Sunday, May 5, 2024

మా వాళ్లకు క్షమాభిక్ష పెట్టండి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పని కోసం దుబాయ్ సౌదీ దేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకున్న కార్మికులను చాల మందిని తెలంగాణ ప్రభుత్వం సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చింది. తాజాగా దుబాయ్‌లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల విడుదల కోసం మంత్రి కెటిఆర్ మరోసారి ప్రయత్నిస్తున్నారు. దుబాయ్ పర్యటిస్తున్న మంత్రి కెటిఆర్ సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఖైదీల విడుదల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెట్టుబడుల కోసం దుబాయ్ లో పర్యటించిన కెటిఆర్, ఖైదీల విడుదల అంశాన్ని దుబాయ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా దుబాయ్ భారత కాన్సిల్ జనరల్ కార్యాలయ అధికారులు, దుబాయ్ ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్బు లాయర్ తదితరులతో సమావేశం అయ్యారు. వారందరితో మంత్రి కెటిఆర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఖైదీల కేసు పురోగతి విషయాన్ని తెలుసుకున్న అనంతరం ఖైదీల క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేష్, గొల్లెం నాంపల్లి, దుండగుల లక్ష్మణ్ ,శివరాత్రి హనుమంతులు ఒక కేసులో ఇరుక్కుని దుబాయ్ లో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటికే 15 సంవత్సరాల జైలుశిక్ష పూర్తికాగా, వీరి విడుదల కోసం మంత్రి కెటిఆర్ స్వయంగా చొరవ చూపారు. ఈ కేసులో ప్రాణాలు కోల్పోయిన నేపాల్ కు చెందిన బాధిత కుటుంబం దగ్గరికి స్వయంగా వెళ్లి మంత్రి కెటిఆర్, దియ్య సొమ్ము (బ్లడ్ మనీ) అందించారు. ఆ తర్వాత ఆ కుటుంబం క్షమాభిక్ష పత్రాన్ని దుబాయ్ ప్రభుత్వానికి సమర్పించి క్షమాభిక్ష కోరారు. కొన్ని కారణాలు, నేరం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దుబాయ్ ప్రభుత్వం ఇప్పటిదాకా క్షమాభిక్షను ప్రసాదించలేదు. 6 నెలల కింద మరోసారి మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా దుబాయ్ లాయర్ కు అవసరమైన ఫీజులు చెల్లించారు. కొందరు అధికారులకు దుబాయ్ పంపించి మరీ క్షమాభిక్షపై పురోగతిని సమీక్షించారు. బాధిత కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహాన్ని షరియా చట్టం ప్రకారం దియ్యా( బ్లడ్ మనీ) రూపంలో అందించారు.

ఆ తర్వాత 2013 లోనే నేపాల్ విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకొని క్షమాభిక్షకు అవసరమైన పత్రాలను దుబాయ్ ప్రభుత్వానికి భారత కాన్సుల్ జనరల్ కార్యాలయం ద్వారా అందించారు. నిందితులకు ఉపశమనం లభించలేదని మంత్రి కెటిఆర్ బుధవారం మరోసారి భారత కాన్సిల్ జనరల్ కార్యాలయ అధికారులకు, దుబాయ్ అధికారులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సుదీర్ఘకాలం శిక్ష అనుభవించిన వారిని సత్ప్రవర్తన నివేదిక చూసి వారికి క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. వ్యక్తిగతంగా, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని వారికి మంత్రి కెటిఆర్ భరోసా ఇచ్చారు. దుబాయ్ కోర్టు తెలంగాణ ఖైదీలకు క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించింది. దాంతో దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ క్షమాభిక్ష ప్రసాదిస్తేనే సిరిసిల్ల వాసులకు ఉపశమనం కలుగుతుంది. కోర్టు అందుకు అంగీకరించకపోవడంతో రాజు ద్వారా మంత్రి కెటిఆర్ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

దుబాయ్ కాన్సల్ జనరల్ ఆఫీసు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కాన్సులేట్ జనరల్‌కు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే రాజకుటుంబానికి అత్యంత దగ్గర ఉన్న పలువురు వ్యాపారవేత్తలతో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి మానవతా దృక్పథంతో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐల క్షమాభిక్ష కోసం సహకరించాలని కెటిఆర్ కోరారు. ఆయన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన వారు దుబాయ్ ప్రభుత్వంతో ఈ విషయాన్ని స్థానిక చట్టాల మేర చర్చించేందుకు కృషిచేస్తామని కెటిఆర్‌కు హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News