Home ఎడిటోరియల్ ప.బెంగాల్‌లో ప్రతిపక్ష ఐక్యత నెరవేరేనా?

ప.బెంగాల్‌లో ప్రతిపక్ష ఐక్యత నెరవేరేనా?

CPI,-Congressపార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో భాగమైనప్పుడు వామపక్షాలకు తమ సైద్ధాంతిక సంకల్పాలు ఏ విధంగా ఉన్నా వాస్తవికతలను, ఆచరణాత్మకతలను కాదనలేవు. వీటికి సైద్ధాంతిక తకు మధ్య పోటీ వంటిది ఏర్పడినపుడు వారు వాస్తవికతలను ఎంచుకోక మరోమార్గం లేదు. ఈ మాట వారికి నిరుటి తీర్మానాల సమయంలో తెలియదని అనలేము. అయినప్పటికీ ఆ విధంగా ఎందుకు తీర్మానించారనే ప్రశ్నకు వారు మాత్రమే వివరణ ఇవ్వగలగాలి.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలా లేదా అన్న ప్రశ్న వామపక్షాలకు చాలా పెద్ద డైలమాగా పరిణమించి ఉంటుంది. అది అర్థం చేసుకోగలదే కూడా. అది డైలమాగా మారి ఉండనట్లయితే వారు గత కొద్దిమాసాలలో అంతలోనే సుముఖత, ఇంతలోనే విముఖతల మధ్య డోలాయమాన స్థితిని చూపేవారు కాదు. ఇక్కడ వామపక్షాలు అంటున్నది సిపిఎం గురించి. నిరుడు సిపిఎంతో సహా అందరూ ఇక నుంచి పొత్తు ప్రసక్తి లేదంటూ తీర్మానించారు. కాంగ్రెస్‌తోనేగాక జాతీయ స్థాయిలో మరే “బూర్జువా” పార్టీతో కూడా. ఆ వైఖరి ఎందుకు తీసు కున్నారో, మునుముందు ఏమి చేయగల మన్నారో పదేపదే చర్చలోకి వచ్చి అందరికీ తెలిసిన విషయాలే అయినందున ఇపుడు మళ్లీ చెప్పుకోనక్కరలేదు.
కాని ఆ తర్వాత ఉన్నట్లుండి వారికి వాస్తవ పరిస్థితులు ముందుకు రావటంతో పునరాలోచన మొదలైందనుకోవాలి. ఆ పరిస్థితులేమిటి? గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత బెంగాల్ వామపక్షాలు పాఠాలు నేర్చుకుని బలపడలేదు. పైగా, వారు స్వయంగా చెప్తున్న దానిని బట్టి తమ కార్యకర్తలు తగినంత శాతంలో తృణమూల్ కాంగ్రెస్ లేదా బిజెపిలోకి వెళుతున్నారు. ఈ పరిస్థితులలో మరొక కొద్ది మాసాల్లో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి అధికారం సాధించటం అట్లుంచి, అసెంబ్లీ బలం మరింత పడిపోతే ఆ ప్రభావం జాతీయస్థాయిలో, దేశమంతటా ఉంటుంది. తాము అధికారంలోకి వస్తుంటే త్రిపురను అట్లుంచినా, కేరళపై కూడా పడుతుంది. గణనీయంగా తగ్గిన పార్లమెంటు స్థానాలు ఇంకా తగ్గుతాయి. బెంగాల్‌లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత దేశవ్యాప్తంగా ఇతర రాజకీయ పార్టీల దృష్టిలోనే గాక ప్రజల స్థాయిలోనూ పడిపోయిన విలువ మరింత దెబ్బతింటుంది.
ఇతరులతో పొత్తులు వద్దంటూ నిరుడు సంకల్పాలు చెప్పుకున్నప్పుడు వారికి తెలియనిది కాదు ఇదంతా. అయినప్పటికీ దీర్ఘకాలికమైన ముందు చూపుతో, సాహసించి నిర్ణయాలైతే తీసు కున్నారుగాని ఆ సంవత్సరం ముగిసేసరికి ధైర్యం నిలబడలేదని ఇటీవలి మాసాల వ్యవహరణను బట్టి స్పష్టమవుతున్నది. దాని అర్థం నిరుటి తీర్మానాలలో వివేకం లేదని కాదు. కాని అందులో ఆచరణాత్మ కమైన వాస్తవిక దృష్టి లేదని వారి నాయకత్వాలకు ఆ తర్వాత తెలిసివచ్చిందనుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే, పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో భాగమైనప్పుడు వామపక్షాలకు తమ సైద్ధాంతిక సంకల్పాలు ఏ విధంగా ఉన్నా వాస్తవికతలను, ఆచరణాత్మకతలను కాదనలేవు. వీటికి సైద్ధాంతిక తకు మధ్య పోటీ వంటిది ఏర్పడినపుడు వారు వాస్తవికతలను ఎంచుకోక మరోమార్గం లేదు. ఈ మాట వారికి నిరుటి తీర్మానాల సమయంలో తెలియదని అనలేము. అయినప్పటికీ ఆ విధంగా ఎందుకు తీర్మానించారనే ప్రశ్నకు వారు మాత్రమే వివరణ ఇవ్వగలగాలి.
మొత్తానికి వారి ముందుకు వచిన రెండు వాస్తవిక పరిస్థితులలో ఇది ఒకటి కాగా, రెండవది బిజెపి నాయకత్వాన హిందూత్వ శక్తులు చేస్తున్న విస్తరణా యత్నాలు. గత ఎన్నికలలో బిజెపికి కేంద్రంలో స్వంత ఆధిక్యత లభించటం ఇందుకు ఆధారమైంది. ఆ తర్వాత రెండు అసెంబ్లీలను గెలిచినా మరికొన్నింటిని ఓడటం, ఉప ఎన్నికలూ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువభాగం దెబ్బ తినటం, ప్రధానమంత్రి నరేంద్రమోడీ పట్ల పట్టణ జనాభాలో, మధ్యతరగతిలో, ఉద్యోగ-వ్యాపార వర్గాలలో 2014నాటి ఆదరణ తగ్గుతుండటం, వివిధ ప్రాంతీయ పార్టీలు బలపడుతుండటం, కేంద్రం తర్వాత ఇక 2019 నాటికి అధిక రాష్ట్రాలను కైవసం చేసుకోవాలనే బిజెపి ప్రణాళిక సులభంగా నెరవేరగల సూచనలు లేకపోవటం వంటివి వామపక్షాలతోపాటు ఇతరులకు ఆశాభావాన్ని కలిగిస్తున్న మాట నిజం. బిజెపికి కొంత ఆందోళన కరమవుతున్నది కూడా కనిపిస్తున్నదే. కాని దాని అర్థం పరిస్థితి 2019 వరకు ఇదే విధంగా కొనసాగి తీరగలదనికాదు. మూడు సంవత్సరాలు దీర్ఘకాలం కనుక ఈ లోపల ఏదైనా జరగవచ్చు. అయితే తనకు సంబంధించి రాజకీయాలు పైన పేర్కొన్నట్లు పలు విధాలుగా ప్రతికూలం అవుతున్నట్లు గ్రహించిన బిజెపి, కొరతను పూడ్చు కునేందుకు ఇటీవల జాతీయతావాదం, హిందూత్వ వాదాల వేగాన్ని పెంచింది. ఇతర ప్రతిపక్షాలతో పాటు వామ పక్షాలకు ఎదురవుతున్న రెండవ ప్రశ్న ఇది. ఈ స్థితిలో చేయవలసింది ఏమిటి?
బిజెపి అధికారానికి వచ్చినపుడల్లా, వచ్చిన చోటనల్లా తమ లక్షాలను ముందుకు తీసుకు పోయేందుకు ప్రయత్నించటం ఎప్పుడూ ఉన్నదే. అదేపని ఈసారి కూడా చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే ఇతర సైద్ధాంతిక పార్టీల వలెనే వారు సైతం ఆ ప్రయత్నం చేయటం సహజమైంది. అందులో ఎవరెంత సఫలమయ్యారు, విఫలమయ్యారన్నది వేరే చర్చ. తాము విఫలమయ్యారు గనుక బిజెపి కూడ విఫలం కావాలని ఎవరూ అనలేరు. బిజెపి సఫల మైతే అందువల్ల పలానా హాని జరుగుతుందని ఎవరైనా అనదలుచుకుంటే అది కూడా వేరే చర్చ అవుతుంది. కాని ప్రస్తుతం చేస్తున్నది ఈ చర్చలు కాదు. ప్రస్తుతం తమ చేతగల అధికారాన్ని ఉపయోగించుకుని బిజెపి అటువంటి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నదన్నంతవరకే గుర్తించవలసిన విషయం. ఆ ప్రయత్నంలో వారి జోరు స్పష్టంగా కనిపిస్తున్నది. అంతిమ ఫలితాలు ఏమి కావచ్చు నన్నది వేరే విషయం. ఇప్పటికైతే ఆ ఉధృతి స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది ఇతర ప్రతిపక్షాలకు, వామపక్షాల కు ఆందోళన కలిగించే విషయం. రెండవ పరిస్థితి అంటున్నది దీనిని.
ఈ రెండింటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు వామపక్షాలకు తమ నిరుటి తీర్మానాల విషయమై డైలమా ముంచుకు వస్తే ఆశ్చర్యపడదగింది లేదు.ఈ రెండూ లేనట్లయితే వారు ఆ తీర్మానాలకు బద్దులై ఉండే వారేమో కాని అది ఇపుడు క్రమంగా బలహీనపడుతున్నది. ఇందుకు పశ్చిమబెంగాల్ ఒక సంకేతంగా మారింది. క్లిష్టపరిస్థితులనుంచి బయట పడేందుకు వారు చేయగల ప్రయత్నాలకు అదే రాష్ట్రం ప్రయోగశాలగానూ మారవచ్చు. అక్కడ కాంగ్రెస్ తో పొత్తు విషయమై జరుగుతున్న దానినంతా జాగ్రత్తగా పరిశీలించినపుడు, వామ పక్షాల ప్రస్తుత స్థితి గురించి, ప్రస్తుతపు చారిత్ర క దశ గురించి అర్థం కాగలది చాలా ఉంది. చివరకు పొత్తు ఉండవచ్చు. ఉండకపోవచ్చుగాక. అయినప్ప టికీ ప్రస్తుతం జరుగుతున్న దానిని బట్టి తెలుసుకోగలది ఎంతైనా ఉంది.
“తృణమూల్ కాంగ్రెస్‌ని ఓడించే నిమిత్తం పశ్చిమ బెంగాల్‌లో ప్రజల ఐక్యతను పటిష్టం చేయటానికి అన్ని ప్రజాతంత్ర శక్తుల సహకారం కోరుతున్నాం” – ఇదీ ప్రస్తుతానికి సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ వైఖరి. రాగల పరిణామాలను వేచి చూదాం.
-9848191767