Sunday, April 28, 2024

రాజ్యాంగంపై వాడి చర్చలు..

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న ఆరు వారాల తర్వాత దేశంలో రాజ్యాంగం గురించి వాడి, వేడిగా రాజకీయ వర్గాలలో చర్చ మొదలైనది. మొదటగా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉన్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొనడం రాజకీయ ప్రత్యర్థుల నుండి తీవ్రమైన స్పందనను ఆకర్షించింది. కాకతాళీయంగా ఆమరుసటి రోజుననే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రస్తావించారు.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎటువంటి అభిప్రాయాలనైనా శాంతియుతంగా వ్యక్తం చేయవచ్చు. వాటి గురించి సమాలోచనలు జరుపవచ్చు. రాజ్యాంగం కూడా అందుకు మినహాయింపు కాదు. స్వయంగా రాజ్యాంగం రచించిన డా. బిఆర్ అంబేడ్కర్ ఈ రాజ్యాంగం ఆశించిన విధంగా సామాజిక న్యాయం కలిగించడానికి దోహదపడని పక్షంలో దానిని విసిరి వేయమని సూచించారు. ఏ దేశంలో అయినా రాజ్యాంగం ఆ దేశపు సామాజిక, నాగరిక, రాజకీయ, ఆధ్యాత్మిక విలువలకు ప్రతిరూపంగా ఉంటుంది. ఆ విలువలను పెంపొందించే బాధ్యత పరిపాలకులపై ఉంటుంది. అంతేగాని రాజ్యాంగం ద్వారా అటువంటి విలువలు ఏర్పడవు. ఉదాహరణకు బ్రిటన్‌కు లిఖితపూర్వక రాజ్యాంగమే లేదు. అంతమాత్రం చేత రాజ్యాంగ విలువలు లేని దేశం కాదు అది.
కరోనా మహమ్మారి సమయంలో ప్రధాని బోరిస్ జూన్సన్ తన ఇంట్లో విందు చేసుకున్నారని వచ్చిన ఆరోపణలపై స్వయంగా అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టడం గమనార్హం. మన దేశంలో ఒక ప్రధాని, ముఖ్యమంత్రిలపై సాధారణ పోలీసులు దర్యాప్తు చేయగలరా? అమెరికా రాజ్యాంగం కూడా చాలా చిన్నదే. అయితే దానికి చాలా అరుదుగా సవరణలు చేస్తుంటారు. ప్రపంచంలో మరెవ్వరికీలేని అతి పెద్ద రాజ్యాంగం ఏర్పర్చుకున్నా బహుశా మనం చేసినన్ని సవరణలు మరెవ్వరు చేసి ఉండరు. అంతమాత్రం చేత రాజ్యాంగంలో మార్పులు సూచించడం, మార్చాలని అనడం ‘దేశ ద్రోహం’ కానేరదు. ఇదివరలో అనేక మంది ఆర్‌ఎస్‌ఎస్ నేతలు మన రాజ్యాంగం విదేశాలకు కాపీగా ఉందిగాని, భారతీయ విలువలను ఇనుమడింపలేదని అంటూ పలు సందర్భాలలో విమర్శలు చేశారు కూడా.
“రాజ్యాంగం మంచి చెడుల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అమలు చేయడానికి మనం ఎంచుకునే వాళ్లను బట్టి మంచి రాజ్యాంగం చెడుగా మారిపోవచ్చు. అమలు చేసే వాళ్లను బట్టే చెడు రాజ్యాంగం కూడా మంచిగా మారిపోవచ్చు’ అని రాజ్యాంగ సభలో తన ముగింపు ప్రసంగంలో డా. అంబేడ్కర్ పేర్కొనడం ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.
ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో రాజకీయ ఆవేశాలను పక్కన ఉంచితే, కేంద్ర, రాష్ట్ర సంబంధాల గురించి మరోసారి ప్రముఖంగా ప్రస్తావన రావడం గమనార్హం. కేంద్రంలో, రాష్ట్రాలలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగినంత కాలం ఈ అంశం పెద్దగా ప్రస్తావనకు రాలేదు. కానీ విభిన్న రాజకీయ పార్టీలు కేంద్రం, రాష్ట్రాలలో అధికారంలో ఉంటున్న సమయంలో, ముఖ్యం గా 1971 తర్వాత కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, అధికార పరిధిపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ సమస్యను జాతీయ స్థాయిలో ప్రముఖంగా లేవనెత్తి ‘కేంద్రం ఒక మిథ్య’ అనే తీవ్రమైన పదజాలాన్ని టిడిపి వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు ఉపయోగించారు. గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లవలే వ్యవహరిస్తున్నారని అంటూ ఆ వ్యవస్థ ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో బిజెపితో సహా దాదాపు అన్ని ఇతర పార్టీలు ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తాయి.
ఈ సందర్భంగా జనతా ప్రభుత్వం నియమించిన సర్కారియా కమిషన్ కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై లోతయిన అధ్యయనం చేసి చరిత్రాత్మక నివేదికను అందించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆ నివేదికను అమలు పరచాలని కోరినవారే. కానీ అధికారంలోకి వచ్చాక ఎవ్వరు పట్టించుకోవడం లేదు. రాజకీయ వత్తిడుల కారణంగా, సుప్రీం కోర్టు తీర్పుల కారణంగా కొన్ని అంశాలను అమలు పరచక తప్పడం లేదు. రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో ప్రధాన అంశం కూడా ‘భారత దేశం రాష్ట్రాల యూనియన్’ అన్న అంశం. ‘రాజ్యాంగంలో భారత దేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా అభివర్ణించారు. ఒక దేశంగా కాదు. భారత దేశంలోని ఒక రాష్ట్ర ప్రజలను ఎవరూ పాలించలేరు.విభిన్న భాషలు, సంస్కృతులను అణచివేయలేరు. ఇది భాగస్వామ్యం, రాజ్యం కాదు’ అని ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ అంశాన్ని ప్రస్తావించకుండా, బిజెపి ప్రభుత్వమే పాకిస్థాన్, చైనాలను ఒకటిగా చేసిన్నట్లు ఆయన ‘అవివేకం’గా చేసిన వ్యాఖ్యలనే పట్టించుకొని, ఆయనపై రాజకీయ దాడులు జరుపుతున్నారు. ఈ విషయంలో డా.అంబేడ్కర్ సహితం స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. “కేంద్రం, రాష్ట్రాల మధ్య చట్ట వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల అధికారాల విభజనను రాజ్యాంగమే చెప్పడం సమాఖ్య వ్యవస్థ మౌలిక సూత్రం. ఇదే సూత్రం మన రాజ్యాంగంలో ఉంది. ఇందులో ఎలాంటి లోపం లేదు. అందువల్ల రాష్ట్రాలను కేంద్ర పెత్తనం కింద ఉంచారనడం సరికాదు. అధికారాల విభజన హద్దులను కేంద్రం తనకు తానుగా మార్చలేదు. న్యాయవ్యవస్థ కూడా వీటిని మార్చలేదు’ అని స్పష్టం చేశారు.
రాజ్యాంగంలోని మొట్టమొదటి ఆర్టికల్ భారతదేశాన్ని ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అని పిలుస్తుంది. ఇక్కడ ఆర్టికల్ 1 ఏమి చెబుతోంది?: భారతదేశం, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది. భారత దేశం పాక్షిక- సమాఖ్య ప్రభుత్వాన్ని కలిగి ఉంది. ఉమ్మడి జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలకు బాధ్యత వహించే దేశం మొత్తానికి ప్రభుత్వం. రాష్ట్రాల రోజువారీ పాలనను సవివరంగా చూసుకునే రాష్ట్రాల మధ్య పరిపాలించే అధికారం విభజించబడింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల కంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి.
రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ ఒక సందర్భంలో, రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే ఉంచినట్లు చాలాస్పష్టంగా చెప్పారు. తద్వారా రెండు ప్రభుత్వాలు-యూనియన్, రాష్ట్రాల మధ్య సంబంధం అసమానమైనది కాదు. ఈ సందర్భంగా మరో అంశాన్ని గుర్తెరగాలి. మన రాజ్యాంగాన్ని దేశ విభజన జరిగిన ఆందోళనకరమైన పరిస్థితులలో రచించారు. అంతకు ముందు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకులు దాదాపు అందరూ -మహాత్మాగాంధీ నుండి రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్‌ల వరకు గ్రామ స్వరాజ్, పంచాయత్ రాజ్ సంస్థలకు పాలనలో కీలక పాత్ర ఉండాలని చెబుతూ వచ్చారు.
అయితే దేశ విభజన సమయంలో పెద్ద ఎత్తున రక్షపాతం జరగడం, లక్షలాది మంది పౌరులు హత్యకు గురికావడం, మరోవంక కాశ్మీర్‌లో పాకిస్థాన్ దండెత్తి కొన్ని భూభాగాలను ఆక్రమించుకోవడం వంటి పరిస్థితులలో దేశ సమగ్రత, రక్షణ అంశాలు ప్రాధాన్యత సంతరించుకొని, బలమైన కేంద్రం ఉండే విధంగా రాజ్యాంగం రూపొందించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ వంటి వారు లేవనెత్తిన పలు అభ్యంతరాలను తర్వాత మార్చుకొందాం అంటూ జవహర్ లాల్ నెహ్రూ దాట వేశారు. అయితే గత 70 ఏళ్లుగా కేంద్రంలో ఎవ్వరు అధికారంలో ఉన్నప్పటికీ ‘సహకార సమాఖ్య’ స్వరూపానికి తూట్లు పొడుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇందిరా గాంధీ హయాం నుండి గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా మారు తూ, వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నా రు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ ఎక్కువగా అధికార కేంద్రీకరణకు ప్రయత్నం చేస్తూ, రాష్ట్రాల ఆర్ధిక వనరులను, అధికారాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ విషయమై గతంలో బిజెపి సహితం పలు సందర్భాలలో తన తీర్మానాలలో ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్రాల వనరులు, అధికారాల పరిధి గురించి ప్రస్తావించింది. ఉదాహరణకు జిఎస్‌టి ని స్వాతంత్య్రం అనంతరం తీసుకొచ్చిన అతిపెద్ద పన్నుల సంస్కరణగా పేర్కొంటున్నారు. కానీ అది రాష్ట్రాల ఆర్ధిక వనరులను, నిర్ణయాధికారాలను నిర్వీర్యం చేసేందుకే దారితీస్తుంది.
రాష్ట్రాలలో విస్తృతమైన వాణిజ్య పన్నుల విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు అవి పని లేకుండా ఉండిపోయాయి. కేంద్రానికి అటువంటి వ్యవస్థ లేదు. దానితో అన్ని పనులను ప్రైవేట్ వారితో జరిపిస్తున్నారు. దానితో లెక్కలేనన్ని అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతున్నది. ‘భిన్నత్వంలో ఏకత్వం’ భారత దేశపు బలంగా, విలక్షణమైన సంస్కృతిగా మనం గర్వంగా చెప్పుకొంటుంటాము. దీని కారణంగానే వేయి సంవత్సరాల పాటు విదేశీయుల పాలనలో మగ్గినా మనం మన మౌలిక విలువలను కోల్పోలేదు. కేంద్రం రాష్ట్రాలు సహకార స్ఫూర్తితో, కలిసి ప్రయాణం సాగించాలి. కానీ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ఏకపక్షంగా చట్టాలు చేస్తూ, కేంద్రం పెత్తనం చేయాలని కోరుకోవడం సహకార స్ఫూర్తికి ప్రమాదం కలిగించడమే.
అందుకనే ప్రగతిశీలకమైన వ్యవసాయ చట్టాలు ఆశించినరీతిలో లేకపోవడం, తిరస్కరణకు గురికావడం జరిగింది. నేడు ‘ఒకే దేశం ఒకే పన్ను’, ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’, ‘ఒకే దేశం ఒకే రేషన్’, ‘ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్’ వంటి విధానాలతో దేశ వైవిధ్యానికి సమాధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యమై పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి పరిస్థితులు దేశ సమగ్రతకు, భద్రతకు, అన్నింటికీ మించి రాజ్యాంగ విలువలకు తీవ్రమైన ప్రమాదం చేకూర్చగలవని గ్రహించాలి.

చలసాని నరేంద్ర, 9849569050

KCR Sensational comments on Indian Constitution

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News