Friday, May 3, 2024

ప్రజాహిత పాలకుడు

- Advertisement -
- Advertisement -

KCR reassures people of the state

 

ఎన్నికలు లేని సమయంలో ప్రజలకు బహు దూరంగా ఉండి అవి చేరువవుతున్నప్పుడు వారి మేలు కోసం పాటుపడుతున్నట్టు కనిపిస్తూ పబ్బం గడుపుకునే పాలక పక్షాలకు కొదువ లేదు. వారు సమయానుకూల పాలకులు. అందుకు భిన్నంగా ఎవరు, ఎప్పుడు జన హాని తలపెట్టినా వారెంతటి వారైనా గల్లాపట్టుకుని నిలదీసి ప్రజల తరపున నిరంతరం నిలబడే పాలకులు అరుదు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) ఎప్పటికప్పుడు అంశాల వారీగా తీసుకుంటున్న వైఖరులు, అవలంబిస్తున్న విధానాలు గమనిస్తే ఈ అరుదైన లక్షణం అందులో పుష్కలంగా కనిపిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గల జల వివాదాల్లో కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న ప్రేక్షక ధోరణిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎండగట్టిన తీరులో ఇది రుజువవుతున్నది. తన ప్రజల కోసం ఎవరితోనైనా కొట్లాడుతానని ముఖ్యమంత్రి తరచూ చెప్పే మాట ఇందులో ప్రతిబింబిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణకు, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి చూపుతున్న ఏకపక్ష అత్యుత్సాహాన్ని అరికట్టలేకపోతున్న కేంద్రం నిస్సహాయతను ఎత్తి చూపుతూ ఆయన శుక్రవారం నాడు దానికి రాసిన సుదీర్ఘ లేఖ టిఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజాహిత పంథాను అద్దం పట్టి చూపుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ కోసం శ్రీశైలం నుంచి మొత్తం కృష్ణా నదినే తరలించుకుపోయే స్థాయిలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి తెర తీసింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని ఉపయోగించుకొని ఆంధ్ర పాలకులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 15 టిఎంసిల సామర్థం నుంచి దాదాపు 50 టిఎంసిల వరకు వెడల్పు చేసుకున్నారు. ఇప్పుడు మరింతగా కృష్ణ నీటిని రాయలసీమకు తరలించుకుపోడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చట్టాలకు, నిబంధలకు అతీతంగా ఏకపక్షంగా చేపట్టారు.

ఈ ప్రాజెక్టు అటు నాగార్జున సాగర్‌కు వెళ్లవలసిన నీళ్లను కూడా అడ్డుకొని, ఇటు కల్వకుర్తి ఎత్తిపోతల వంటి తెలంగాణ ప్రాజెక్టులకు జల దుర్భిక్షాన్ని కలిగిస్తుంది. నదీలోయ బయటికి జలాలను తరలించుకుపోయే పోతిరెడ్డిపాడు మొత్తంగా చట్ట విరుద్ధమైనది. కృష్ణ జలాల్లో మిగిలే వాటిపై తెలంగాణకే హక్కు ఉంటుందని దానికి ఇప్పటికే అన్యాయం జరిగిందని బచావత్ ట్రిబ్యునల్ స్వయంగా పేర్కొన్నది. రాజ్యాంగం 262 అధికరణ మేరకు అవతరించిన 1956 నాటి అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం అంతర్రాష్ట్ర నదులు నదీలోయల క్రమబద్ధీకరణ, అభివృద్ధి కోసం అత్యవసర ప్రజాప్రయోజనాల దృష్టా కేంద్రం చట్టాలు చేయవచ్చునని జోక్యం చేసుకోవాలని స్పష్టంగా చెప్పింది. ఆ చట్టంలోని సి సెక్షన్ అవతలి రాష్ట్రం తన ప్రయోజనాలను దెబ్బ తీస్తూ ఉంటే ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి ఆ వివాద పరిష్కారానికి తోడ్పడాలంటూ కేంద్రాన్ని కోరే హక్కును బాధిత రాష్ట్రానికి ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టపగలు ఇంత జబర్దస్తీగా కృష్ణా జలాల దోపిడీకి పాల్పడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను హరిస్తూ ఉంటే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులను కృష్ణా ట్రిబ్యునల్‌కు నివేదించకుండా క్రియాశూన్యతను రక్తికట్టించడం ఎంత జన విద్రోహమో వివరించి చెప్పనక్కర లేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రం దృష్టికి తెస్తూ తాజా లేఖలో దానిని నిలదీయడం ప్రశంసార్హం. నిరంతరం ప్రజల పక్షాన నిలబడే పాలకుడంటే ఇలా ఉండాలని ఎవరికైనా అనిపించక మానదు. ఇంతకు ముందు విద్యుత్తు, వ్యవసాయ బిల్లుల విషయంలో కూడా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇదే విధమైన జన పక్షపాత పాత్ర పోషించింది. రైతుల ప్రయోజనాలు కోరి వారికి ఇస్తున్న ఉచిత విద్యుత్తుకు విఘాతం కలగకుండా చూడాలని కేంద్ర విద్యుత్తు బిల్లును పదేపదే ఎండగడుతూ టిఆర్‌ఎస్ దానికి తీవ్ర అభ్యంతరం తెలిపింది.

అలాగే ఇటీవల చట్ట రూపం ధరించిన వ్యవసాయ బిల్లుల విషయంలోనూ స్వతంత్ర వైఖరిని తీసుకొని ప్రజలకు మేలు చేయడమే తన విధానమని చాటింది. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంతో అంశాల వారీగా వ్యవహరించే పద్ధతినే పాటిస్తున్నది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ గత హయాంలోనూ స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా అదే వైఖరిని ఎటువంటి నీళ్లు నములుడు లేకుండా అవలంబిస్తున్నారు. ఇందుకు ఆయనను ఎంతైనా మెచ్చకోవాలి. కష్ట కాలంలో తమకు అండగా నిలబడే నాయకుడున్నాడనే భరోసాను రాష్ట్ర ప్రజలకు కలిగిస్తున్న కెసిఆర్ వారి హృదయాల్లో నిలిచిపోతారనడం అతిశయోక్తి కాబోదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News