Sunday, April 28, 2024

చంద్రయాన్ 3 నుంచి విడిపోయిన ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భారత వ్యోమనౌక చంద్రయాన్ 3 గురువారం మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. ఈ వ్యోమనౌక లోని ప్రొపల్సన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’ విజయవంతంగా విడిపోయింది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి సిద్ధమైంది. ప్రొపల్సన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయిన తరువాత ల్యాండ్ మాడ్యూల్ పంపిన సందేశాన్ని బెంగళూరు లోని ఐఎస్‌టీఆర్‌ఏసీ కేంద్రం అందుకొంది.

“ థ్యాంక్స్ ఫర్ ది రైడ్, మేట్ ” అని ల్యాండర్ మెసేజ్ పంపినట్టు ఇస్రో ట్విటర్‌లో ప్రకటించింది. ఈ ప్రక్రియ పూర్తవడంతో ఇక నుంచి ల్యాండర్ మాడ్యూల్ జాబిల్లిని సొంతంగా చుట్టేస్తుంది. శుక్రవారం (ఆగస్టు 18) సాయంత్రం 4 గంటలకు డీ ఆర్బిట్ 1 ప్రక్రియ చేపట్టనున్నట్టు ఇస్రో తెలిపింది. ఆ తర్వాత 20న మరోసారి డీ ఆర్బిట్ 2 ప్రక్రియ చేపడతారు. ఈ ప్రక్రియలతో ల్యాండర్ వేగాన్ని క్రమంగా తగ్గిస్తారు. ల్యాండర్ … చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగేలా నిర్దేశించారు.

ఇక వేగాన్ని తగ్గించే ప్రక్రియ
ల్యాండర్ మాడ్యూల్ వేరు అయిన తరువాత అతికీలకమైన పరిణామం చోటు చేసుకోనున్నది. వ్యోమనౌక వేగాన్ని తగ్గించే ప్రక్రియను ఇస్రో చేపట్టనున్నది. చంద్రుడికి అతి దగ్గరి ప్రదేశమైన పెరిలూన్ (చంద్రుడి ఉపరితలం నుంచి 30 కి.మీ దూరం),అపోలూన్ (చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిమీ దూరం ) కక్ష లోకి ప్రవేశ పెడతారు. జాబిల్లిని తాకే సమయంలో ల్యాండర్ నిలుపు వేగం సెకనుకు 2 మీటర్లు, హారిజాంటల్ వేగం సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చూసుకోనున్నారు.

కక్ష్యలోనే కొంతకాలం ప్రొపల్సన్ మాడ్యూల్ పరిశోధన
మరోవైపు ప్రొపల్సన్ మాడ్యూల్ ప్రస్తుత కక్ష లోనే కొన్ని నెలలు / సంవత్సరాల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించనుందని ఇస్రో వెల్లడించింది. ప్రొపల్సన్ మాడ్యూల్ భూమి వాతావరణం యొక్క స్పెక్ట్రోస్కోపిక్ అధ్యయనం చేస్తుందని ఇస్రో వివరించింది. అంటే కాంతి, ఇతర రేడియో ధార్మిక కిరణాలను బయటకు పంపడం, వాటిని లోపలికి తీసుకోవడం గురించి అధ్యయనం చేస్తుంది. గాజుపట్టకం లోపలికి కాంతి వెళ్లడం, మళ్లీ దాని నుంచి బయటకు రావడాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు.

భూమిపై మేఘాల నుంచి పోలరైజేషన్‌లో వైవిధ్యాలను కూడా పరిశీలిస్తుందని ఇస్రో తెలిపింది. ప్రజలు నివసించడానికి అనువైన పరిస్థితులు సౌర మండలానికి వెలుపల ఉన్న నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహంలో ఉన్నాయేమో కూడా పరిశీలిస్తుందని ఇస్రో వివరించింది. చంద్రయాన్ 3 ని జులై 14న ఎల్ వీ ఎం 3 ఎం 4 రాకెట్ ద్వారా ఇస్రో విజయవంతంగా భూకక్షలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు తొలిసారి దీని కక్షను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశల వారీగా అయిదుసార్లు కక్షను పొడిగించారు.

5 వ భూకక్ష పూర్తయిన అనంతరం జాబిల్లి దిశగా ప్రయాణానికి గాను ఆగస్టు 1న ‘ట్రాన్స్ లూనార్ కక్ష ’ లోకి ప్రవేశ పెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష లోకి చేర్చారు. క్రమంగా కక్షలను తగ్గిస్తూ జాబిల్లికి చేరువ చేశారు. బుధవారమే చంద్రయాన్ 3 చివరి దశ కక్ష లోకి ప్రవేశించగా, గురువారం ప్రొపల్సన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయింది. అంతా సజావుగా సాగితే ఈనెల 23 న సాయంత్రం 5.47 గంటల సమయంలో ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News