Sunday, April 28, 2024

రైల్ నిలయం ముట్టడి

- Advertisement -
- Advertisement -

Maha Dharna for Railway Coach Factory in Kazipet

కాజీపేట్‌లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ కోసం మహాధర్నా
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పార్టీల నిరసన జ్వాలలు

మనతెలంగాణ/ హైదరాబాద్: కాజీపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టిఆర్‌ఎస్‌తో పాటు పలు పార్టీల నాయకులు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంను సోమవారం ముట్టడించారు. కాజీపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే నిధులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదుట మహాధర్నాను టిఆర్‌ఎస్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, చింతల యాదగిరి, కాంగ్రెస్, సిపిఐ, టిటిడిపి, ఇతర పార్టీల నాయకులు నిర్వహించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపిస్తూ రైల్ నిలయం ఎదుట నిరసన గళం వినిపించారు.ఈ సందర్భంగా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. రాష్ట్రవిభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని, జాతీయ రహదారులు, రైల్వేలైన్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

వరంగల్ లో రైల్వే డివిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. కాజీపేట్ ,- హుజురాబాద్ ,- కరీంనగర్ రైల్వే లైన్ పనులు సత్వరమే పూర్తి చేయాలని, రానున్న రోజుల్లో రైల్వే లైన్ పనులు, భూ సేకరణ వంటి అన్ని రకాల పనులను రైల్వే శాఖ నిధుల నుంచే వ్యయం చేయాలని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సిబ్బందితో రైల్వేలైన్స్ వేయడం వంటి అనేక కష్ట తరమైన పనులు చేయించుకుని.. అవి పూర్తయిన తర్వాత ప్రస్తుతం సుఖమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఇప్పుడు ఈ వర్గాలకు చెందిన ఉద్యోగుల అవసరం లేదని రైల్వే ఉన్నతాధికారులు భావిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కాజీపేట్ రైల్వే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుంటే బిజెపి నాయకులను వరంగల్ జిల్లాలో అడుగు పెట్టనిచ్చేది లేదని స్పష్టం చేశారు. అనంతరం రైల్వే ఇన్‌చార్జి జిఎంకు వారు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు యాదవరెడ్డి, సుందర్‌రాజ్, వరంగల్ నగర కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ చింతల యాదగిరి, కాంగ్రెస్ నాయకులు జంగా రాఘవరెడ్డి, సిపిఐ నాయకులు మేకల రవి, తిరుపతి, భిక్షపతి, సిపిఎం నాయకులు చుక్కయ్య, సిపిఐ ఎంఎల్ నాయకులు గోవర్ధన్, అప్పారావు, ఎమ్మార్పీఎస్ నాయకులు భిక్షపతి,రవి, రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News