Wednesday, May 8, 2024

వచ్చే ఏడాదైన జరుగుతాయా?

- Advertisement -
- Advertisement -

వచ్చే ఏడాదైన జరుగుతాయా?
విశ్వ క్రీడలపై తొలగని అనిశ్చితి

Suspense Continue on Tokyo Olympics 2020

టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌పై ఇంకా అనిశ్చితి వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాదే జరగాల్సిన ఒలింపిక్స్‌ను కరోనా మహమ్మరి నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్ జరుగుతాయా లేదా అనేది ఇంకా అనిశ్చితిగానే ఉంది. టోక్యో ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించి నెలకొన్న ఉత్కంఠతకు ఇప్పట్లో తెరపడేటట్లు కనిపించడం లేదు. అయితే వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్ జరుగుతాయా లేదా అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. క్రీడలకు సంబంధించి నిర్వాహణ కమిటీ రోజుకో ప్రకటన చేస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రీడల నిర్వాహణ కమిటీ చైర్మన్ యషిరో మోరీ రోజుకో ప్రకటనతో అయోమయం సృష్టిస్తున్నారు. ఇటీవలే ఒలింపిక్స్‌ను నిర్వహించి తీరుతామని ప్రకటించిన మోరీ మళ్లీ మాట మార్చారు. కరోనా ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదని, ఇదే జరిగితే ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. మోరీ చేస్తున్న ప్రకటనలపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. నిర్వాహణ కమిటీ చేస్తున్న ప్రకటనలు క్రీడాకారుల్లో లేని పోని భయాలను సృష్టిస్తున్నాయని పలు దేశాలకు చెందిన ఒలింపిక్స్ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జపాన్ ప్రభుత్వం కానీ, ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీకానీ క్రీడలకు సంబంధించి ఏదో ఒకటి స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనని ఆయా దేశాల క్రీడా సంఘాలు కోరుతున్నాయి.

ఇప్పటికే ఏడాదిపాటు క్రీడలను వాయిదా వేసిన జపాన్ కొత్త కొత్త ప్రకటనలతో క్రీడాకారుల్లో అయోమయం సృష్టిస్తోందని ఆయా దేశాలకు చెందిన క్రీడా సంఘాలు వాపోతున్నాయి. క్రీడలు నిర్వహిస్తారా లేకుంటే రద్దు చేస్తారా అనే దానిపై స్పష్టమైన అవగాహనతో ఉండాలని అంతేగాని రోజుకో ప్రకటనతో అయోమయం సృష్టించడం మానుకోవాలని ఆయా దేశాలు కోరుతున్నాయి. ఈ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కరోనా వ్యాధి నివారణకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తేనే జపాన్ రాజధాని టోక్యోలో వచ్చే ఏడాది ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ సాధ్యమవుతోందని లేకుంటే క్రీడలను రద్దు చేయడం తప్ప మరో మార్గం ఉండదని జపాన్‌కు చెందిన వైద్య నిపుణులు స్పష్టం చేశారు. వేలాది మంది క్రీడాకారులు పాల్గొనే ఒలింపిక్స్ వంటి మెగా టోర్నీని కరోనా భయం మధ్యలో నిర్వహించడం సాధ్యం కాదని వారు తేల్చి చెప్పారు. క్రీడల నిర్వాహణకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉందని అప్పట్లోగా కరోనా నివారణకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఒక వేళ వ్యాక్సిన్ అందుబాటులో రాకుంటే మాత్రం ఒలింపిక్స్‌ను రద్దు చేయడమే ఉత్తమమని వారు సూచించారు. వేలాది మంది ప్రాణాలతో ముడిపడి ఉన్న సమస్య కావడంతో దీనిపై రిస్క్ తీసుకోవడం చాలా కష్టమని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

భారీ నష్టం తప్పక పోవచ్చు
ఒకవేళ వచ్చే ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు పూర్తిగా రద్దయితే వేలాది కోట్ల రూపాయల నష్టం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రీడల నిర్వాహణ కోసం జపాన్ ప్రభుత్వం ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఒలింపిక్స్ కోసం అధునాతన సౌకర్యాలతో కూడిన పెద్ద పెద్ద స్టేడియాలను నిర్మించింది. దీని కోసం వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఇదిలావుండగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించడంతో ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి మార్చారు. అయినా కరోనా తీవ్రత ఇప్పటికీ భయపెట్టిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఈ మహమ్మరి నివారణకు మందులు అందుబాటులో రాక పోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రోజుకు వేలాది మంది మృత్యువాత పడుతూనే ఉన్నారు. జపాన్‌లో కూడా కరోనా ప్రమాదకరంగానే కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో క్రీడల నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఒక వేళ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారితే క్రీడలను రద్దు చేసేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఇదే జరిగితే జపాన్‌కు భారీ మొత్తంలో ఆర్థిక నష్టం కలుగడం ఖాయం.

Suspense Continue on Tokyo Olympics 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News