Thursday, May 2, 2024

ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

KTR reviews on covid cases in task force committee meeting

 

పరిస్థితి అదుపులోనే ఉంది

ప్రభుత్వ చర్యలతో సత్ఫలితాలు
వచ్చే 3 నెలలకు సమగ్ర ప్రణాళిక
ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ల పంపిణీకి పటిష్ట కార్యాచరణ
రానున్న రోజుల్లో మందుల తయారీదారులు, వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశం
రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి
2.1 లక్షల మెడికల్ కిట్స్ అందజేత
మంత్రి కెటిఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ తొలి సమావేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. తెలంగాణ ప్రజలతో పాటు మిగతా నాలుగైదు రాష్ట్రాలకు కూడా హైదరాబాద్ కల్పతరువులా నిలిచిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఏర్పాటైన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ తొలి సమావేశం బుధవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో జరిగింది. కమిటీ ఛైర్మన్, మంత్రి కెటిఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సిఎస్ సోమేష్‌కుమార్‌తో పాటు కమిటీ సభ్యులు ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌తోపాటు సిఎంవో ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో కొవిడ్ చికిత్స మందులు, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్లు తదితర విషయాలపై సుధీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి కెటిఆర్ విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న హోం ఇసోలేషన్ మందుల నిల్వలో ఎలాంటి కొరత లేదని అన్నారు. ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఇంటి ఇంటికీ సర్వే చేస్తూ, అవసరం అయిన వారికి మెడికల్ కిట్స్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి అయిందని, ఇప్పటి వరకు 2.1 లక్షల మెడికల్ కిట్స్ అందజేశామని తెలిపారు. ఇది ఇన్ పేషంట్ విజిట్స్ అదనం అని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వల్ల వేలాది మందిని కాపడగలగామని మంత్రి కెటిఆర్ చెప్పారు. కొవిడ్ లక్షణాలు రాగానే ఈ మందులు వాడడం వలన సీరియస్ కండిషన్‌లో హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుందని తెలిపారు.

రెమిడెసివిర్ లాంటి మందుల నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల ఇంజెక్షన్లు ఉన్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఇంజెక్షన్లు తయారుచేస్తున్న కంపెనీల నుంచి అదనపు సరఫరాకు సమన్వయం చేస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ వినియోగంపైన వివరాలు తీసుకుంటున్నామని, వీటి వినియోగంపై ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని అన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తూ కట్టడి చేస్తున్నామని తెలిపారు. రెమిడిసివర్ ఇష్టారీతిన వాడొద్దని ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని అన్నారు. వీటితో పాటు సీరియస్‌గా ఉన్న రోగులు అరుదుగా, అత్యవసరంగా వాడుతున్న టోలిసిజుమాబ్ వంటి మరిన్ని మందుల సరఫరా కూడా సరిపడేలా చూసుకోవాలని తెలిపారు.

బ్లాక్ ఫంగస్ అంశంలో కూడా ప్రభుత్వం అలెర్ట్‌గా ఉందని అన్నారు. దీనికి అవసరం అయిన మందులను ప్రొక్యూర్ చేస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ సరఫరా గురించి ఈ సమావేశంలో చర్చించామని, ప్రస్తుతానికి అవసరము అయిన డిమాండ్- సప్లై పైన వివరాలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఆక్సిజన్ ఆడిట్ చేస్తుందని, అన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో అవసరమైన మేరకే ఆక్సిజన్ వినియోగించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కొవిడ్ కోసం ఏర్పాటు చేసినహెల్ప్ లైన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో కొవిడ్ నియంత్రణ చర్యల పర్యవేక్షణ కోసం మంత్రులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పభుత్వ, ప్రైవేటు లో ఆసుపత్రులు బెడ్స్ భారీగా పెంచామని వెల్లడించారు.

వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రానికి రావాల్సిన కోటా, గ్లోబల్ టెండర్ల విషయంపై సుధీర్ఘంగా చర్చించామని మంత్రి కెటిఆర్ తెలిపారు.దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడి జనాభా 92 లక్షలుగా ఉన్నదని, ఇందులో ఇప్పటికే 38 లక్షల మంది మొదటి డోస్ తీసుకున్నారని అన్నారు. వీరిలో 7.15 లక్షల మందితో పాటు 3 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నారని తెలిపారు. మొత్తంగా 10 లక్షలకు పైగా జనాభా పూర్తి వాక్సిన్ తీసుకున్నారని అన్నారు. వాక్సిన్ ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను ప్రారంభించిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కరోనాకి చికిత్సకు అవసరమైన మందుల తయారీదారులతో పాటు వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశం అవుతామని చెప్పారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కోసం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను కేంద్రం కేంద్ర ఆరోగ్య మంత్రి అభినందించారని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు కరోనా కట్టడికి చర్యలను ముమ్మరం చేస్తున్నామని, మరింత సమగ్రంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తామని మంత్రి ప్రకటించారు. టాస్క్‌ఫోర్స్ సమావేశాలు వరుసగా కొనసాగే ఒక సమగ్ర కార్యాచరణ దిశగా ముందుకు వెళ్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

KTR reviews on covid cases in task force committee meeting
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News