జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నాపై కిషన్‌రెడ్డి ఎద్దేవా
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీలోని జంతర్‌మంతర్ లో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న సభ గాంధీ కుటుంబాన్ని పొగడటానికే సరిపోయిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు గాంధీ కు టుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతో రేవంత్‌రెడ్డి ఢిల్లీ సభ పెట్టుకున్నారనేది స్పష్టం గా అర్థమవుతోందన్నారు. 31 నిమిషాల రేవంత్ రెడ్డి ప్రసంగంలో 50 శాతానికంటే ఎక్కువ సమయం రాహుల్, సోనియా జపం చేయడానికే సరిపోయిందని తెలిపారు. బిసి రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారని, దాన్ని పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ దేనని, అందుకోసం న్యా యపరమైన, చట్టపరమైన అంశాలపై దృష్టి సారించి, చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప అది చేయలేక, బట్టకాల్చి బిజెపి మీద వేస్తానంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బిసిల సంక్షేమానికి ఐదేళ్లలో లక్షకోట్లు ఇస్తామని చెప్పారని, దీని ప్రకారం ఇప్పటికే కనీసం 40 వేల కోట్లు ఇవ్వాలని, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. వివిధ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేయాలి, కానీ ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముం దుకు పడలేదని ఆరోపించారు.
రజకులు, గౌడ్లు.. ఇలా ఏ ఒక్క బిసి వర్గాన్ని వదలకుండా అందరినీ నిట్టనిలువు నా మోసం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర అవుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి, కానీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత బయటపడుతుందని గ్రహించి రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు తప్ప మీకు బిసిలకు సాధికారత కల్పించే విషయంలో చిత్తశుద్ధి లేదనేది తెలంగాణ బిసి సమాజానికి అర్థమైందన్నారు. అక్కడ ధర్నా చేస్తే ఎవరూ పట్టించుకోరని ఢిల్లీకి వచ్చి పగటివేషాలు వేస్తున్నారని విమర్శించారు. ముందుగా అశాస్త్రీయమైన సర్వే చేసి, బిసిల సంఖ్యను తగ్గించారన్నారు. ఆ తర్వాత దీనికి 10 శాతం ముస్లింలను చేర్చి బిసిలను మోసం చేస్తున్నారని విమర్శించారు. నాడు బిఆర్‌ఎస్ చేసిన తప్పులనే నేడు కాంగ్రెస్ కొనసాగిస్తోందని ఎద్దేవా చేశారు. వరుసగా మూడు ఎన్నికల్లో దారుణ ఓటమి, కనీసం వంద సీట్లు కూడా దాటని పరిస్థితి, రోజురోజుకూ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, మధ్య అధికారం గురించి కాంగ్రెస్ పగటి కలలు కంటోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.