Friday, May 3, 2024

ఆధార్ ఓటరు ఐడి లింక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

- Advertisement -
- Advertisement -
Lok Sabha approves Aadhaar Voter ID Link Bill
ఇది ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే: ప్రతిపక్షాలు
బోగస్ ఓట్లను అరికట్టడమే ప్రధాన లక్ష్యం: మంత్రి కిరెన్ రిజిజు
గొడవ మధ్యలోనే బిల్లుకు ఆమోదం

న్యూఢిల్లీ: ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. ఆధార్‌ను ఓటరుకార్డుతో అనుసంధానించేలా రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు మధ్యాహ్నం 12 గంటలకు సభలోప్రవేశపెట్టారు. నకిలీ ఓట్లను గుర్తించడమే లక్షంగా ఆధార్‌ను ఓటరు కార్డుతో అనుసంధానం చేయడానికే ప్రతిపాదిత బిల్లును ప్రవేశపెట్టినట్లు బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కిరెన్ రిజిజు చెప్పారు. బిల్లును వ్యతిరేకించే వారంతా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని రిజిజు ఈ సందర్భంగాతెలిపారు. అయితే కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్, ఎఐఎంఐఎం,ఆర్‌ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ‘ఆధార్ అనేది నివాసప్రాంతానికి సంబంధించిన సాక్షం మాత్రమే. ఓటరును ఆధార్‌కార్డు అడగడం అంటే నివాసప్రాంతాన్ని తెలియజేసే డాక్యుమెంట్‌ను మాత్రమే అడుగుతున్నట్లు లెక్క. అంటే పౌరులు కాని వారికి కూడా ఓటు వేసే హక్కును ఇచ్చినట్లే అవుతుంది’ అనికాంగ్రెస్ ఎంపి శశిథరూర్ అన్నారు.

ఓటువేయడమనేది చట్టబద్ధమైన హక్కుని, ఓటరు ఐడితో ఆధార్‌ను అనుసంధానం చేయడం తప్పని మరో కాంగ్రెస్ నాయకుడు మనీశ్ తివారీ అన్నారు. ఇంత ముఖ్యమైన బిల్లును ప్రభుత్వం హడావుడిగా ప్రవేశపెటాటల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధరి, ఎన్‌సిపికి చెందిన సుప్రియా సూలె ప్రశ్నించారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆధార్ కార్డును ప్రభుత్వం పౌరులందరికీ జారీ చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సౌగతా రాయ్ గుర్తు చేస్తూ, కేంద్రం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటోందని దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. స్వతంత్ర, రాఆజ్యాంగ బద్ధమైన ఎన్నికల కమిషన్‌ను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆధార్‌ను ఓటరు ఐడితో అనుసంధానిస్తే భవిష్యత్తులో అనేక ఓటర్ల పేర్లను తొలగించే అవకాశముందని మజ్లిస్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ వాదించారు.

ఓ వైపు విపక్ష ఎంపిలు బిల్లుకు తమ అభ్యంతరాలను తెలియజేస్తుండగా, మరో వైపు ఇతర విపక్ష సభ్యులు లఖింపూర్ ఖేరిలో రైతులను తన కుమారుడు వాహనాన్ని ఢీకొట్టినందుకు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను మంత్రివర్గంనుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయసాగారు. అయితే ప్రతిపక్షాల అభ్యతరాలు నిరాధారమైనవని ప్రభుత్వం పేర్కొంది. ‘ప్రభుత్వం దొంగవోట్లను, నకిలీ ఓట్లను ఆపాలని కోరుకుంటోంది. అందుకు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని సమర్ధించాలి’ అని రిజిజు అన్నారు. వాదోపవాదాలు, నినాదాలు కొనసాగుతూ ఉండగా స్పీకర్ సభను రెండు గంటల పాటు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే బిల్లుపై చర్చకు స్పీకర్ అనుమతించారు.అయితే విపక్ష ఎంపిలు మరోసారి ఆందోళన చేపట్టడంతో మరో 45 నిమిషాలు సభ వాయిదా పడింది. అనంతరం 2.45 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత కిరెన్ రిజిజు బిల్లుపై ప్రసంగించారు. ప్రతిపక్షాల ఆందోళనల నడుమనే స్పీకర్ బిల్లుపై ఓటింగ్ చేపట్టగా బిల్లును లోక్‌సభ ఆమోదించింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదాపడింది.

ఓటర్ల జాబితాను మరింత బలోపేతం చేయడం, ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపర్చడం, ఇసికి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటుగా బోగస్ ఓట్లను తొలగించడమే లక్షంగా పలు ప్రతిపాదనలున్న ఈ బిల్లుకు కేంద్రమంత్రివర్గం ఇటీవల ఆమోదముద్ర వేసింది. పాన్‌ఆధార్‌ను లింక్ చేసిన తరహాలోనే ఓటరు ఐడి లేదా ఎలక్టోరల్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయనున్నారు. కాకపోతే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛందంగానే ప్రజలే అనుసంధానించుకేనేలా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News