. ఈ చీలిక తరువాత పార్టీ బలోపేతానికి ఆయువుపట్టుగా ఇందిరా గాంధీ నిలిచారు. ఈ దశలోనే ఎన్నికలకు ముందు సీనియర్ నేతలు జగ్జీవన్ రామ్, హెచ్‌ఎన్ బహుగుణలు వేరు కుంపటిని కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పేరిట పెట్టుకున్నారు. ఇక 1987లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షోభాన్ని చవిచూసింది. అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా అంతకు ముందు ఆర్థిక మంత్రిగా ఉన్న విపి సింగ్ ప్రభుత్వంలో అవినీతిని గురించి బహిరంగంగా ప్రశ్నించడం చర్చనీయాంశం అయింది. దీనితో ఆయనను కేబినెట్ నుంచి తీసేశారు. విపి సింగ్ తరువాత జనమార్చ్ పార్టీని పలువురు అసమ్మతి నేతలతో కలిసి పెట్టారు. ఇది తరువాతి క్రమంలో దేశంలో కాంగ్రె స్ పార్టీ ఆధిపత్యాన్ని దెబ్బతీసే బలీయ కూటములు ఏర్పాటు కావడానికి, చివరికి కాంగ్రెస్‌కు లోక్‌సభలో తక్కువ సీట్లు రావడం, పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తుడిచిపెట్టుకుపోవడానికి దారితీసింది.

సోనియాకు సవాళ్లు ఆది నుంచే
సోనియా గాంధీ పార్టీలో ఇంతకు ముందు కూడా సవాళ్లు ఎదురయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు తీసుకున్నప్పుడు 1998లో ఈ పరిస్థితి ఎదురైంది. తరువాత 1999లో లోక్‌సభ ఎన్నికల సమయంలో శరద్ పవార్, పిఎ సంగ్మా, తారీఖ్ అన్వర్‌లు ఆమెకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండాలేవనెత్తారు. పవార్ ఏకంగా ఆమె జాతీయతను ప్రశ్నించారు. పార్టీకి విదేశీ నాయకురాలు అవసరమా అని ప్రశ్నించారు. తరువాత వారిని పార్టీ నుంచి బహిష్కరించిన క్రమంలోనే పవార్‌నాయకత్వంలో ఎన్‌సిపి ఏర్పాటు అయింది.

Kapil Sibal lashes out at Rahul Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News