Sunday, April 28, 2024

రాజకీయ ఖైదీలకు స్వేచ్ఛ ఎప్పుడు?

- Advertisement -
- Advertisement -

“ఓరా భగత్ సింగ్ భాయ్, ఓరా ఖుదీరామర్ భాయ్,
సమస్త రాజ్‌బందిదర్ ముక్తి ఛాయ్, ముక్తి ఛాయ్‌”
“వాళ్ళు భగత్ సింగ్ సోదరులు, ఖుదీరావ్‌ు సోదరులు

Life Sentenced to 2 men for Raping Minor

రాజకీయ ఖైదీలందరికీ విముక్తి కల్పించాలి, విముక్తి కల్పించాలి” బిపుల్ చక్రబర్తి, ప్రముఖ బెంగాలీ కవి.
‘బ్రిటిష్ పాలనలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ మనుషులుగా పరిగణించాలి’ అని కోరుతూ 63 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, 24 ఏళ్ళ జతిన్ దాస్ 1929 సెప్టెంబర్ 13న లాహోర్ జైలులో తుదిశ్వాస విడిచాడు. జతిన్ దాస్ బలిదాసం దేశం మొత్తాన్ని కదిలించింది. లాహోర్ నుంచి కోల్‌కతా వరకు రైలులో తరలించిన ఆయన శవంతో కలిసి ప్రజలు ఉప్పెనలా సాగారు. సుభాస్ చంద్రబోస్ ఆధ్వర్యంలో జతిన్ దాస్ అంతిమ యాత్ర మూడు కిలోమీటర్లు సాగింది. జతిన్‌దాస్‌ను ‘భాతర దేశం కోసం ఆత్మత్యాగం చేసిన యువ రుషి’ అని ఈ సందర్భంగా బోసు కొనియాడారు.

భారత దేశంలో జతిన్ దాస్ ఆత్మత్యాగం చేసిన సెప్టెంబర్ 13ను ‘రాజకీయ ఖైదీల దినోత్సవం’గా ప్రజాస్వామిక హక్కుల సంఘాలు జరుపుతున్నాయి. దేశ మంతా 75 ఏళ్ళ స్వాతంత్య్రోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ రోజుల్లో, ముఖ్యం గా ‘ఆజాదీ కా అమృత్ మెత్సవ్’ అధికారికంగా జరుపుకుంటున్న ఈ రోజు కూడా వేలాది మంది రాజకీయ ఖైదీలు జైళ్ళలో మగ్గుతున్నారు. బ్రిటిష్ పాలనలో ‘దేశద్రోహ నేరం’ లాగానే, స్వాతంత్య్రానంతరం కూడా చట్టవ్యతిరేక చర్యల నిరోధక చట్టం(యుఎపిఎ), జాతీయ భద్రతా చట్టం, క్రిమినల్ లా సవరణ చట్టం కింద అనేక మంది రాజకీయ ఖైదీలు బ్రిటిష్ కాలంలో స్వాతంత్య్ర సమర యోధుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో రాజకీయ ఖైదీలపై ‘తీవ్రవాదులు’ అని ముద్రవేసినట్టు గానే, ఈనాటి పాలకులు కూడా తమని వ్యతిరేకించిన వారిని ‘తీవ్రవాదులు’ అని సంబోధిస్తున్నారు. బ్రిటిష్ పాలకులు నిర్బంధించిన స్వాతంత్య్ర సమరయోధుల పట్ల ప్రధాన సమాచార స్రవంతి పైకి మొక్కుబడి సానుభూతిని ప్రకటిస్తూనే, ‘తీవ్రవాదులు’ అనే సంబోధించింది.

రాజకీయ ఖైదీలు స్వలాభంతో కాకుండా, మనస్సాక్షిగా వ్యవహరిస్తున్నారు కనుక వారిని ‘మనస్సాక్షి ఖైదీలు’ అని సంబోధించాలి. ప్రభుత్వం అన్యాయంగా అణచివేతకు పాల్పడడాన్ని వ్యతిరేకించడం, నిరసన తెలపడం అనేవి మనస్సాక్షి పిలుపులో ముఖ్యమైనవి. ఈ ఉద్దేశంతోనే వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం వల్ల వారు జైళ్ళపాలయ్యారు, చిత్రహింలకు గురయ్యారు, ఉరికంభా లెక్కారు. చాలా మంది ప్రభుత్వానికి చిక్కకుండా అజ్ఞాతంలోనే గడిపారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన లేదన్న కళంకం నుంచి బయటపడడానికి భారతీయ జనతాపార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయోద్యమాన్ని విశ్లేషించడానికి విపరీతమైన ఆసక్తిని కనపరుస్తున్నాయి. అయినప్పటికీ, నిరసనకారులను అరెస్టు చేయడం, జైళ్ళలో కుక్కడం ఏ మాత్రం ఆపలేదు. గత ఎనిమిదేళ్ళ వీరి పాలనలో లెక్కలేనంత మంది రాజకీయ కార్యకర్తలు, ప్రజాస్వామిక హక్కుల ఉద్యమకారులు నిర్బంధంలో గడుపుతున్నారు. మేధావులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, విద్యార్థులు, డాక్టర్లు, పర్యావరణవేత్తలు, చివరికి హాస్యనటులను కూడా క్రూరమైన చట్టాల కింద అరెస్టు చేసి జైళ్ళలో పెట్టారు. వారిలో కొందరికి కొన్ని నెలలు, సంవత్సరాల తరువాత బెయిల్ లభించినప్పటికీ చాలా మంది ఇంకా జైళ్ళలోనే మగ్గుతున్నారు. ప్రభుత్వ రాజకీయాలను వ్యతిరేకించడం, ధైర్యంగా నిజాలు మాట్లాడడం వల్లనే వారిని జైళ్ళలో కుక్కారు. బ్రిటిష్ కాలంలోని రాజకీయ ఖైదీలకు వీరు నిజమైన వారసులు కాగా, అందుకు భిన్నంగా తమ సైద్ధాంతిక భావజాలానికి చిహ్నంగా ఉన్న వి.డి. సావర్కార్ వంటి వారిని కీర్తిస్తూ ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతోంది. తమ రాజకీయ వ్యతిరేకులను, విమర్శకులను జైళ్ళలో పెట్టడంలో బ్రిటిష్ వారిని అద్భుతంగా అనుకరిస్తున్నారు. బ్రిటిష్ వారు మీరట్ కుట్ర కేసు (1929) కాన్పూర్ కుట్రకేసు (1924) వంటి అనేక కుట్ర కేసులను పెట్టి, లెక్కలేనంత మందిని జైళ్ళలో కుక్కి, విప్లవ పోరాటం మొత్తాన్ని దుర్మార్గమైనదిగా చిత్రించారు.

ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేక మంది విమర్శకులపైన, కార్యకర్తలపైన ‘జాతి వ్యతిరేకులు’, ‘తీవ్రవాదులు’ అని ముద్ర వేసి, భీమా కోరెగాన్ ఎల్గార్ పరిషత్ కేసు, ఢిల్లీ అల్లర్ల కేసులుపెట్టి జైళ్ళలోకి నెట్టారు. విద్యావేత్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, సాంస్కృతిక కార్యకర్తల వంటి మొత్తం 16 మందిపైన (జసూట్ ప్రీస్ట్, ఆదివాసీల కార్యకర్త, 84 ఏళ్ళ స్టాన్‌స్వామి జైల్లోనే మృతి చెందగా, 15 మంది మిగిలారు) ఎల్గార్ పరిషత్ కేసు పెట్టి అరెస్టు చేసింది. ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌ను జైల్లో పెట్టింది. “బ్రిటిష్ ఇండియాలో రాజు సార్వభౌమాధికారాన్ని దెబ్బ తీయడానికి, హింసాత్మక విప్లవం ద్వారా బ్రిటిష్‌సామ్రాజ్యం నుంచి భారత్‌ను విడదీయడానికి కుట్ర పన్నుతున్నారు” అని ఆరోపిస్తూ మీరట్, కాన్పూర్ కుట్ర కేసులను పెట్టిన బ్రిటిష్ వారసత్వాన్ని నేటి ప్రభుత్వం కొనసాగిస్తోంది. ‘అచ్చేదిన్’ ను, ‘నవ భారత సామ్రాజ్య చక్రవర్తి’ విధానాలను, చర్యలను వ్యతిరేకించడమే నేటి రాజకీయ ఖైదీలు చేసిన ప్రధాన నేరం. భీమా కోరెగావ్ కేసులో 16 మంది పేర్లు, ఉమర్ ఖలీద్ వంటి రాజకీయ ఖైదీల పేర్లు మనకు తెలుసు. వారి రాజకీయ రూపం చాలా పెద్దది.

ప్రతి రాష్ర్టంలోనూ యుఎపిఎ, ఎన్‌ఎస్‌ఎ, రాష్ర్ట పరిరక్షణ చట్టాల కింద అనేక మందిని అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కశ్మీర్ వంటి రాష్ట్రాలో అనేక మంది రాజకీయ ఖైదీలపైన భారత శిక్షా స్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సైనిక చట్టం, అల్లర్ల అదుపు చట్టం, అల్లర్ల నిరోధక చట్టం వంటి చట్టాల కింద కేసులు పెట్టారు. లోకానికి పెద్దగా తెలియని ఈ రాజకీయ ఖైదీలంతా సమాజంలోని ఆదివాసీలు, దళితులు, ముస్లింలు. విచారణ మొదలు పెట్టకుండానే వీరంతా ఏళ్ళ తరబడి, దశాబ్దాల తరబడి బెయిల్ కూడా దొరకకుండా జైళ్ళలో మగ్గుతున్నారు. ఆదివాసీల వంటి వారు బ్రిటిష్ పాలకుల కోపానికి గురైనప్పుడు వారిని ప్రతిఘటించారు. స్వతంత్ర భారత దేశంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మహరాష్ర్టలోని గడ్చిరోలి కేసులో పండు నరొటికి వైద్యం అందక ఇటీవలనే జైలులో మృతి చెందాడు. యుఎపిఎ కింద అరెస్టయిన రంజిత్ ముర్ము 2011లో పశ్చిమ బెంగాల్ లోని జైలులో మృతి చెందాడు. బ్రిటిష్ కాలంలో స్వాతంత్య్రం కోసం పోరాడిన ఆదివాసీ నాయకులు బిర్సా ముండా, సిద్ధు కన్హు లను ఉరితీసిన బ్రిటిష్ వారసత్వాన్నే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నది.

పార్లమెంటులో వేసిన ప్రశ్నకు సమాధానంగా హోంశాఖ గడిచిన జులై 20వ తేదీన ఇచ్చిన ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం 2020లో చట్టవ్యతిరేక నిరోధక చట్టం (యుఎపిఎ) కింద 6,482 మందిని అరెస్టు చేశారు. యుఎపిఎ కింద అరెస్టయిన వారి సంఖ్య 2016 నుంచి పెరుగుతూ వస్తోంది. ఈ కేసుల్లో శిక్షపడిన వారి సంఖ్య మాత్రం రెండంకెలు మించడం లేదు. ప్రజాస్వామ్యం అని చెప్పుకునే దేశంలో 75 ఏళ్ళ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్న దేశంలో, బిజెపి పాలనలో క్రూరమైన చట్టాల కింద ఆరు వేల మంది ప్రజలు జైళ్ళలో మగ్గుతున్నారు. అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే జైళ్ళ లో మగ్గుతున్న రాజకీయ ఖైదీల పట్ల అమానుషంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ జతిన్ దాస్ ప్రాణత్యాగం చేసిన నాటి పరిస్థితులు 75 ఏళ్ళ స్వాతంత్య్ర పాలనలో కూడా మారలేదు.

సరైన వైద్య సదుపాయం అందించకపోవడం, ఆయన పట్ల అమానుషంగా వ్యవహరించడం వల్ల స్టాన్ స్వామి జైల్లోనే ప్రాణాలు విడిచాడు. పార్కిన్ సన్‌తో బాధపడుతున్న 80 ఏళ్ళ వృద్ధుడు గ్లాసుతో నీళ్ళు తాగడం వీలుకాక, ఒక సిప్పర్ (కొమ్ముచెంబు) కావాలని న్యాయస్థానాన్ని కోరినా లభించని దయనీయ పరిస్థితిలో ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. వైద్యం అందని నిర్లక్ష్యం వల్ల పండు నరోటి జైల్లోనే మృతి చెందాడు. జైల్లో వైద్య సదుపాయలు నిరాకరించడం వల్ల భీమా కోరెగాన్ కేసులో నిందితుడైన వెర్నన్ గోస్వామి పరిస్థితి క్షీణించి ఆస్పత్రి పాలయ్యాడు. 2017లో అరెస్టయిన పోలియోమైలి టోస్‌తో బాధపడుతూ, తొంభై ఐదు శాతం వికలాంగుడైన ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా జైలులో చాలా అమానుషమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.

భారత దేశపు జైళ్ళలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలు అమానుషమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారికి కనీసం పుస్తకాలు, దుస్తులు, కనీస అవసరాలైన కళ్ళజోళ్ళు, మందులు అందనీయకుండా, బంధుమిత్రులతో కలవనీయకుండా ప్రభు త్వం కక్ష సాధింపునకు పాల్పడుతోంది. జతిన్ దాస్ ప్రాణత్యాగం నేటి భారత దేశంలో ఫలించలేదు. ప్రభుత్వానికి నిజంగా జైళ్ళపాలైన స్వాతంత్య్ర సమరయోధుల పట్ల ఆరాధనా భావం ఉన్నట్టయితే, ఈ 75 ఏళ్ళ స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో భారతదేశంలో సామాజిక, ఆర్థిక రాజకీయ స్వాతంత్య్రం కోసం సాగుతున్న పోరాటంలో ఉన్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి. దేని కోసమైతే స్వాతంత్య్ర సమరయోధులు జైళ్ళకు వెళ్ళారో, ప్రాణా లు త్యాగం చేశారో, అలాంటి “నిర్భయమైన మనసుతో తలెత్తుకుని జీవించే” దేశ పరిస్థితులు రావాలి.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News