Thursday, May 2, 2024

హరిద్వార్‌లో కుంభమేళా ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Kumbh Mela begins in Haridwar

నెగటివ్ రిపోర్టు ఉంటేనే మేళాకు అనుమతి
ఉత్తరాఖండ్ సరిహద్దుల వద్ద ముమ్మరంగా తనిఖీలు

హరిద్వార్: ఉత్తరాఖండ్‌తోసహా దేశంలోని అనేక రాష్ట్రాలలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గురువారం హరిద్వార్‌లో కుంభమేళా లాంఛనంగా ప్రారంభమైంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న దరిమిలా కుంభమేళాను పురస్కరించుకుని పవిత్ర గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి తరలివస్తున్న భక్తులపై ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. ఎటువంటి అవాంతరాలు లేకుండా సురక్షితంగా కుంభమేళా జరగాలని కోరుతూ కుంభమేళా నిర్వహణ అధికారి దీపక్ రావత్, మేళా ఐజి సంజయ్ గుంజ్యాల్, హరిద్వార్ ఎస్‌ఎస్‌పి జన్మేజయ్ ఖండూరి తదితర అధికారులు గంగా నది ఒడ్డున ఉన్న వివిధ ఆలయాలలో ప్రార్థనలు చేశారు.

కరోనా వైరస్‌కు సంబంధించిన ఆర్‌టి-పిసిఆర్ నెగటివ్ రిపోర్టు ఉన్న యాత్రికులను మాత్రమే కుంభమేళాలో పాల్గొనేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. ఇందు కోసం ఉత్తర్ ప్రదేశ్‌తో ఉత్తరాఖండ్ సరిహద్దు వద్ద ఉన్న నర్సన్, ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లాలోని కాశీపూర్ వద్ద అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కుంభమేళా పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవడంతోపాటు యాత్రికులు తప్పనిసరిగా ఆర్‌టి-పిసిఆర్ నెగటివ్ రిపోర్టును తమ వెంట తీసుకురావాలని మేళా అధికారి దీపక్ రావత్ స్పష్టం చేశారు. కుంభమేళాకు వచ్చే యాత్రికులు తమ వెంట 72 గంటల లోపు తీసుకున్న ఆర్‌టి-పిసిఆర్ నెగటివ్ రిపోర్టును తీసుకురావాలని ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నప్పటికీ భక్తులు మాత్రం ఆర్‌టి-పిసిఆర్ నెగటివ్ రిపోర్టును తీసుకురావలసి ఉంటుందని హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. కుంభమేళాకు చేరుకున్న భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, తరచు చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి కరోనా నియంత్రణ చర్యలను పాటించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News