Friday, April 26, 2024

పాము కాటుతో భార్యను చంపిన భర్తకు రెండు జీవిత ఖైదుల శిక్ష

- Advertisement -
- Advertisement -
Kerala Court Orders Life Sentence For Man
విధించిన కేరళ సెషన్స్ కోర్టు

కొల్లం: భార్యను పాము కాటుతో హత్యగావించిన భర్తకు కేరళలోని అదనపు సెషన్స్ కోర్టు రెండు జీవిత ఖైదుల శిక్షను విధించింది. ఈ కేసులో భర్త సూరజ్‌కుమార్‌ను ఈ నెల 11న దోషిగా తేల్చిన కోర్టు బుధవారం శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో దోషికి మరణశిక్ష విధించాలి. కానీ, అతడి వయసు(28 ఏళ్లు)ను దృష్టిలో పెట్టుకొని జీవితఖైదు విధిస్తున్నామని సెషన్స్ కోర్టు జడ్జి ఎం. మనోజ్ తన తీర్పులో పేర్కొన్నారు. సూరజ్‌కు రెండు జీవిత శిక్షలతోపాటు సాక్షాలు తారుమారు చేసినందుకు 7 ఏళ్లు, గతంలోనూ తన భార్యపై హత్యాయత్నం చేసినందుకు 10 ఏళ్లు శిక్ష విధిస్తున్నట్టు కోర్టు తెలిపింది. 17 ఏళ్ల ఈ శిక్షల అమలు తర్వాతే రెండు జీవిత ఖైదుల శిక్ష మొదలవుతుందని తెలిపింది. ఈ శిక్షలతోపాటు రూ.5.85 లక్షల జరిమానా కూడా విధించింది.

ఈ నేరానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొల్లం జిల్లా అంచల్ ప్రాంతానికి చెందిన ఉత్రాకు అదే ప్రాంతానికి చెందిన సూరజ్‌కుమార్‌తో 2018లో వివాహమైంది. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. మరో మహిళను పెళ్లి చేసుకోవాలని సూరజ్ నిర్ణయించుకోగా, ఉత్రా అడ్డుపడింది. దాంతో, ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తనపై అనుమానం రాకుండా పాము కాటుకు బలైందని నమ్మించాలని చూశాడు. స్థానికంగా పాములు పట్టే వ్యక్తి నుంచి నాగుపామును తీసుకొని ఉత్రా నిద్రిస్తున్న సమయంలో ఆమెపైకి వదిలాడు. పాము కాటుతో ఆమె నిద్రలోనే చనిపోయింది. ఈ ఘటన గతేడాది మే 7న జరిగింది. తమ కూతురు మరణంపై అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, పోలీసులు సూరజ్‌ను ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగుచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News