Sunday, May 5, 2024

మణిపూర్‌లో పూర్తిగా విఫలమైన పోలీసు యంత్రాంగం: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్‌లో మే నుంచి జులై నెలాఖరువరకు శాంతి భద్రతలు, రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యాయని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో నమోదు చేసిన 6,000కు పైగా ఎఫ్‌ఐఆర్‌లపై తీసుకున్న చర్యలేమిటో వివరించడానికి రాష్ట్ర డిజిపి వచ్చే సోమవారం తమ ఎదుట హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. శాంతి భద్రతల యంత్రాంగమే ప్రజలను కాపాడలేకపోతే ప్రజలకు మిగిలిన ప్రత్యామ్నాయమేమిటని, వారు ఎక్కడకు వెళ్లాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది.

రాష్ట్రంలో ఘర్షణలను అదుపుచేయడంలో శాంతి భద్రతల యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, శాంతి భద్రతల పరిస్థితిపై రాష్ట్ర పోలీసులు పూర్తిగా పట్టు కోల్పోయారని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపైదర్యాప్తు నత్తనడకన సాగుతోందని, జరిగిన నేరాలను, బాధితుల వాంగ్మూల నమోదు మధ్య భారీ లోపాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.
మాజీ న్యాయమూర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి నష్టపరిహారాన్ని ఖరారు చేసే విషయాన్ని కూడా కమిటీనే నిర్ధారించేలా చూస్తామని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. దర్యాప్తూనకు ముందు ప్రక్రియ నిష్ఫాక్షికంగా ఉండాలని కూడా ధర్మాసనం తెలిపింది.

అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సిబిఐకి అప్పగించలేమని, కేసుల దర్యాప్తును పర్యవేక్షించేందుకు ఒక ఏదో ఒక యంత్రాంగం ఉండాలని ధర్మాసనం తెలిపింది. మార్చురీలో భద్రపరిచిన మృతదేహాలను గుర్తించేందుకు చేపట్టిన చర్యలేమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సంక్షుభిత ప్రాంతాలలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయని, వాటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని, చదువుకునేందుకు అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నదీ లేనిదీ చెప్పాలని ధర్మాసనం తెలిపింది.

ప్రస్తుతం అక్కడ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని, యుద్ధం మధ్యలో ఉన్నామని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అన్నారు. కొద్దిగా ఓపికపడితే పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిపై అగ్యాచారానికి పాల్పడినట్లు వెలుగుచూసిన వీడియోను ప్రస్తావిస్తూ ఆ ఇద్దరు మహిళలను మూకలకు అప్పగించిన పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. మే నెల ప్రారంభం నుంచి జులై నెలాఖరు వరకు రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కాని, శాంతి భద్రతలు కాని లేనట్లు కనపడుతోందని ధర్మాసనం మౌఖికంగా అభిప్రాయం వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News