Sunday, April 28, 2024

శాంతి కాముకుడు సరిహద్దు గాంధీ

- Advertisement -
- Advertisement -

ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్… ఈ పేరును ఈ తరానికి చెందిన చాలా మంది విని ఉండకపోవచ్చు. కాని సరిహద్దు గాంధీ అంటే కొంత మందికి అయినా గుర్తుకు రావచ్చు. పాకిస్థాన్‌లోని పంఖ్తూన్ రాష్ట్రంలో ఒక పఠాన్‌గా జన్మించి, జాతిపిత గాంధీ అహింసా మార్గంలో అడుగులు వేసి బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు సరిహద్దు గాంధీ. ఆయుధం పట్టుకొని యుద్ధం చేసే పఠాన్ కన్నా అహింసా మార్గమే ఆయుధంగా ధరించిన పఠాన్ ప్రమాద కరమైన వ్యక్తి అని బ్రిటీష్ పాలకులతో అనిపించుకున్న గొప్ప ధీరుడు. ‘నేను ఎట్టి పరిస్థితుల్లో అహింసా మార్గాన్ని వీడను. పగ, ప్రతీకారం జోలికి వెళ్లను. నన్ను అణచివేసిన, హింసించిన వ్యక్తులను కూడా క్షమిస్తాను’ అన్న ప్రతిజ్ఞతతో ‘కుదాయ్ కిద్మత్ గర్’ పేరిట భారత స్వాతంత్య్ర పోరాటానికి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన శాంతికాముకుడు సరిహద్దు గాంధీ.

బాద్షా ఖాన్‌గా సరిహద్దు గాంధీగా పేరుగాంచారు. స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది. భారతరత్న పురస్కారమును పొందిన తొలి భారతీయేతరుడు. ‘ఎర్రచొక్కాల ఉద్యమం’ ప్రారంభించిన ప్రముఖుడు. ఇతని అనుచరులను ‘ఖుదాయీ ఖిద్మత్‌గార్’ (భగవత్సేవకులు) అని పిలిచేవారు. ఇతను పష్తో లేదా పక్తూనిస్తాన్‌కు చెందిన రాజకీయ, ధార్మిక నాయకుడు. అబ్దుల్ గఫర్ ఖాన్ భారతదేశంలో బ్రిటిష్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన పష్టున్ స్వాతంత్య్ర కార్యకర్త. ‘బచా ఖాన్’ గా ప్రసిద్ధి చెందిన అతను మహాత్మా గాంధీకి చాలా సన్నిహితుడు, మిత్రుడు, అయన భారతదేశంలో సరిహద్దు గాంధీగా, పాకిస్తాన్‌లో బచా ఖాన్ గా సుపరిచితులు.

జనవరి 30, 1948న మహాత్మా గాంధీ హత్యకు 40 సంవత్సరాల తరువాత అతను జనవరి 20, 1988న మరణించాడు. ఇస్లాం గొప్ప అహింసా సైనికుడు’. ‘వేలాది అహింసా పఠాన్‌ల విధేయతను పొందిన గొప్ప జాతీయవాద నాయకుడు. అబ్దుల్ గఫర్ ఖాన్ 1890 ఫిబ్రవరి6 న నాటి అవిభక్త భారత దేశంలోని, నేటి పాకిస్తాన్‌లో ఉన్న వాయువ్య సరిహద్దు నగరమైన ఉత్మాన్జైలో జన్మించారు. 1910 లో, 20 సంవత్సరాల వయస్సులో, బెచే ఉట్మాన్జైలోని ఒక మసీదులో ఒక పాఠశాలను స్థాపించారు. 1921 లో ‘అంజుమాన్-ఇ ఇస్లా-ఇ ఆఫ్ఘనియా’ (ఆఫ్ఘన్ రిఫార్మ్ సొసైటీ), 1927 లో యువ ఉద్యమమైన ‘పాక్స్టన్ జిర్గా’ స్థాపించారు. మే 1928 లో, బచా ఖాన్ తీర్థయాత్ర నుండి మక్కాకు తిరిగి వచ్చిన తరువాత , అతను పాష్టో భాషలో నెలవారీ రాజకీయ పత్రిక ‘పాక్స్టన్’ (పాష్తున్)ను స్థాపించారు. భారత స్వాతంత్య్రం కోసం ఖాన్, ఐక్య, లౌకిక, స్వతంత్ర దేశం లక్ష్యాన్ని సాధించగల ఏకైక స్థిరమైన మార్గం గాంధీ ‘సత్యాగ్రహం’ సూత్రాలను గట్టిగా అవలంబించడం ద్వారా మాత్రమే అని నిర్ధారణకు వచ్చారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం ఊపందుకుంది, అతను 1920 లలో ‘ఖుదై ఖిద్మత్గర్’ (దేవుని సేవకులు) ను స్థాపించారు.

1928లో ఖాన్ మొట్టమొదటి సారిగా మహాత్మా గాంధీని కలుసుకున్నారు. భారత కాంగ్రెస్ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారు. అతి త్వరలో ఆయన గాంధీకి అత్యంత సన్నిహితుడు అయ్యారు. వారు స్వతంత్ర, అవిభక్త, లౌకిక, హిందువులు, ముస్లింలు కలిసి శాంతితో జీవించే భారతదేశం గురించి కలలు కన్నారు.1931లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి వారించినా, ‘నేను ఒక సాధారణ సైనికుడిని, ఖుదై ఖిద్మత్గర్, నేను మాత్రమే సేవ చేయాలను కుంటున్నాను’ అని చెప్పి గౌరవాన్ని తిరస్కరించారు. అతను చాలా కాలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.

భారత భూభాగంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ పోరాడుతుండగా, అప్పటి వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ అని పిలువబడే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో భాగమైన ఆ దేశంలోని వాయువ్య ప్రాంతంలో లక్ష మందిని తుపాకులు వాడమని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అహింసాత్మకంగా పోరాడటానికి ప్రతిజ్ఞ చేయమని ఒప్పించారు. అతను ఈ సైన్యాన్ని అల్లాహ్ సేవకులు ఖుదై ఖిద్మత్గర్ అని పిలిచారు. లక్ష మంది ముస్లింలు అతని ‘ఖుదై ఖిద్మత్గర్‘ లేదా ‘అల్లాహ్ సర్వర్లు’ ఉద్యమంలో చేరారు. మహాత్మా గాంధీ తత్వాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని ఖాన్ వారికి ఒప్పించాడు.

బ్రిటీష్ పాలన ముగిసిన తరువాత భారతదేశాన్ని విభజించ కూడదని డిమాండ్ చేయడం ద్వారా ఖాన్ ముస్లింలలో చాలా మంది శత్రువుగా మారారు. తన ప్రజల హక్కుల కోసం నిరంతరం ఆయుధాలు ఎత్తకుండా నిరంతరం కష్టపడ్డారు. గాంధీ మాదిరిగానే, గఫర్ ఖాన్ తన ప్రజల అభ్యున్నతి స్వాతంత్య్ర సాధనే అవసరమైన నిజాయితీగా నమ్మారు. ఖాన్ ప్రావిన్స్‌లో పాఠశాలలను తెరిచారు. మహిళలను సమాజంలో ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చారు. తన అహింసా సైనికులను రోజుకు కనీసం రెండు గంటల సామాజిక పని చేయమని ప్రతిజ్ఞ చేయమని ప్రోత్సహించారు.

భారత విభజనకు తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన భారత రాజకీయ నాయకులతో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. భారతదేశ రాజకీయ నాయకులతో మరీ ముఖ్యంగా గాంధీ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీతో కలసి పోరాటం సలిపారు. సరిహద్దు ప్రాంతపు ముస్లిం లీడర్లు, ఇతను ముస్లింల ద్రోహి అని 1946 లో హత్యా ప్రయత్నం చేశారు. మొదటి నుంచి దేశ విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన ఖాన్ చివరకు నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకే వదిలేశారు. ఆ సమావేశం అత్యధిక మెజారిటీతో దేశ విభజన తీర్మానాన్ని ఆమోదించింది. ఆ సమావేశంలో గఫర్ ఖాన్‌తో పాటు మహాత్మాగాంధీ, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్‌లు పాల్గొనలేదు. ‘మీకు అండగా నిలబడ్డాం. మీతో పాటు పఠాన్లు దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. చివరకు మీరు మమ్మల్ని నక్కల పాలు చేశారు’ అని సిడబ్ల్యుసిను ఉద్దేశించి ఖాన్ వ్యాఖ్యానించాడట.
సరిహద్దు ప్రాంతవాసులకు ద్వేషి అయ్యారు. అటు దేశ విభజన ఆగలేదు. అబ్దుల్ గఫార్ ఖాన్ పరిస్థితి అగమ్యగోచరమయ్యింది. బాద్షాఖాన్, అనుయాయులు, భారత పాకిస్తాన్‌లు తీవ్రంగా ద్రోహం చేశాయని భావించారు. కాంగ్రెస్ పార్టీని, భారత రాజకీయ నాయకులను ఉద్దేశించి బాద్షాహ్ ఖాన్ అన్న ఆఖరి మాటలు, ‘మీరు మమ్మల్ని తోడేళ్ళ ముందు విసిరేసారు’ అల్లర్లు, హింసతో ఏమీ సాధించలేమని, శాంతి, సౌభ్రాతృత్వాలతో సంపాదించింది శాశ్వతంగా మిగిలిపోతుందని పిలుపునిచ్చారు. ఇటు బ్రిటీష్ ఇండియాలో, అటూ పాకిస్థాన్‌లో 27 ఏళ్లపాటు జైలు జీవితాన్ని అనుభవించిన సరిహద్దు గాంధీ అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ నగరానికి వెళ్లి ప్రవాస జీవితం గడిపారు.

1969లో మహాత్మాగాంధీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా గఫర్ ఖాన్ భారత్‌కు వచ్చారు. ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీకి వచ్చి అంతర్జాతీయ అవగాహన కింద ఇచ్చే ‘జవహర్ లాల్ నెహ్రూ అవార్డు’ అందుకున్నారు. పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ ‘మీరు బుద్ధుడిని మరచిపోయినట్లుగానే గాంధీని మరచిపోతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తుది శ్వాస విడిచేంత వరకు నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడి జీవించిన గఫర్ ఖాన్ పాకిస్తాన్‌లోని పెషావర్‌లో 1988, జనవరి 20వ తేదీన ఆయన మరణించారు.

ఆర్‌కె సంగనభట్ల
9440595494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News