Saturday, September 20, 2025

ఐఫోన్ కోసం బారులు..బారులు

- Advertisement -
- Advertisement -

ముంబై: యాపిల్‌కు చెందిన ఐఫోన్లకు క్రేజ్ అంతా ఇంతా కాదు. యాపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను శుక్రవారం అధికారికంగా విక్రయించడం ప్రారంభించింది. ఈ ఫోన్ల కోసం ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, పుణె నగరాల్లో యాపిల్ స్టోర్ల వద్ద జనం బారులు తీరారు. ఉదయం ఐఫోన్లు కొనుగోలు చేయడానికి లైన్లో నిలబడిన సమయంలో కొంతమంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దేశంలోని నాలుగు అధికారిక యాపిల్ స్టోర్ల వద్ద కూడా అర్థరాత్రి నుంచే భారీగా జనసందోహం కనిపించింది. ఐఫోన్ కొనుగోలు కోసం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి) స్టోర్ వెలుపల భారీ సంఖ్యలో ప్రజలు అర్థరాత్రి నుంచే క్యూలలో నిలబడ్డారు. యాపిల్ ఈ నెల 9న జరిగిన తన వార్షిక కార్యక్రమం ‘ఓన్ డ్రాపింగ్’లో ఐఫోన్ 17 సిరీస్‌ను ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మోడళ్లు ఉన్నాయి. ఈ కొత్త మోడళ్లను యాపిల్ అధికారిక వెబ్‌సైట్, స్టోర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.

ప్రారంభ ధర రూ.82,900
యాపిల్ కంపెనీ ఐఫోన్ 17 ప్రొ, ప్రొ మాక్స్ మోడళ్లతో పాటు రెగ్యులర్ ఐఫోన్ 17, ఆల్ న్యూ ఐఫోన్ ఎయిర్‌ను ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.82,900 నుంచి రూ.2.3 లక్షల మధ్య ఉన్నాయి. ఐఫోన్ 17 సిరీస్ ప్రారంభ ధర రూ.82,900గా నిర్ణయించారు. దీనిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఐఫోన్ ఎయిర్ ఇప్పటివరకు యాపిల్ రూపొందించిన అత్యంత సన్నని మోడల్‌గా గుర్తింపు పొందింది. దీని ప్రారంభ ధర రూ.1.20 లక్షలుగా ఉంది. ఇక కొత్త గాడ్జెట్లలో రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌తో ఎయిర్‌పాడ్స్ 3 ప్రొను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. ఇవి ప్రపంచంలో తొలిసారిగా హృదయ స్పందన రేటును చూపించే వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు ఉన్నాయి. అత్యుత్తమ ఇన్-ఇయర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని కలిగి ఉన్న వీటి ధర రూ.25,900గా ప్రకటించారు. యాపిల్ వాచ్ లైనప్‌లో మూడు మోడళ్లను ఆవిష్కరించారు. వాచ్ ఎస్‌ఇ 3 ప్రారంభ ధర రూ.25,900 కాగా, వాచ్ సిరీస్ 11 ధర రూ.46,900గా ఉంది. అగ్రశ్రేణి మోడల్ వాచ్ అల్ట్రా 3 ధర రూ.89,900గా ప్రకటించారు. అల్ట్రా 3లో ఆఫ్-గ్రేడ్ కమ్యూనికేషన్ కోసం ఉపగ్రహ కనెక్టివిటీ ఉంది. సిరీస్ 11లో 24 గంటల బ్యాటరీ బ్యాకప్, ఎస్‌ఇ3లో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే ప్రత్యేకతగా నిలిచాయి. ఈ కొత్త లాంచ్‌లతో యాపిల్ అభిమానుల్లో విశేష ఉత్సాహం నెలకొంది.

Also Read: శ్రీశైలం ఘాట్‌లో ఎలివేటర్ కారిడార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News